చిలుక
'అమ్మా!
నా షూ ఎక్కడీ
నా బ్యాగ్ ఎక్కడా?
ఏమి టిఫిన్ చేసావు?
ఎందుకింత ఆలస్యం? స్కూల్ బస్సు వచ్చేస్తుంది. త్వరగా కానివ్వు అమ్మా!' అరుస్తున్నాడు నా పెద్దోడు. పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టి రెండు రోజులైంది. అయితేనేమి నన్ను పరుగెట్టిస్తున్నాడు.
ఇంతలో మా వారు 'బేబీ! నా బ్రష్ కనపడట్లేదు, పేస్ట్ ఎక్కడా? అని..!'
నిన్నరాత్రి అమ్ము ఆ రెండింటితో ఆడుకుని, ఎక్కడో పడేసింది. వెతికి తీసుకొచ్చి ఇచ్చాను. ఒక ఐదు నిమిషాల్లో పదిసార్లు పిలిచుంటారు తండ్రి, కొడుకులు. టవల్ అని మా ఆయన, టిఫిన్ అని నా కొడుకు. మధ్యలో మావయ్య, అత్తమ్మలకి కాఫీ పెట్టి ఇచ్చాను.
'అమ్మా!' అంటూ నా కూతురు నిద్రలేచింది. తనకి రెండు సంవత్సరాలు. ఒక పక్క తనని ఎత్తుకుని, ఎలాగో ఒకలాగా తంటాలు పడి అందరికీ టిఫిన్ చేసి, పెట్టేసాను.
'హమ్మయ్యా!' అంటూ కూర్చునేలోపు.. మా ఆయన 'ఏమేవ్ నా కొత్త షూస్ ఎక్కడా?' అంటూ.. ఇంకోవైపు నా కొడుకు 'అమ్మా లంచ్ బాక్స్ ఎక్కడా?' అంటూ ఒకటే అరుపులు. ఒక్కసారిగా గట్టిగా అరిచేయాలని అనిపించింది. 'నాకేమైనా నాలుగు చేతులు, నాలుగు కాళ్ళు, మెదడ్లు ఉన్నాయా? మీ పని మీరు చేసుకోలేరా?' అని.
నన్ను నేనే సముదాయించుకుని.. అన్నీ చేతికందించి, మా వారిని ఆఫీస్‌కి, నా కొడుకుని స్కూల్ బస్సు ఎక్కించి పంపేసాను. అప్పటికి నా వెన్నులో నొప్పి మొదలైంది. నా కూతురు పుట్టినప్పుడు సిజేరియన్ అయ్యింది. అప్పటికి చాలా తక్కువ బ్లడ్ ఉండేది. బాగా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ముందు ముందు ఎక్కువ బరువులు ఎత్తకూడదు. ఎక్కువ శరీరానికి ఒత్తిడిని ఇవ్వొద్దని డాక్టర్ చెప్పారు.
అలా అని అన్నీ మానేసుకుని కూర్చుంటే.. ఇంట్లో ఎక్కడి పని అక్కడ ఉండిపోతుంది. దీనితో పాటే ఈ మాయదారి తలనొప్పి ఒకటి.. ప్రాణం తీసేస్తుంది. కాసేపు కునుకు తీద్దామనుకుంటే అమ్ముకి తినిపించాలి. అత్త మామయ్యలకి మధ్యాహ్న సమయానికి భోజనం సిద్ధం చెయ్యాలి. అసలే వాళ్ళు షుగర్ పేషెంట్స్. టైంకి భోజనం పెట్టాలి. పైగా అత్తయ్యకి ఉప్పు లేని వంటలు చెయ్యాలి.
ఇలా అన్నీ ఆలోచిస్తూ... శక్తిని అంతా కూడగట్టుకుని పాపకి తినిపించి, నేను కొంచెం కడుపులో వేసుకున్నాను.
తలనొప్పి ఎక్కువయ్యేసరికి ఏమీ చెయ్యలేక స్పృహ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క వెన్నునొప్పితో నిల్చోలేక, కూర్చోలేక నానా అవస్థలు పడుతుంటే...
అమ్ము ఒక్కసారిగా 'అమ్మా!' అని పిలిచింది. ఆ పిలుపుకో లేక తలనొప్పికో కన్నీళ్లు తన్నుకొచ్చాయి.
ఇంతలో అత్తమ్మ వచ్చి 'పాపను నేను చూసుకుంటాను నువ్వు కాసేపు పడుకోమ్మా!' అని చెప్పేసరికి, అత్తమ్మ నిజంగానే దేవతలా కనిపించింది. నా పరిస్థితిని తెల్లవారి నుంచి చూస్తూనే ఉంది, అర్థం చేసుకుంది.
కాస్త కునుకు తీసానో లేదోగానీ పాప వచ్చి ఆడుకుంటూ లేపేసింది. పాపని చేతుల్లో తీసుకుని, వంటగదిలోకి వెళ్లాను. అత్తమ్మ వంట చేస్తూ, 'ఏంటి లక్ష్మీ అప్పుడే లేచేసావు, ఒంట్లో ఇప్పుడెలా ఉంది?' అని అడిగేసరికి.. 'బాగుంది అత్తమ్మా!' అంటూ వంట చెయ్యడంలో తలో ఓ చెయ్యి వేసేసాము.
వంట చేసేసాము. అందరమూ తిన్నాక కాసేపటికి పాప నిదురుపోయింది. నేను అలా వరండాలో కూర్చున్నా. ఆ సమయంలో గతం తాలూకు కల ఒక్కటి మెరుపులా మెరిసింది.
నేను చదువుకునే రోజుల్లో బాగా హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసేదాన్ని, వాటిని చూసి అప్పుడు అందరూ మెచ్చుకునేవారు. కాకపోతే పెళ్లి అయ్యాక, సమయం దొరకక క్రాఫ్ట్స్ చెయ్యలేకపోయాను. పైగా నా భర్త ఏమంటాడో అని వాటిని చెయ్యలేదు. ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. కానీ ఈ రోజు ఎందుకో ఆ కల నాలో ఆశగా మళ్ళీ చిగురించింది.
అనుకున్నదే తడవుగా నా స్నేహితురాలికి క్రాఫ్ట్స్ చేసి, పంపాను. మొదట అవి నచ్చుతాయో లేదో తెలియాలిగా. అలా నేను బాగా క్రాఫ్ట్స్ చేస్తున్నానా లేదా అని చూసుకున్నా.
వారం తర్వాత స్నేహితురాలి దగ్గరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రోజూ ఇంటిపనిలో పడి మర్చిపోయాను ఆ సంగతే. అమెరికా నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట, క్రాఫ్ట్స్ చాలా బాగా నచ్చాయన్న శుభవార్త చెప్పింది.
చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనము ఏదైనా కొత్తగా చేసినప్పుడు దానిని గుర్తించి, బాగుందని మెచ్చుకోడం మన విజయానికి తెలిమెట్టు. అంతేనా ఆ గుర్తింపు మనల్ని మరింత ముందుకెళ్లేలా చేస్తుంది.
అది విన్నాక నేను క్రాఫ్ట్స్ తయారుచేయాలి, వ్యాపారం కూడా మొదలెట్టాలని నిశ్చయించుకున్నా.
ఇంట్లో చెప్పాలి అంటే భయం. ఒప్పుకుంటారో లేదో అని.
ఈలోగా అమెజాన్ ఆన్లైన్‌లో క్రాఫ్ట్స్ అమ్మొచ్చు అని నా స్నేహితురాలి ద్వారా తెలుసుకున్నా. మనసుంటే మార్గముంటది అని చిన్నగా అమెజాన్‌లో అమ్మకానికి క్రాఫ్ట్స్‌ని పెట్టాలని అనుకున్నాను.
ఇంట్లో వాళ్ళకి తెలీదు. సరే అని ఒకసారి ఇలా బిజినెస్ చెయ్యాలనుంది అనగానే.. మా ఆయన ఒంటికాలుపై లేచారు నా మీద.
ఇంట్లో అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా 'ఆడపిల్లవి నువ్వు ఎలా చేస్తావు?' అని వంద ప్రశ్నలు వేశారు. 'పిల్లలున్నారు వాళ్ళని ఎవ్వరు చూసుకుంటారు? మేము వయసుయ్యిపోయి ఉన్నాం, మమ్మల్ని చూసుకోవాలి కదా? పల్లెటూరు నుంచి వచ్చావు, అసలు నీకేమి తెలుసు? ఎలా బిజినెస్ చేస్తావు? పెట్టుబడి ఎక్కడ నుంచి తెస్తావు?' అంటూ .. ఆ యక్ష ప్రశ్నలన్నీ నా మెదడులో రాత్రంతా ఊయలలూగాయి. కొద్దిగా నిరుత్సాహపడుతూ లోలోపల ఎలాగైనా వీళ్లని ఒప్పించి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని నిర్ణయించుకున్నా.
ఆరోజు అలా నా ఆలోచనకి వాళ్లు అడ్డుకట్ట వేసేసారు. కానీ నేను వెయ్యలేదు. సమయమున్నప్పుడు ఆన్లైన్ బిజినెస్ గురుంచి వీడియోస్ చూస్తూ కొంచెం నోట్స్ రాసుకున్నాను. అసలు ఎలా మొదలుపెట్టాలి అని ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. అమెజాన్‌లో అప్పటికే నా ఫ్రెండ్ ఒక బిజినెస్ అకౌంట్ చేసి ఇచ్చింది. అందులో ఏదో ఎప్పుడో ఒక ఆర్డర్ వచ్చేది. వచ్చినప్పుడు ఆ ఆర్డర్ చేసి, నా ఫ్రెండ్‌కి పంపేదాన్ని. ఇలా ఒక ఆరు నెలలు గడిచిపోయాయి.
ఇంట్లో అందరూ ఆ బిజినెస్ గురించి మర్చిపోయారు. నేను మాత్రం అవి రెడీ చేసి పంపిస్తూనే ఉన్నాను.
ఒకరోజు మా కుటుంబంతో కలిసి బెంగళూరులో పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. అందరూ కలిసి పెళ్లివారితో వెళ్ళాలి అనుకుంటూ ఉంటే, పాప ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళేది కాదు. కానీ ఆ రోజు మా ఆయన, అత్తయ్యామావయ్య, పిల్లాడు అందరూ కూడా ఒక కారులో ఎక్కేశారు. మగ పెళ్లివారు మాత్రం నన్ను లాక్కెళ్లి వాళ్ళ కారులో కూర్చోబెట్టుకున్నారు ఎంత చెప్పినా వినిపించుకోకుండా.
సరే అని నేను కారులో కూర్చున్నా, వెనకే వస్తున్నారు మా ఫ్యామిలీ అని. అలా కార్లో వెళ్తున్న సమయంలో మాట్లాడుతూ అందరూ నిద్రపోయాం. నా స్నేహితురాలు అప్పటికే చాలాసార్లు కాల్ చేసింది. మొబైల్ సైలెంట్‌లో ఉండిపోయింది. మా ఆయన కూడా చాలాసార్లు కాల్ చేశారు చూసుకోలేదు.
ఏదో అలికిడికి నిద్రలేచాం. డ్రైవర్ బెంగళూరుకి వచ్చేసామని అన్నాడు. సరే అని నా లగేజ్ మొత్తం దింపుకున్నా. రూమ్‌కి వెళ్ళి మొబైల్ చూసుకున్నా. చాలా మిస్డ్‌కాల్స్ ఉండేసరికి భయం వేసి, మా ఆయనకి మొదట కాల్ చేశాను. బాగా అరిచారు, వస్తున్న కార్ బ్రేక్‌డౌన్ అయ్యిందని. తర్వాత వేరే కారు మాట్లాడుకుని వస్తున్నామని చెప్పేసరికి, ఒంట్లో వణుకు కొంచెం తగ్గింది. 'సరే నువ్వు జాగ్రత్తగా చేరావా?' అని అడిగారు. 'అవును' అని చెప్పాను.
'సరే జాగ్రత్త!' అని కాల్ కట్ చేశారు.
ఇంతలో ఆడపెళ్లి వారు సంగీత్ అని చెప్పి అందరిని పిలుస్తున్నారు. సరే అని నేనూ తయారయ్యి, నా స్నేహితురాలికి కాల్ చేశా.. స్నేహితురాలితో మాట్లాడాక .. ఆకాశంలోని తారలన్నీ నా మోముపై వాలాయి. ప్రకృతి అందాలన్నీ నా కళ్ళ ముందు
ప్రత్యక్షమయ్యాయి. ఎన్నడూ లేని ఆనందాలు నన్ను చుట్టేసుకున్నాయి. ప్రపంచం మొత్తం కొత్తగా కనిపించింది. నేను అప్పుడే గొంగళిపురుగు నుండి సీతాకోకచిలుకలా మారాను అనిపించింది.
అంత సంతోషంలో ఉన్న నాకు ఆడపెళ్ళి వారు మరో కానుక ఇచ్చారు. నా హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఉన్నారు. మాటల్లో ఆ క్రాఫ్ట్స్ చేసింది నేనే అనేసరికి అక్కడ వాళ్లందరూ నన్ను సెలబ్రిటీని చేసేసారు.
ఇంతలో మా ఆయన, వాళ్లందరూ వచ్చేసారు. దాంతో మా వాళ్లకి ఘన స్వాగతం లభించింది.
ఆ క్రాఫ్ట్స్‌ని అందరూ పొగుడుతుంటే మా ఆయన, మా మావయ్య అత్తమ్మ పిల్లలు అందరూ చూసి చాలా బాగున్నాయి అన్నారు. వాళ్ళకి అప్పుడు చెప్పారు మీ ఆవిడే తయారుచేసింది అని. దాంతో వాళ్లందరికీ నోట మాట రాలేదు. వాళ్ళు అర్థం చేసుకున్నారు.
ఇంతకీ నా స్నేహితురాలు ఎందుకు కాల్ చేసిందో చెప్పలేదు కదూ..
ఒక ముప్పై లక్షల ఆర్డర్ వచ్చిందట నా క్రాఫ్ట్స్‌కి. దాంతో ఒక మార్కెటింగ్ ఏజెంట్‌ని నియమించుకున్నాను. నిరుపేదలైన ఒక ఐదుగురు మహిళలకి ఉద్యోగం ఇచ్చాను.
ఇక అటు నా ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు నా కలని సాకారం చేసుకున్నాను.
ప్రతీరోజూ, ప్రతీ ఉదయం మనము చూసే సీతాకోకచిలుకలు అందంగా కనువిందు చేస్తుంటాయి. గొంగళి కష్టం మాత్రం మనము చూడము.. కేవలం సీతాకోకచిలుక అందాన్ని తప్ప. ప్రతి స్త్రీమూర్తి ఒక సీతాకోకచిలుకే. ఇప్పుడు నా జీవితంలో నేను సీతాకోకచిలుకలా మార్చుకున్నాను. ఇది అందరికీ సాధ్యమే. అందంలోనూ, కష్టంలోనూ, ప్రేమ పంచడంలోనూ మనకి మనమే సాటి.
నవ జీవన్ రెడ్డి
9742377332