'ఏంటండీ! పాఠశాల నుండి ఇన్ని పుస్తకాలు పట్టుకొని వచ్చారు. అవి కూడా పాత పుస్తకాలు. ఎలాగూ పాఠశాలకు సెలవులు ఇచ్చేస్తున్నారు కదా అని, పిల్లల దగ్గర పాత పుస్తకాలు తీసుకొని కిరాణాషాప్‌లో అమ్మడానికి తెచ్చారా?' అని అడిగింది సుబ్బారావు మాస్టర్ భార్య కాంతం.
సుబ్బారావు మాస్టారు చిరాకుపడుతూ 'ఊరుకోవే! ఎవరైనా వింటే నవ్విపోతారు. పిల్లల పాత పుస్తకాలు తెచ్చి అమ్మే కర్మ మనకేం పట్టింది? ఇవి ఒకటి నుంచి ఐదు తరగతుల అన్ని సబ్జెక్టుల పుస్తకాలు. ఇవి అవసరం. అందుకే తెచ్చాను' అని సుబ్బారావు మాస్టర్ సమాధానం చెప్పారు.
'మీకు ఏ పని పాటు ఉండదు. ఆ మధ్య అంతా లెసన్ ప్లాన్స్ అంటూ సెలవుల్లో రాత్రీ పగలూ రాసుకుని కూర్చున్నారు. ఏం పని చెప్పినా చేసేవారు కాదు. మీ వల్ల నాకు అసలు సుఖమే లేదు. అన్ని పనులూ నేనే చేసుకోవాల్సి వస్తుంది' అంటూ చిరాకుపడుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కాంతం.
సుబ్బారావు మాస్టర్ భోజనం చేసి, తెచ్చిన పాత పుస్తకాలు ముందట వేసుకొని కూర్చున్నాడు. కాంతం వంటగది శుభ్రం చేసి బయటకు వచ్చింది. సుబ్బారావు మాస్టారు ఒకటో తరగతి తెలుగు విషయసూచికలోని పాఠాలు పేర్లు బట్టీ పడుతున్నారు. అడిగితే చిరాకు పడతారని బెడ్ రూమ్‌లోకి వెళ్లి పడుకుంది కాంతం.
కాంతం నిద్ర లేచేసరికి నాలుగు గంటలు అయింది. సుబ్బారావు మాస్టారు పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉన్నారు. భార్య రావడంతో 'కాంతం! ఇదిగో ఈ ఒకటో తరగతి తెలుగు పుస్తకంలో వరుసగా పాఠాల పేర్లు చెబుతాను. సరిగ్గా చెప్పానో లేదో చూడు' అంటూ ఒకటో తరగతి తెలుగు పుస్తకం కాంతం చేతిలో పెట్టాడు. 'ఇదేమిటండి! మీరు పాఠాల పేర్లు బట్టీ పట్టడం ఏమిటి? మీకేమైనా మతి పోయిందా?' అని అడిగింది.
'అయ్యో కాంతం! నేను అసలే సింగిల్ టీచర్‌ని. ఐదు తరగతులకు నేనే బోధన చేయాలి. ఈ మధ్య వస్తున్న పాఠశాల పర్యవేక్షణ అధికారులు పాఠశాలకు కూడా రాకుండా, నేరుగా పాఠశాలలో చదివే విద్యార్థుల ఇళ్లకే వెళ్లిపోతున్నారు. అక్కడి నుంచి ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి, ఏ తరగతిలో ఎన్ని పాఠాలు ఉన్నాయో అడుగుతున్నారు. పాఠాల పేర్లు చెప్పకపోతే, ఆ టీచరు ఆ పాఠశాలలో పిల్లలకి అసలు పాఠాలే చెప్పడం లేదని అనుకుంటున్నారు. పిల్లల ముందే ఉపాధ్యాయులను తిట్టేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ వేసవి సెలవుల్లో కూడా పిల్లల ఇంటికి పర్యవేక్షణ అధికారులు వెళ్ళవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా అన్నీ నేర్చుకుంటున్నాను' అని కాంతంకి విషయం విడమరచి చెప్పాడు.
కాంతం ఆశ్చర్యపోతూ 'ఇదేం చోద్యం.. పాఠశాల సమయంలో పాఠశాలకు వచ్చి, పర్యవేక్షణ చేయాలి కానీ ఇళ్ళ వెంట తిరుగుతూ పర్యవేక్షణ చేయడం ఏమిటి? ఈ వయసులో మీకు ఈ తిప్పలేమిటి? ఆ మధ్య స్కూల్లో బాత్రూమ్స్ ఫోటోలు మీకు తీయడం అలవాటైపోయి, సెలవు రోజుల్లో ఇంటి దగ్గర కూడా బాత్రూమ్ ఫోటోలు తీశారు. ఆదివారం మన ఇంటికి షాపు నుంచి తెచ్చే గుడ్ల మీద రంగుల స్టాంపులు లేవని నన్ను సతాయించేవారు. అవన్నీ పాఠశాలకు సంబంధించినవని, అవి పాఠశాలకే పరిమితం కావాలని చెప్పి చెప్పి ఇంటిదగ్గర ఆ అలవాట్లు మీకు తప్పించాను. కోరి కోరి బంగారం లాంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగ సంబంధాలు వస్తే వదిలేసి, మన కూతురుని కూడా ఉపాధ్యాయుడికి ఇచ్చే పెళ్లి చేశారు. అది నాలాగ ఎన్ని పాట్లు పడుతున్నదో!' అని కాంతం నిట్టూర్చింది.
'నువ్వు ఇంట్లో కూర్చుని ఇలాంటి కబుర్లే చెప్తావు. ఉపాధ్యాయుల పాట్లు నీకేం తెలుస్తాయి? పిల్లలు సరిగ్గా పాఠశాలకు రారు. అడిగితే ఆరోగ్యం బాగోలేదని ఒక అబద్ధమాడేస్తారు. తల్లిదండ్రులు కూడా దానికి వత్తాసు పలుకుతారు. నోట్సులు అసలు కొనరు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాతల్ని అడిగి, నోటు బుక్కులు ఇస్తే అవి ఉన్నంతవరకూ రాస్తారు. తర్వాత నోట్స్ కొనమన్నా కొనరు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన పుస్తకాలు వర్క్ బుక్కులు విడతల వారీగా డిసెంబర్ వరకూ ఇస్తారు. అవి కూడా అరకొర పద్ధతిలోనే ఇస్తారు. ఇందులో సెమిస్టర్ విధానములో పుస్తకాలు ఉంటాయి. ఏ సెమిస్టర్ ఏదో పిల్లలకు సరిగ్గా అర్థం కాదు. విద్యార్థులకు అన్ని పుస్తకాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా వారి వేలిముద్రలు నమోదు చేయమని అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తారు. ఇచ్చే బూట్లు కొలతలు కూడా విద్యార్థులకు సరిపడా ఉండవు. పాఠశాలకు వెళ్లాక ఈ సమస్యలు పరిష్కరించేటప్పటికీ ఉపాధ్యాయుల సమయం అంతా అయిపోతుంది. ఇక ఆ ఫోటోలు ఈ ఫోటోలు ఉన్నవి సరే సరి. ఇన్ని రకాల పనులు చేసుకుంటూ వెళ్లి, ఉపాధ్యాయుడు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ పాఠాలు చెబుతున్నారు. ఒక తరగతిలో అందరు విద్యార్థులూ ఒకే రకమైన తెలివితేటలు కలిగి ఉండరు అనేది అందరికీ తెలిసిన సత్యమే. ఆ తరగతిలో ఒక విద్యార్థి సరిగా సమాధానం చెప్పకపోతే ఉపాధ్యాయుడు పాఠాలే చెప్పడం లేదని ఢంకా బజాయించేస్తారు. చదివే విద్యార్థుల కోసం ఎవరూ చెప్పరు. అందుకే ఈ వారంలో పాఠాల పేర్లు నేర్చుకుంటాను. మరో వారంలో ఏ పేజీలో ఏ పాఠం ఉందో కూడా నేర్చుకోవాలి' అని సుబ్బారావు మాస్టారు తన బాధనంతా ఏకరువు పెట్టారు.
కాంతం భర్త అవస్థ చూసి అవాక్కయింది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో మునిగిపోయింది.
మొర్రి గోపి
8897882202