Oct 08,2023 12:14

'వసూ, చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్‌ చేశాను. ఉమెన్స్‌ డే సందర్భంగా కాలేజ్‌లో ఫ్యాకల్టీ అందరికీ పోటీ పెట్టారు. కాస్త కవిత్వాన్ని జోడించి ''స్త్రీ ఔన్నత్యం'' మీద ఒక ఆర్టికల్‌ రాయమన్నారు. నాకు గంటల తరబడి స్పీచ్‌లు చెప్పడమయితే వచ్చు కానీ రాయలేను కదా? వెంటనే నువ్వు గుర్తొచ్చావు. నీ భావాలు అన్నీ గుప్పించి, అదిరిపోయేలా రాసిస్తావా?' అంది శ్రావ్య.
'నేనా? వంటగదిలో గరిటలు తిప్పుకునేదాన్ని పెన్ను పట్టుకోమంటున్నావా? ఏ కూర ఎలా వండాలో అడుగు, చెప్తాను. ఆర్టికల్‌ రాయమంటే ఎలా రాయగలను?' ఆశ్చర్యంగా అన్నాను.
'మన స్కూల్లో జరిగే వ్యాసరచన పోటీల్లో ప్రతీ సంవత్సరం ప్రథమ బహుమతి నీకే వచ్చేది గుర్తుందా వసూ! నీతో ఎప్పుడు పోటీపడినా కనీసం ద్వితీయ బహుమతి కూడా నాకు వచ్చేది కాదు. అలాగే కాలేజ్‌లో కూడా ప్రతీ సంవత్సరం ఫస్టో, సెకండో బహుమతి నీకే వచ్చేది. ఒక్కోసారి నాకు నీ బుర్రలో ఉన్న మెదడు తీసి, నా బుర్రలో పెట్టుకోవాలనిపించేది తెలుసా?'
'హా హా! ఎప్పుడూ అలాగే గొడవ చేసేదానివి కదా, అది ఎలా మరచిపోతాను?' ఆపుకోలేనంత నవ్వు వచ్చేసింది నాకు.
'హమ్మయ్యా నవ్వావా తల్లీ! ఫోన్‌ చేసినప్పటి నుండి చాలా డల్‌గా మాట్లాడుతున్నావు' అంది శ్రావ్య.
'బాల్యం ఎంత బాగుంటుంది శ్రావ్యా! బరువులు, బాధ్యతలు ఏమీ తెలియవు. పగ్గాలు లేని గుర్రాలంత వేగంగా ఆలోచనలు దూసుకుపోయేవి. తరువాత దశ నుండీ అన్నీ కట్టుబాట్ల సంకెళ్లే. ఎంత కాదనుకున్నా మనకంటూ ఒక మనసుంటుందీ.. దానికీ ఒక ఇష్టం అనేది ఉంటుందీ.. ఇది ఎవరూ గ్రహించరెందుకు?' నా స్వరంలో నిరాశ తొంగి చూస్తుంది.
'వసూ! మళ్ళీ అదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నావు. ఒకరు నీ ఇష్టాన్ని గుర్తించి, నెరవేర్చాలని అనుకోవడం మంచిదే. అలా జరుగనప్పుడు నువ్వే ప్రయత్నించాలి కదా? ప్రయత్నలోపం ఉండకూడదని నువ్వు గ్రహిస్తే.. ఎవరు ఎందుకు గ్రహించాలనేది నీకే అర్థమవుతుంది' అంది శ్రావ్య.
'ప్రయత్నం చేయలేదంటున్నావా శ్రావ్యా? అన్నీ తెలిసే అలా మాట్లాడుతున్నావా?' అన్నాను నిస్సత్తువగా.
నా గొంతులో భావాన్ని గ్రహించిన శ్రావ్య 'సరే, వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. నీకు నీ బాల్యాన్ని గుర్తుచేస్తున్నాను. నేను ఒక అంశాన్ని ఇచ్చాను. అది పోటీలానే నువ్వు భావించి రాయాలి. రాయను, రాయలేను అనకుండా రెండురోజుల సమయంలో పూర్తిచేసి, నాకు వాట్సాప్‌ చెయ్యి. నువ్వు రాసిందే నేను అక్కడ ప్రెజెంట్‌ చేస్తాను.. అంటే పోటీలో పాల్గొంటున్నది నువ్వే! బై వసూ' అంటూ నా మాట కోసం ఎదురుచూడకుండా ఫోన్‌ పెట్టేసింది శ్రావ్య.
'నేను ఆర్టికల్‌ రాయగలనా? నేను దిగులుగా ఉన్నానని నా మనసు మార్చడానికి శ్రావ్య ఇలా అంటుందా?' మనసుని ప్రశ్నించుకున్నాను.
శ్రావ్య నా ప్రాణ స్నేహితురాలు.. నా మనసు బాల్యంలోకి పరుగులు తీసింది.

నాన్న నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు హార్ట్‌ఎటాక్‌తో చనిపోయారు. నా తరువాత ఇద్దరు తమ్ముళ్ళు. నాన్న ఉన్నంత కాలం మాకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలూ లేవు. నాన్న పోవడంతో మా ప్రపంచం ఒక్కసారిగా చీకట్లోకి విసిరేసినట్లయింది. అమ్మ పెద్దగా చదువుకోలేదు. అప్పుడు అమ్మకి ఒక ఆలోచన వచ్చింది. మా ఇల్లు చాలా పెద్దది. మధ్యలో గోడ కట్టించి, ఒక భాగం అద్దెకి ఇచ్చింది. రెండు గేదెలు కొని, పాడి పరిశ్రమ చేయడం నేర్చుకుంది. మా నాన్న మంచితనమో మా అమ్మ కష్టఫలితమో మేము ముగ్గురమూ చదువులో ముందంజలోనే ఉండేవాళ్ళం. మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు కూడా వచ్చేవి. శ్రావ్య, నేను చిన్నప్పటి నుండీ ఒకే క్లాస్‌, ఒకే బెంచ్‌. మా ఇళ్లు కూడా దగ్గర దగ్గరగానే ఉండేవి. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. కేజీ నుండి పిజీ వరకూ కలిసే చదువుకున్నాము. పిజీ అవడంతోనే మా కాలేజ్‌లోనే జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో మా ఇద్దరికీ అక్కడే ఉద్యోగాలు వచ్చాయి.
నాకు జాబ్‌లో జాయిన్‌ అయిన కొద్దికాలానికే పెళ్లి కుదిరింది. మాకు దగ్గర బంధువుల ద్వారా వచ్చిన సంబంధం కావడం వల్ల అమ్మ పెళ్లికి మొగ్గు చూపింది. ఉద్యోగం చేయాలి, చదివిన చదువుకి సార్థకత చేకూర్చాలనే నా ఆశ నెరవేరకుండానే జగన్‌తో పెళ్లయిపోయింది.

జగన్‌ దృష్టిలో భార్య అనే పదానికి నిర్వచనం భర్త ఇష్టాయిష్టాలు గుర్తించి మసలుకునే వ్యక్తి అని మాత్రమే.
'ఏవండీ నాకు ఉద్యోగం చేయాలని ఉంది. ఇంట్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని పనులు చేసి వెళ్తాను. ఇలా ఖాళీగా ఉండటం నాకు బాగుండటం లేదు' అన్నాను పెళ్లయిన కొత్తలో.
'నీకు ఖాళీగా ఉన్నాననిపిస్తే పనిమనిషిని మానిపించి, ఆ పనులు కూడా నువ్వే చెయ్యి. ఏవయినా కుట్లు, అల్లికలు ఉంటాయి కదా అవి చేసుకో. అంతేగానీ గడప దాటి బయటకు వెళ్ళేందుకు వీల్లేదు' అన్నాడు జగన్‌.
మొదట్లో ఆ మాటలు నన్ను చాలా గాయపరిచాయి. చాలా ఏడుపు వచ్చింది. రాను రాను దిగమింగుకోవడం అలవాటైంది. ఎందుకంటే ఆయన నా బాధను గుర్తించరు, పట్టించుకోరు.. శ్రావ్య రెండేళ్ల తరువాత తనతో పాటు పనిచేస్తున్న తోటి లెక్చరర్‌ని పెళ్లి చేసుకుంది. కాలం ఒరవడిలో రోజులు ఏడాదులుగా దొర్లిపోయాయి. నా ప్రపంచం నా ఇల్లు మాత్రమే. మా ఇంట్లో ఏదైనా ఆయనకు నచ్చినట్లు జరగాలి. నేనయినా, పిల్లలైనా సరే ఆయన చెప్పినట్లు వినాలి. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలకూ తావు లేదు.
'శ్రావ్యా, పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకూ నాకు వాళ్ల అవసరాలు తీర్చడం, వాళ్ళను చదువులకు పంపడం, వాళ్ళు వచ్చేవరకూ ఎదురు చూడటంతో సమయం గడచిపోయింది. పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి చేయడం? ఎందుకో అంతా శూన్యంగా అనిపిస్తుంది' చాలా నిరాశగా అన్నానోసారి.
నా జీవితంలోని అన్ని కోణాలు తెలిసిన ఏకైక వ్యక్తి తనే!
'అలా నైరాశ్యంలోకి జారిపోకు వసూ! ఇప్పటికైనా నీకు బాధ్యతల నుండి విరామం దొరికింది అనుకో. నీకు ఇష్టమైన అభిరుచులకు సానపెట్టు. మీవారితో మళ్ళీ మాట్లాడి చూడు, మెప్పించేందుకు ప్రయత్నించు' అంది శ్రావ్య.
'నాకంటూ స్వంత అభిరుచులు ఉన్నాయని కూడా మరచిపోయాను. మారుతున్న కాలానికి అనుగుణంగా నేను లేను శ్రావ్యా. ఇంటికి అంకితమయ్యాను. చదువుకున్న చదువు కూడా మరచిపోయాను' పేలవంగా నవ్వాను.
అలా నేను దిగాలుగా మాట్లాడుతున్న సమయంలో శ్రావ్య నన్ను ఆర్టికల్‌ రాయమని అడిగింది.

'ఏంటి? కూర్చునే కలలు కంటున్నావు?' శ్రీవారి పిలుపుతో వాస్తవంలోకి వచ్చాను.
'ఏమీ లేదండి, శ్రావ్య వాళ్ల కాలేజ్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టికల్‌ రాయమన్నారట. నన్ను రాయమని అడిగింది. అదే ఆలోచిస్తున్నాను' అన్నాను.
'ఏడ్చినట్లుంది! నువ్వు ఆర్టికల్‌ రాయడమేంటి? మీ ఫ్రెండ్‌కి మతి భ్రమించినట్లుంది. తను ఎలాగూ రోడ్లు పట్టుకొని తిరుగుతుంది కదా, నిన్ను కూడా చెడగొట్టాలని అనుకుంటుందేమో! ఆలోచించింది చాలు కానీ, లేచి భోజనం పెట్టు' ఎగతాళిగా అంటూ డైనింగ్‌ టేబుల్‌వైపు వెళ్ళాడు జగన్‌. నన్ను గురించి అన్న మాటల కన్నా శ్రావ్యని వ్యంగ్యంగా అన్న మాటలకు నాకు ఎక్కువ బాధ కలిగింది. కానీ అప్పుడు నేను ఏమి సమాధానం ఇచ్చినా, అక్కడ వాగ్యుద్ధం జరుగుతుందని తెలిసి మౌనంగా లేచాను.
ఆ రోజంతా ఏ పనిచేస్తున్నా నాకు శ్రావ్య అడిగిన అంశం గురించిన ఆలోచనలే మెదులుతున్నాయి. చిత్రం ఏమిటంటే నా మనసులో నిండి ఉన్న శూన్యం తొలగి, ఒక కొత్త ఊహకి స్థానం ఏర్పడినట్లు అనిపిస్తుంది. నాకు ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు. చిన్నప్పుడు వ్యాస రచన పోటీలకి ఇచ్చిన అంశం కోసం ఎలా ఆలోచించేదాన్నో సరిగ్గా అలాగే మారిపోయాను. ఉదయం త్వరగా లేచి నా పనులన్నీ పూర్తి చేసుకొని, ఆయన ఆఫీస్‌కి వెళ్ళగానే పిల్లల పుస్తకాల అలమారా దగ్గరకు వెళ్లి తెల్ల పేపర్ల కోసం వెతికాను, దొరకలేదు. కొన్ని రాయని పేజీలు ఉన్న పుస్తకం దొరికింది. పెన్‌ స్టాండ్‌లో ఉన్న పెన్‌ తీసుకొని రాయడానికి కూర్చున్నాను. కాగితంపై అక్షరం రాయడం మొదలు పెట్టినప్పుడు నా చేతులు వణికాయి. అది ఒక్క క్షణం మాత్రమే! నాకు తెలియకుండానే అరగంటలో రాయడం పూర్తయ్యింది. రాసినదంతా ఒకసారి చదువుకున్నాను. సంతృప్తిగా అనిపించింది. ఆలస్యం చేయకుండా శ్రావ్యకి వాట్సప్‌ చేసేశాను.
'హమ్మయ్యా' అని ఊపిరి పీల్చుకున్నాను. కాసేపట్లో నా ఫోన్‌ రింగ్‌ అయింది.
'ఎంత బాగా రాశావు వసూ! నా అంచనా తప్పలేదు. నా వసు బుర్రలో మేధాశక్తి సజీవంగానే ఉంది. నాకు ఇచ్చేస్తావా?' అని ఆనందంగా అంది శ్రావ్య.
'చాల్లే మరీ మునగచెట్టు ఎక్కించకు శ్రావ్యా! అది నువ్వు ఎడిట్‌ చేసుకో. అది రాయగలిగానన్న భావం నాకు తృప్తిని ఇచ్చింది' చాలా కాలానికి సంతోషంగా మాట్లాడాను.
నాలుగు రోజుల తరువాత శ్రావ్య వాట్సప్‌లో ఒక స్క్రీన్‌ షాట్‌ పంపింది. అందులో అక్షరం పొల్లు పోకుండా నేను రాసిన ఆర్టికల్‌, దానికి ప్రథమ బహుమతి వచ్చినట్లు ఇచ్చిన ప్రశంసా పత్రం ఉంది. నాకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి.
ఇంకా నేను వాస్తవ లోకంలోకి రాకముందే శ్రావ్య ఫోన్‌ చేసింది.
'చూశావా వసూ! నేను నువ్వు రాసిన వ్యాసాన్ని అక్షరం కూడా మార్చలేదు. ఈ ప్రశంసాపత్రం నాకు కాదు నీకు చెందుతుంది. నీకు రచనల పట్ల అభిరుచి ఉంది. రాయగల సత్తా ఉంది. అది కొనసాగించు. అందుకు అవసరమైన సహాయం నేను చేస్తాను' అంది శ్రావ్య.
'ఏదో ఒక వ్యాసం రాస్తే రచనా శక్తి ఉన్నట్లేనా? ఇప్పుడు వస్తున్న పుస్తకాలు కూడా నాకు తెలియదు. చదవడం, రాయడం పెళ్లితోనే ముగిసిపోయాయి' అన్నాను.
'అలా అనకు వసూ! అన్ని రకాల మ్యాగజైన్స్‌ చదువు, బయటకు వెళ్లే పుస్తకాలు కొనుక్కోనవసరం లేదు. అన్నీ ఆన్లైన్‌ పేమెంట్స్‌ చేయడమే. ముందు చదవడం మొదలుపెట్టు. తరువాత ఏం చేయాలో నువ్వే నాకు చెప్తావు' అంటూ నన్ను ఉత్తేజపరిచేలా అంది శ్రావ్య.

'నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదండీ! ఇద్దరి వంట ఎంతసేపు చేస్తాను? పుస్తకాలు చదువుకుంటే కాలక్షేపం అవుతుంది. కొన్ని మాగజైన్స్‌కు సబ్స్క్రిప్షన్‌ తీసుకుంటారా?' మా వారిని అడిగాను.
'పుస్తకాలు ఎందుకు? ఏముంటుంది అందులో? మగవాళ్ళ మీద రాళ్ళు రువ్వడం తప్ప ఏమీ ఉండదు. ఆడవాళ్ళకు స్వేచ్ఛ కావాలనే ఊకదంపుడు రచనలతో నిండిపోయి ఉంటాయి. రామకోటి తెస్తాను శుభ్రంగా రాసుకో పుణ్యమయినా వస్తుంది' అన్నాడు జగన్‌. అలవాటయిన మాటలే అయినా చివుక్కుమనిపించింది. అయినా నేను పట్టు వదలలేదు.
'మీరన్న రామకోటి తీసుకురండి. అలాగే నేను అడిగిన పుస్తకాలు నాకు కావాలి. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోండి' నెమ్మదిగా అయినా కచ్చితంగా చెప్పాను. ఆయనతో నాలుగు ఆన్లైన్లో మాగజైన్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ చేయించాను.
అప్పటి నుండి నేను చదవడం మొదలుపెట్టాను. ఎందరో కొత్త కొత్త రచయితలు, వారు రాసే విధానం, ఎంచుకున్న అంశాలూ అన్నీ అవగాహన చేసుకోవడం ద్వారా నిరంతర విద్యార్థినిగా మారిపోయాను.
'ఎప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకొని కూర్చుంటావు? పరీక్షలు ఏమయినా రాస్తున్నావా?' వెటకారంగా నవ్వుతూ అనేవాడు జగన్‌.
'నాకు టీవీ చూడటం కన్నా పుస్తకాలు చదవడం ఇష్టం. మీ పనులకు ఆటంకం కలిగించడం లేదు కదా!' నవ్వుతూ బదులిచ్చేదాన్ని.
'ఆ మధ్య ఎప్పుడు చూసినా సమస్తం కోల్పోయినట్లు ఉండేదానివి. పుస్తకాలు చదవడం వల్ల నీలో ఉత్సాహం పెరిగిందనిపిస్తుంది. కొంపదీసి రేపటి నుంచి రచనలు చేస్తాను అంటావా, ఏంటి?'.. మళ్ళీ వెటకారం.
'అదే అనుకుంటున్నానండి, రాయడంలో తప్పేముంది?' అన్నాను.
'అసలు నీకు రాయడం వచ్చనుకుంటున్నావా? ఒక వేళ రాసినా నీ పిచ్చి రాతలు ఎవరు పబ్లిష్‌ చేసుకుంటారు? పగటి కలలు మానుకుంటే బాగుంటుంది' అన్నాడు జగన్‌.
'సర్లెండి! నాకు రాయడం రాదు' అని బదులిచ్చాను.
రాయడం రాదు అన్నాను కానీ ఆ మాట నా పెదవులపై నుండి వచ్చింది. మనసు అంగీకరించడం లేదు. రాయాలనే కోరిక బలంగా కలిగింది.
రెండు రోజుల క్రితం వారపత్రికలలో కథల పోటీలు చూసిన విషయం గుర్తొచ్చింది.
పోటీ నియమాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాను. అంశం ఏదైనా సరే ఆసక్తికరంగా రాయగలగాలి. అర్థవంతంగా ఉండాలని ఉంది. చాలాసేపు ఆలోచించాను. శ్రావ్యకి ఫోన్‌ చేశాను.
'శ్రావ్యా, నేను కథ రాయాలని అనుకుంటున్నాను. మంచి టాపిక్‌ ఏదైనా చెప్తావేమోనని చేశాను' సంశయంగా అడిగాను.
'అబ్బా! ఎంత మంచి మాట చెప్పావు వసూ! మంచి ఆలోచన వచ్చింది.. వెంటనే ఆచరణలో పెట్టు. అంశం అంటూ ప్రత్యేకంగా ఏమి అనుకోవద్దు. నీ చుట్టూ ఉన్న వారిని చూడు, నీ మనసుని తాకిన ఏ సంఘటన అయినా సరే దానికి అక్షరాల రూపం ఇవ్వు' అంది శ్రావ్య.

నిర్ణయం నాకే వదిలేసిందని అర్థమయింది.. బాగా ఆలోచించాను. 'ఆడవాళ్ళు సమస్యలను అధిగమించి ముందుకు దూసుకువెళ్ళడం' గురించి రాయాలనిపించింది.
మొదటిసారి కథ రాసి పత్రిక వాళ్ళు ఇచ్చిన మెయిల్‌ ఐడీకి పోస్ట్‌ చేయమని శ్రావ్యకి పంపించాను. హామీపత్రంలో రచయిత్రి పేరు, మెయిల్‌ ఐడీ శ్రావ్యవి రాయమని చెప్పాను. శ్రావ్య అలా చేయడానికి ముందు ఒప్పుకోలేదు. కానీ నా బలవంతం మీద ఒప్పుకుంది.
ఆ రోజు నుండి నా ప్రతి ఆలోచన అక్షరరూపం దాల్చడం మొదలుపెట్టింది. అవన్నీ చాలా పత్రికల పోటీలకు శ్రావ్య ద్వారా పంపుతున్నాను. సమయం చాలా వేగంగా గడచిపోతుంది. నా దిగులంతా మచ్చుకైన కనిపించకుండా ఎగిరిపోయింది.
'అమ్మా, ఎలా ఉంటున్నావమ్మా? నీకు మాట ఇచ్చాను కానీ నాకు వెంట వెంటనే ఫోన్‌ చేయడం కుదరడం లేదు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఉంటుంది. ఇంటికి వచ్చాక మీ కోడలికి కాస్త పనిలో సహాయం చేస్తున్నాను. నువ్వే చెప్పావుగా తను కూడా కష్టపడి వస్తుంది సహాయం చేయమని' అన్నాడు మా అబ్బాయి ఒకరోజు.
'అమ్మా, మా ఆఫీసులో బోలెడు పనులు ఉంటున్నాయి. ఇంటి దగ్గర మా అత్తగారికి అన్ని పనులకూ నేను దగ్గర ఉండాల్సిందే! నాకు ఫోన్‌ చేసేందుకు కూడా సమయం చిక్కడం లేదు. నేను, అన్నయ్య లేకపోవడం వల్ల దిగులుగా ఉంటావు అని తెలుసు. కానీ ఏమీ చేయలేకపోతున్నాను' అంది మా అమ్మాయి ఒకరోజు.
'ఫరవాలేదు, మీకు మీ పనులుంటాయి. మీకంటూ మీ బాధ్యతలున్నాయి.. నేను ఏమీ అనుకోను. వీలైనప్పుడు ఫోన్‌ చేయండి. కుదిరినప్పుడు ఇక్కడకు వచ్చి వెళ్ళండి. నా అవసరం ఉంటే చెప్పండి, అక్కడకు వస్తాను' అని ఇద్దరికీ మనఃపూర్వకంగా చెప్పాను.
'నువ్వు ఇదివరకటిలా లేవమ్మా! నీ మాటల్లో, స్వరంలో హుందాతనం కనిపిస్తుంది' అన్నారు పిల్లలిద్దరూ.
'అవును.. మార్పు ఉంది! నిరర్థకంగా లక్ష్యం లేని దిశలో పయనించే నా జీవన నౌకకి సాహిత్యం అనే తీరం కనిపిస్తుంది' అని మనసులో అనుకున్నాను.
రెండు నెలల తరువాత పోటీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆనందంతో ఉక్కిరబిక్కిరయ్యాను. నా కథలకు ఒకటి ప్రథమ బహుమతి, మరొకటి ద్వితీయ బహుమతి వచ్చాయి. నాకు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అనుభూతి కలిగింది.
'శ్రావ్య ఆంటీ రాసిన కథ చదవండి!' అని మా పిల్లలకు పంపించాను.
'వావ్‌! ఆంటీకి కంగ్రాట్స్‌ చెప్పమ్మా.. కథ చాలా బాగా రాశారు' అని పిల్లలు అంటుంటే పొంగిపోయాను.
'శ్రావ్య కథకి బహుమతి వచ్చింది, మిమ్మల్ని చదివి చెప్పమంది' అని మా అయన్ని అడిగాను.
'నాకంత సమయం లేదు, ఆసక్తి లేదు! చేసే ఉద్యోగం సరిపోలేదా? ఈ రాతలు ఏంటి? వంట చేయడం మానేసిందా మీ ఫ్రెండు?' అన్నాడు జగన్‌.
'ఒకసారి చదివి చూడండి' అని బతిమిలాడాను. కానీ ప్రయోజనం లేకపోయింది.
నేను రాసిన కథల సంఖ్య పెరిగింది. ప్రచురించిన వాటిలో బహుమతులు వచ్చినవే ఎక్కువ. శ్రావ్య పేరు అన్ని పత్రికలలో మారుమోగిపోతుంది. అభిమానుల నుండి ఎన్నో ఫోన్‌ కాల్స్‌, ఎన్నో మెయిల్స్‌తో చాలా బిజీ అయిపోయింది.
'సొమ్మొకడిది... సోకొకడిది అన్నట్లు రాసేది నువ్వు.. పేరు నాకు. ఇదేం బాగాలేదు వసూ! ఇక ఈ నాటకానికి తెర దించేద్దాం' అంది శ్రావ్య.
'శ్రావ్యా! నాకు కావలసింది పేరు కాదు, నేను ఇంటికి మాత్రమే పరిమితం కావాలని మా ఆయన అనుకున్నారు. కానీ నా కలం నుంచి జాలువారిన రచనలు వెలుగు చూస్తున్నాయి. మొన్న నేను చూడకుండా పత్రికలో నేను రాసిన కథ ఆయన చదువుతున్నారు. నేను వచ్చేసరికి పుస్తకం పక్కన పెట్టారు. కనీసం నిన్ను అభినందించలేదు. ఆయన దృష్టిలో ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం సబబు కాదు అని.. ఆయన భార్యని ఆపగలిగారు కానీ కూతురిని, కోడలిని ఆపలేకపోయారు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం వల్ల ఆత్మవిశ్వాసంతో కుటుంబానికి అండగా నిలుస్తారు. అది ఆయన గ్రహించాలి శ్రావ్యా. నేను కథలు రాస్తున్నానని ఆయనకు తెలిస్తే రాయడం ఆపేయమంటే? అప్పుడు నా ఊపిరి ఆగిపోతుంది. పెళ్లయ్యాక ఉద్యోగం చేయవద్దన్నారు, ఆయన మాటకు విలువ ఇచ్చి మానేశాను. ఇప్పుడు నా కలం ఆగితే నేను భరించలేను శ్రావ్యా! ప్రతిఘటించలేక కాదు, విలువలకు కట్టుబడి మౌనం వహిస్తాను' ఆవేదనగా అన్నాను.
'సరే వసూ! నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నాను? నీ కథను ఒక నవలగా ఎందుకు రాయకూడదూ?' అంది శ్రావ్య.
నాకు ఆ మాట నిజమే అనిపించింది. నా జీవితంలో ప్రతి మలుపులో నేను ఎదుర్కొన్న కుదుపులు నవలగా రూపం దాల్చాయి. నవలల పోటీలో ఇరవయి వేల రూపాయల బహుమతి వచ్చింది.
'శ్రావ్యా! ఇది నేను ఊహించలేని గొప్ప విజయం. అందుకోలేని చందమామని నా అరచేతిలో పెట్టుకొని, చల్లని వెన్నెల కిరణాల వెలుగులో తడిసిన అనుభూతి. నా కళ్ళు ఆనందభాష్పాలతో వర్షిస్తున్నాయి. ఒకప్పుడు పుస్తకాలకు చందా కట్టడానికి డబ్బులు అడగాల్సి వచ్చింది. కానీ ఈ రోజు నా ప్రతిభ ఆర్థికంగా నాకు అండగా నిలబడింది. అంతేకాదు నా ఉనికి నాకు తెలిపింది..' చాలా ఉద్వేగంగా నా ఆనందాన్ని శ్రావ్యతో పంచుకున్నాను.
'ప్రతిభ రవి కిరణాల కన్నా తీక్షణమైనది వసూ! నీలో ఇన్నాళ్లు మరుగున పడింది. ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతుంది' అంది శ్రావ్య.

'వసూ, ఈ ఆదివారం మాకు ఒక సినిమా ప్రివ్యూ చూడటానికి ఆహ్వానం వచ్చింది. నువ్వు మీ వారు మాతో రావాలి! కాదని నన్ను నిరాశపరచకండి ప్లీజ్‌' అంటూ మావారు ఇంట్లో ఉన్న సమయంలో వచ్చి, అడిగింది శ్రావ్య.
'నేను రాను, మీ ఫ్రెండ్‌ని తీసుకెళ్లండి' అని నిర్మొహమాటంగా చెప్పేశాడు జగన్‌.
'ప్లీజండీ! ఈ ఒక్కసారికి నా ఆహ్వానాన్ని కాదనకండి!' అని శ్రావ్య బతిమిలాడింది.
తప్పనిసరయి జగన్‌ ఒప్పుకున్నాడు.
'వసూ, మేము థియేటర్‌కి బయల్దేరాము. మీరు కూడా తొందరగా వచ్చేయండి' అని ఆదివారం ఫోన్‌ చేసింది శ్రావ్య.
'మనం సినిమాకి వెళ్లి చాలా కాలమైంది. శ్రావ్య వాళ్ళు ఇందాకే బయలుదేరారట, మీరు తొందరగా కానివ్వండి, వెళ్దాం!' అని ఆయనతో అన్నాను.
'కంగారేముంది? వెళ్దాములే' అంటూ ఆలస్యం చేస్తూ అయిష్టంగా కదిలారాయన.
మేము వెళ్ళేసరికి సినిమా మొదలైంది. టైటిల్స్‌ కూడా వేసేశారు. సెల్‌ టార్చ్‌ వెలుతురులో మా సీట్‌ వెతుక్కొని, శ్రావ్య వాళ్ళ పక్కన కూర్చున్నాము.
'ఇంతాలస్యమయిందేంటి?' అని విసుక్కుంది శ్రావ్య.
'ఏం లేదులే!' అని నవ్వేశాను.
సినిమా చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది నేను రాసిన కథకి కొంచెం కల్పన జోడించినట్లు అనిపిస్తుంది. నేను రాసిన నవల సినిమా తీసారా? కాదు! అలా అయ్యుంటే శ్రావ్య చెప్పేదే? నా కథకి దగ్గరగా ఉండి ఉంటుంది. ఏమీ అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా నోరు తెరిచి అలా చూస్తుండిపోయాను.
అంతలో మూవీ అయిపోవడంతో అక్కడ జయజయధ్వానాలు నిండిపోయాయి. అప్పటికప్పుడు అక్కడ కోలాహలం నిండిపోయింది. అతిథులకు చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను.
'శ్రావ్యగారూ మీకు మా హార్థిక అభినందనలు! స్టేజీ మీదకు ఆహ్వానం పలుకుతున్నాము' అని మైక్‌లో వినిపించింది.
శ్రావ్య ఒకసారి నా వైపు చూసి.. వెంటనే ఒక చేత్తో నా చెయ్యి పట్టుకొని, మావారి వైపు తిరిగి 'మీరు కూడా నాతో రావాలి జగన్‌ గారు' అని బలవంతం చేసి మా ఇద్దరినీ స్టేజీ మీదకు తీసుకెళ్ళింది.
'ప్రముఖులందరికీ నమస్కారం! ఇప్పుడు మీకు ఒక నిజం చెప్పాలి. ముందుగా నన్ను క్షమించండి! ఈ గౌరవానికి అర్హురాలు నా ప్రాణ స్నేహితురాలైన వసుధ! తనే శ్రావ్య పేరుతో వచ్చే రచనల వెనుక ఉన్న ఘోస్ట్‌ రైటర్‌! తన నవలను సినిమా తీస్తున్నట్లు కూడా తనకు తెలియదు. వసూకి ఇంత గొప్ప ఆనందాన్ని బహుమతిగా ఇవ్వాలనే నేను ఇంతవరకూ తనతో చెప్పలేదు. ఈమే మీ అభిమాన రచయిత్రి' అంటూ తను మాట్లాడుతున్న మైక్‌ నా చేతికిచ్చింది శ్రావ్య.
మళ్ళీ ఊహించని పరిణామం! నాకు మాటలు రావడం లేదు. మావారివైపు చూశాను. ఆయన ముఖంలో ఆశ్చర్యం కన్నా ఆనందం ఎక్కువ కనిపిస్తుంది.. చప్పట్లు కొడుతున్నారు.
'సభకు నమస్కారం! ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కానీ నా విజయం వెనుక నా భర్త ఉన్నారు. వంటగదికి పరిమితం కాకుండా నా ప్రతిభ వెలుగు చూడటానికి ఆయనే కారణం. ఆడవాళ్ళు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే స్ఫూర్తిని పరోక్షంగా నాకు కలిగించింది ఆయనే. నా ఈ విజయం మా వారికే స్వంతం. అనుకోని ఇంతటి విజయానికి నాకు ఆనందంతో మాటలు కరువయ్యాయి'... అని క్లుప్తంగా ముగించాను.
చప్పట్లతో హాలు దద్దరిల్లింది. మావారి ముఖంలో ఎప్పుడూ చూడని ప్రసన్నతతో కూడిన మెరుపు కనిపించింది. అలాగే ఆయన కళ్ళల్లో సన్నటి నీటిపొర పలుచగా కదలాడటం స్పష్టంగా గమనించి, ఊపిరి పీల్చుకున్నాను. అది చూడగానే నేను ఆశించిన ప్రయోజనం దొరికినట్లయింది.
'నీ లాంటి స్నేహితురాలుండటం నాకు దేవుడిచ్చిన వరం! అందుకే నా రచనలు ఎప్పటికీ నీ పేరుతోనే ఉంటాయి. అది మన స్నేహానికి నేనిస్తున్న విలువ' అంటూ శ్రావ్యని కౌగలించుకున్నాను.
'వసూ! కథలో నువ్వు రాసింది అంచెలంచెలుగా నువ్వు రచయితగా ఎదగడమే.. కానీ వాస్తవంలో అన్నీ ట్విస్టులే' అంటూ ఆనందంతో నన్ను అల్లుకుపోయింది శ్రావ్య.

 

కెవి సుమలత
94926 56255