1.
రాలిన ఆకుల దేహాల్ని చూసి చింతపడకు
రాబోయే చిగుర్లకై కొంత ఆశని మిగుల్చు
ఊహా నిజమూ కలిసి
పగటినీ రాత్రినీ అల్లుతున్నారు
సాలెగూట్లో చిక్కుకుంది ఎవరని అడగకు
సందేహాల్లోకి క్రొత్త మబ్బులొచ్చి చేరాక
ప్రశ్నలు వేటికవే
క్రొత్తదారిని చూసుకుంటారు
2.
చుక్కలూ చంద్రుడూ ఆకాశాన్ని వెలిగించాక
రాత్రిది మొద్దునిద్ర అనే చెప్పు
చీకటీ మౌనం బద్దలయ్యాక,
తెల్లవారుఝాముకలది ఏ రంగో చెప్పకు
దుఃఖమే చూపయినప్పుడు
సమాధానం కురవకపోదు
3.
అవునూ.. శిలల ఆర్ద్రత శిల్పమయితే,
కన్నీటి ఏరులో మనుషులప్పుడు
మనసుల్ని స్వేచ్ఛని చేసి వదిలివేస్తారా
4.
చూడిటు, చిగురించిన జీవితాలని
హృదయాలైన గూళ్ళని
పచ్చని సంతకాలైన పరిసరాలని
5.
అయినా, పూల ఋతువు ఇదని
కథల్ని అల్లు రెక్కల మాలలతో
వసంతాన్ని తురుము
ఉదయంలోకి వాలిన పక్షులకు
కొత్త నిజాన్ని చెప్పు
అనూరాధ బండి.