Jun 25,2023 16:26

ప్రజాశక్తి - తాళ్లరేవు (కాకినాడ) : ఒకపక్క సాగునీరు అందక రైతాంగం ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క రొయ్యల కంపెనీ వ్యర్థజలాలు పంట కాలువలలోకి వదిలి సాగునీటి కాలువలను పాడు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరంగి పంచాయతీ పెద బొడ్డు వెంకటయ్యపాలెం గ్రామ పరిధిలోని పంట కాలువలోకి అపెక్స్‌ రొయ్యల కంపెనీ వ్యర్థ జలాలను వదిలి పంట కాలువ నాశనం చేస్తున్నారని స్థానిక ఎంపిటిసి పాలెపు చిన పోసయ్య , కోరంగి ఉపసర్పంచ్‌ కామాడి భైరవమూర్తి తెలిపారు. ఆదివారం వంటకాలువ వద్ద విలేకరులతో వీరు మాట్లాడారు. అపెక్స్‌ కంపెనీ మ్యాన్‌ హౌల్‌ లోంచి వదిలిన వ్యర్ధ జలాల వల్ల త్రాగునీరు కలుషితం అవుతుందన్నారు. ఇదే పంట కాలవ ద్వారా చిన్నబొడ్డు వెంకటయ్యపాలెంలోని రక్షిత త్రాగునీటి పథకంలో కొళాయి చెరువులోకి సాగునీరు మళ్లించి త్రాగునీరుగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల క్రితమే కంపెనీ వ్యర్థ జలాలు పంట కాలువలోకి వదిలిన నీటిపారుదల శాఖ అధికారులు నేటి వరకు ఆ కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. రొయ్యల కంపెనీ యొక్క మ్యాన్‌ హౌల్‌ శాశ్వతంగా మూసి వేయించాలని, పంట కాలవలోకి వ్యర్థ నీరు వదిలినందువల్ల కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్‌ చేశారు.