
విద్యుత్ నిరంతర సరఫరా చేయాలనే పేరు పెట్టి అప్పటికప్పుడు మార్కెట్లో స్వల్పకాలికంగా కొనుగోళ్ల పేరుతో విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులు కూడా లేకుండా అధిక రేట్లకు ప్రైవేట్ కంపెనీల నుండి కరెంటు కొంటున్నారు. ఇటీవల కేంద్రం కృత్రిమంగా బొగ్గు కొరత సృష్టించింది. ఆ పేరుతో మార్కెట్లో యూనిట్ రూ.3 నుండి రూ.5 వరకు ఉన్న కరెంటును రూ.20కు పెంచేశారు. ప్రభుత్వం మార్కెట్లో రూ.20కు కొన్నది. ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతున్నది. వీటన్నిటిలో లాభపడేది బడా కార్పొరేట్ కంపెనీలే.
కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ ఇప్పుడు కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది. ఈరోజు వాడుకున్న కరెంటుకే కాదు. ఏనాడో వాడుకున్న కరెంటుకు కూడా, ఆ రోజు బిల్లు కట్టినా, ఆ నాడు వాడిన కరెంట్ పై ఇప్పుడు ట్రూ అప్ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. 2014 నుండి 2019 వరకు వాడుకున్న కరెంటుకి ఆరోజు ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారం అందరూ బిల్లులు కట్టేశారు. కానీ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ఇప్పుడు లెక్కలు చూసుకున్నాయంట. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైందని తేల్చారు. దానినే ట్రూ అప్ చార్జీలు అంటున్నారు. జులై నెల బిల్లుల నుండి, ఇప్పుడు వాడుకున్న కరెంటుకే కాకుండా 2014 నుండి 2019 వరకు వాడుకున్న కరెంటుకు అదనంగా యూనిట్‌కి 23 పైసలు చొప్పున ఇప్పుడు వసూలు చేస్తున్నారు. 36 నెలల పాటు ఇలా వసూలు చేస్తారు. ఇప్పుడు మళ్లీ 2022 జనవరి నుండి మార్చి వరకు వాడుకున్న కరెంటుకు కట్టిన కరెంటు బిల్లులు చాలలేదంట. లోటు వచ్చిందంట. రూ.1048 కోట్లు అదనంగా ట్రూ అప్ చార్జీలు మళ్ళీ వేయడానికి రంగం సిద్ధమైంది. యూనిట్టుకు 43 పైసల నుండి రూపాయి ఆరు పైసల వరకు అదనంగా చెల్లించాలి. ముందుగా అంచనా వేసిన దానికంటే 530 మిలియన్ యూనిట్ల వినియోగం తగ్గినప్పటికీ, మూడు నెలలకే రూ.1048 కోట్ల ఖర్చు ఎందుకు పెరిగింది? దీనిని బట్టి పెంచిన చార్జీలే కాకుండా ట్రూ అప్ చార్జీల భారం సంవత్సరానికి 4 వేల కోట్ల రూపాయలు మించిపోతుంది. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు సగటున 10.35 నుండి 9.61 శాతానికి తగ్గినట్లు లెక్కలు చెప్పారు. పంపిణీ నష్టాలు తగ్గితే విద్యుత్ చార్జీలు తగ్గాలి. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరిగాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోలులో ఆదా చేశామని, జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పింది. అయినా ఖర్చులు ఎందుకు పెరిగాయి? చార్జీలు ఎందుకు పెంచారు? మళ్ళీ అదనంగా ట్రూ అప్ చార్జీలు ఎందుకు విధిస్తున్నారు? వీటికి వైయస్సార్‌సిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దీనిపై విద్యుత్ నియంత్రణ మండలి సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాదులో బహిరంగంగాను, 9వ తేదీన ఆన్‌లైన్లోనూ విచారణ జరుపుతోంది. తరువాత ఆర్డర్ ఇస్తారు. జనంపై భారాలు మోపుతారు.
జగన్ మార్కు బాదుడు
గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు రకరకాల రూపాల్లో కరెంటు భారాలు మోపాయి. గత ప్రభుత్వాన్ని విమర్శించి, కరెంటు చార్జీలు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పి, చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వాలను మించి జగన్ మార్కు బాదుడు ప్రారంభించారు. దశలవారీగా వడ్డిస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి స్లాబులు మార్చారు. రేట్లు పెంచారు. ప్రభుత్వ లెక్క ప్రకారం రూ.1400 కోట్ల భారం మోపారు. వాస్తవ లెక్కల్లో అది 3 వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. 2014 నుండి 19 వరకు వాడుకున్న కరెంటుపై రూ.2900 వందల కోట్ల ట్రూ అప్ చార్జీల వసూళ్లు ప్రారంభించారు. అదనపు లోడ్ డిపాజిట్లు, అదనపు కస్టమర్ డిపాజిట్లు పేరుతో వేల రూపాయలు మధ్యమధ్యలో పీడించి మరీ వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారులు మొదలుకొని అందరిపై ఫిక్స్‌డ్ చార్జీలు, పెనాల్టీల పేరుతో కొత్త రూపాలలో జేబులు ఖాళీ చేస్తున్నారు. మీటర్ చార్జి, విద్యుత్ సుంకం ఇలా రకరకాల పేర్లతో దండుకుంటున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మంచి నీరు, లైటింగ్, డ్రైనేజీలకు వాడే కరెంటుకు రేట్లు పెంచేశారు. ప్రజలే పరోక్షంగా పన్నుల రూపంలో వాటిని చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే కరెంటులో కోతబెట్టి భారం మోపారు. ఏ షాపులోకి వెళ్లినా పాల ప్యాకెట్, కూల్ డ్రింక్ బాటిల్ పైన అదనంగా రూపాయి వసూలు చేస్తున్నారు. ఫ్రిజ్‌లో పెట్టినందుకు కరెంటు చార్జి పేరుతో ఈ భారం వేస్తున్నారు.
కార్పొరేట్ల లాభాల కోసమే ప్రజలపై భారాలు
విద్యుత్ ఉత్పత్తి దాదాపు 60 శాతం ప్రైవేటు బడా కంపెనీల చేతిలోనే ఉన్నది. వారికి లాభాల పంట పండుతున్నది. వారి లాభాల కోసం సామాన్యుల జేబులు ఖాళీ చేసి వారిపై భారాలు మోపుతున్నారు. సోలార్, పవన (విండ్), గ్యాస్ ద్వారా కరెంటు తయారు చేసే కంపెనీల నుండి విద్యుత్ కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందాలు (పిపిఎ) చేసుకున్నారు. ఒకప్పుడు రూ.12 వరకు ఉన్న సోలార్ విద్యుత్ రేటు నేడు రూ.2కు పడిపోయినా...రూ.12కు కరెంటు కొని ఆ మొత్తం ప్రజల పైనే వేస్తున్నారు. ప్రభుత్వ థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తికి అవకాశం ఉన్నా నిలిపివేసి లేదా తగ్గించి ప్రైవేటు సంస్థల నుండి కరెంటు కొంటున్నారు. ప్రైవేటు సంస్థలకు అధిక రేట్లు చెల్లించాలి. ప్రభుత్వ ధర్మల్ ప్లాంట్లలో విద్యుత్తు తయారు చేయకపోయినా నిర్వహణ ఖర్చులు, ఫిక్స్‌డ్ చార్జీలు భరించక తప్పదు. ఈ మొత్తాన్ని సామాన్యులపై కరెంటు చార్జీల పేరుతో రుద్దుతారు. విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ నిరంతర సరఫరా చేయాలనే పేరు పెట్టి అప్పటికప్పుడు మార్కెట్లో స్వల్పకాలికంగా కొనుగోళ్ల పేరుతో విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులు కూడా లేకుండా అధిక రేట్లకు ప్రైవేట్ కంపెనీల నుండి కరెంటు కొంటున్నారు. ఇటీవల కేంద్రం కృత్రిమంగా బొగ్గు కొరత సృష్టించింది. ఆ పేరుతో మార్కెట్లో యూనిట్ రూ.3 నుండి రూ.5 వరకు ఉన్న కరెంటును రూ.20కు పెంచేశారు. రూ.20కు ప్రభుత్వం మార్కెట్లో కొన్నది. ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతున్నది. వీటన్నిటిలో లాభపడేది బడా కార్పొరేట్ కంపెనీలే. ప్రభుత్వ పెద్దలతోపాటు అధికార యంత్రాంగం కూడా అవినీతికి పాల్పడుతున్నది. లబ్ధి పొందుతున్నది. విద్యుత్ రంగం మొత్తాన్ని అంబానీ, అదానీలకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతోంది. భారతదేశం లోనే కాకుండా విదేశాలలో సైతం వీరికే కాంట్రాక్టులు ఇప్పిస్తోందని శ్రీలంకలో బట్టబయలైంది. కరెంట్‌కి అవసరమైన బొగ్గుగనులన్నీ వీరి వశం అయిపోయాయి. దేశంలో బొగ్గు కొరత ఉంది కాబట్టి, విద్యుత్ సంస్థలన్నీ విదేశాల నుండి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిందేనని కేంద్రం షరతులు విధించింది. విదేశాలలో, ఆస్ట్రేలియాలో బొగ్గు గనులను అదాని కొనుగోలు చేశారు. బొగ్గును ఎగుమతి చేసే ఓడరేవులు అదానీ పరమైపోయాయి. విద్యుత్తు తయారు చేసే సోలార్, పవన, థర్మల్ విద్యుత్ ప్లాంట్లను అంబానీ, అదానీ కైవసం చేసుకుంటున్నారు. వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కృష్ణపట్నం ధర్మల్ ప్లాంటును ప్రభుత్వం నడపలేదని, ప్రైవేటువారికి కట్టబెడుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. త్వరలో అది అదాని పరమవుతుందని వార్తలు వస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ పేరుతో 30 సంవత్సరాల పాటు సంవత్సరానికి 7 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించే ఒప్పందాన్ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇసిఐ) ద్వారా రిలయన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఒప్పందం చేసుకున్నది. ఈ బడా కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపుతున్నారు. ఈ దోపిడీకి తోడు అవినీతి, దుబారా, అపసవ్య విధానాలు ఇలా పలు అంశాలు తోడవుతున్నాయి.
మరెన్నో మోసాలు
వ్యవసాయంలో రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. ఉచితంగానే విద్యుత్తు ఇస్తాం, అయినా లెక్కలు తెలుసుకోవడానికి మీటర్లు పెడుతున్నాం-అంటూ జగన్ ప్రభుత్వం బుకాయిస్తున్నది. ఈ మీటర్ల కొనుగోలుకు ఆరు వేల కోట్ల రూపాయల వరకు వృధాగా ఖర్చు పెడుతున్నది. శ్రీకాకుళంలో 7 వేల రూపాయలకు పెట్టిన మీటర్‌ను రాష్ట్రమంతా 35 వేల రూపాయల చొప్పున కొనడానికి టెండర్లు పిలిచేశారు. ఇందులో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతున్నది. ఇళ్లతో సహా అన్ని విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు. సెల్ ఫోన్లు రీఛార్జింగ్ చేసుకున్నట్టే కరెంటుకు ముందుగా చార్జింగ్ చేయించుకోవాలి, కార్డు కొనుక్కోవాలి. ఆ డబ్బు అయిపోగానే కరెంట్ ఆగిపోతుంది, మళ్ళీ రీఛార్జి చేయించుకోవాలి. కరెంటు స్తంభాలు, వైర్లు, లైన్ల ఏర్పాటు తదితర రేట్లన్నీ అడ్డగోలుగా పెంచేసి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. అధికార పార్టీ నేతలూ జేబులు నింపుకుంటున్నారు.
వ్యవసాయ రంగానికి, ఎస్సీ, ఎస్టీల వర్గాలు, ఇతర వర్గాలకు విద్యుత్తు రాయితీలు ఉన్నాయి. ఈ రాయితీలు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే విద్యుత్ సంస్థలకు చెల్లించాలి. సంవత్సరాలైనా ప్రభుత్వం ఈ సబ్సిడీలు చెల్లించకుండా బకాయి పెడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, స్థానిక సంస్థలు వినియోగించుకున్న కరెంటుకు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వమే వాటిని తీర్చాలి. విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పులు తెచ్చి నడుపుతున్నాయి. ఈ అప్పులు, వడ్డీల భారం జనం నెత్తిన వేస్తున్నారు. రాష్ట్రం చీలిపోయిన తర్వాత తెలంగాణ నుండి రూ.6200 కోట్ల బకాయిలు రావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిని పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి లేదు. తేరగా దొరికేది జనమే.
బిజెపి, కేంద్రం ప్రధాన ముద్దాయి
వీటన్నిటికీ తోడు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తోంది. దీని ప్రకారం అధికారాలన్నీ కేంద్రం గుప్పెట్లోకి తీసుకుంటున్నది. విద్యుత్ పంపిణీతో సహా మొత్తం ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతోంది. ధనికులతో సమానంగా పేదలకు కూడా ఒకటే స్లాబు పెట్టి అందరికీ ఒకటే రేటు వసూలు చేయాలని నిబంధనలు పెట్టారు. క్రాస్ సబ్సిడీలు ఎత్తేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలకు అప్పులు తీసుకోవడానికి రుణ పరిమితిని పెంచడానికి కేంద్రం షరతులు పెట్టింది. రాష్ట్రంలోని వైయస్సార్‌సిపి ప్రభుత్వం కేంద్రానికి పూర్తిగా లొంగిపోయింది. షరతులన్నీ అంగీకరించింది. అప్పులు తెచ్చుకున్నది. దానికి అనుగుణంగా విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణకు పూను కుంటున్నది. సాధారణ వినియోగ దారులపై విద్యుత్ భారాలను మోపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నాయి. చార్జీలు పెంచేస్తున్నాయి. ఉద్యోగులకు భద్రత లేకుండా పోతున్నది.
విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టిన పూర్వ రంగంలో విద్యుత్ ఛార్జీలను నిర్ణయించే బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకొని విద్యుత్ నియంత్రణ మండలి (రెగ్యులేటరీ కమిషన్ ఇఆర్‌సి) సంస్థను ఏర్పాటు చేశారు. ప్రజల అభ్యంతరాలను స్వీకరించి, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవలసిన నియంత్రణ మండలి తూతూ మంత్రంగా విచారణ జరిపి ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేస్తున్నది. ప్రజల అభిప్రాయాలను చెప్పే అవకాశం ఇవ్వటంలేదు. రాష్ట్రం విభజించబడి 8 సంవత్సరాలు గడిచినా నియంత్రణ మండలి కార్యాలయం హైదరాబాదు లోనే కొనసాగడం సిగ్గుచేటు. చార్జీలపై బహిరంగ విచారణకు ఆంధ్రప్రదేశ్ నుండి పార్టీలు, సంఘాలు, ప్రజలు హైదరాబాద్ ఆఫీస్‌కొచ్చి అభిప్రాయాలు చెప్పాలని కోరటం మరింత ఘోరం. రాష్ట్రంలోనే ఈ నియంత్రణ మండలి కార్యాలయం ఉండాలి. విచారణ ఇక్కడే సాగాలి. ఇది ప్రజల హక్కు.
/ వ్యాసకర్త : సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
సిహెచ్. బాబూరావు