Nov 08,2023 10:17

విశాఖ ఉక్కు కర్మాగారం.. త్యాగాల మణిమకుటం. వేలాది మంది ఉపాధికి కల్పతరువు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఈ ఫ్యాక్టరీదే కీలకపాత్ర. నేడు విశాఖ, అందునా గాజువాక ఇంతలా అభివృద్ధి చెందాయంటే దీని చలవే. కార్మికుల కష్టంతో లాభాల బాటన నడిచిన ఈ కర్మాగారానికి 2021 నుంచి కష్టకాలమొచ్చింది. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో యావత్తు విశాఖ భగ్గుమంది. నాటి నుంచి ఆందోళనలు, నిరసనలు సాగుతూనే ఉన్నాయి. కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీటిలో ఉక్కు కార్మికులు, ప్రజలు పాల్గొంటున్నా ఓ పెద్దావిడ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకటీ, రెండూ కాదు.. వెయ్యి రోజులుగా జరుగుతున్న రిలే దీక్షల్లో ఆమె ప్రతి రోజూ కూర్చుని ఉద్యమ స్ఫూర్తిని నింపుతోంది. ఆమె పేరు బొడ్డ వెంకటమ్మ. ఆమె అంకితభావం, ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడు కోవాలన్న తాపత్రయం, భావితరాలకు ఈ ప్లాంట్‌ను అందించాలన్న ఆకాంక్ష అభినందనీయం.

ukku mahila

బొడ్డ వెంకటమ్మ కూర్మన్నపాలెం సమీపంలోని కాశీపాలెంలో ఓ రేకుల ఇంటిలో ఉంటోంది. పేద కుటుంబం. భర్త అనారోగ్యంతో కన్నుమూశారు. కూతురు పొందూరు ధనలక్ష్మి నడుపుతున్న చిన్నపాటి దుకాణమే ఆధారం. వెంకటమ్మ నివాసం ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌ ప్రాజెక్టు ఆఫీసు ఉన్న ప్రాంతంలో నాడు ఉండేది. అక్కడ వంద కుటుంబాల వరకూ అప్పట్లో ఉండేవి. వారంతా ప్రస్తుత హెచ్‌ఎస్‌ఎల్‌, కొవ్వొత్తుల జంక్షన్‌, పెట్రోల్‌ బంకు ఏరియాల్లో నాడు ఉండేవారు. 1984 ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్‌ అవసరాల నిమిత్తం భారీ పైపులైను, డ్రెయినేజీ సిస్టం అవసరమయ్యాయి. దీంతో ప్రభుత్వం నాటి కాశీపాలెం గ్రామాన్ని నేటి కూర్మన్నపాలెం, వడ్లపూడి చెంతకు తరలించింది. ఈ క్రమంలో అక్కడి కాశీపాలెం వాసులంతా నిర్వాసితులుగా మిగిలారు. వారికి స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాలిచ్చి ఆదుకోవాల్సి ఉన్నప్పటికీ 21 మందికి మాత్రమే ఉపాధి కల్పించి నాటి అధికారులు, పాలకులు చేతులు దులుపుకున్నారు. నాడు నష్టపోయిన వారిలో వెంకటమ్మ కుటుంబమూ ఒకటి. నేటికీ వీరి కుటుంబానికి ఎటువంటి ఆదరవూ లేదు. వెంకటమ్మ భర్త కామయ్య స్టీల్‌ప్లాంట్‌ తొలినాళ్లలో కన్‌స్ట్రక్షన్‌ పనులు చేసి వచ్చిన అరకొర డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఆ తరువాత ఆయన చనిపోయాడు. కుటుంబ భారం వెంకటమ్మపై పడింది. దీంతో ఆమె స్టీల్‌ప్లాంట్‌లోనే చిన్నచిన్న పనులు చేస్తూ బతికింది. కాంక్రీటు పనులు చేసింది. అధికారులకు నీళ్లు అందించడం, మొక్కలకు నీరు పెట్టడం వంటివి చేసేది. ఆమెకు రోజంతా కష్టపడితే రూ.80కి మించి వచ్చేది కాదు. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌ - 2, డబ్ల్యుఆర్‌ఎం తదితర విభాగాల్లో ఆమె చిన్నచిన్న పనులు చేస్తే చివరకు నెలకు రూ.6700 దక్కేది. ఆ డబ్బులే తనకు కొండంత అండగా ఉండేవని వెంకటమ్మ నేటికీ చెబుతుంది.
 

                                                                           ప్లాంట్‌ పరిరక్షణ కోసం దీక్ష

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2021 జనవరి 27న స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మేస్తామని ప్రకటించింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి అమ్మి కమీషన్‌ కొట్టేయాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు పథకం వేశాయి. ఈ కుట్రలను గుర్తెరిగి స్టీల్‌ప్లాంట్‌లోని కార్మికులంతా ఏకమై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన ఉద్యమానికి దిగారు. ఈ క్రమంలోనే కూర్మన్నపాలెం కూడలి వద్దనున్న స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద టెంట్‌ వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. దీన్ని ఎంతకాలం నడపగలమన్న భావన తొలినాళ్లలో కొందరిలో ఉండేది. అయితే ఉక్కు కర్మాగారం చరిత్రే త్యాగాలతో కూడుకున్నది. నాడు 32 మంది ప్రాణాల బలిదానంతో విశాఖ స్టీల్‌ ఏర్పడింది. 52 మంది కమ్యూనిష్టు ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు ప్లాంట్‌ కోసం రాజీనామా చేశారు. 68 గ్రామాలలో నివసించే ప్రజలు ఇళ్లను, 20 వేల ఎకరాల భూములను త్యాగం చేశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి కార్మికులు ఉత్పత్తి పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేవలం రూ.5 వేల కోట్లలోపే పెట్టుబడి పెట్టింది. కానీ ఈనాడు స్టీల్‌ప్లాంట్‌ విలువ రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దీనిని కాపాడుకోవడానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ప్రజలు అకుంఠిత దీక్షతో ముందుకు కదిలారు. కర్మాగారం ఉంటేనే తనలాంటి వారికి ఎంతో కొంత పని దొరుకుతుందన్న భావన వెంకటమ్మనూ పోరాటానికి పురిగొల్పింది. 'ప్లాంట్‌ కోసం మావాళ్లు గ్రామాన్ని త్యాగం చేస్తే.. నేడు మమ్మల్ని ప్రభుత్వాలు, ఉక్కు యాజమాన్యం అనాథలను చేశాయి. భూములు వదులుకున్న మాకు ప్లాంట్‌లో చిన్నపాటి ఉద్యోగమూ ఇవ్వలేదు. చిన్నాచితకా పనులను నేనే వెతుక్కుని ప్లాంట్‌ను అంటిపెట్టుకుని బతుకుతున్నాను. ఇప్పుడేమో ఈ ప్లాంట్‌ను అమ్మేస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం. ఇంకొకరికి అమ్మేయడానికా మేమింత త్యాగం చేసింది. ఎన్ని రోజులైనా పోరాటం చేస్తాం. మా మనవళ్లు, మనవరాళ్లకు ఈ ప్లాంట్‌ను అందించాలి' అని ఆమె చెబుతోంది. ఆమె నిబద్ధత పలువురికి ఆదర్శం.
          వెయ్యి రోజులుపాటు సాగిన దీక్షల్లో దాదాపు ఆమె రోజూ కూర్చుంది. ఉదయాన్నే అందరికంటే ముందే శిబిరానికి హాజరయ్యేది. 'వెంకటమ్మ ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఎక్కడికని అడిగితే దీక్షకు అని చెబుతుంది. ఈ వయసులో ఇవన్నీ నీకు అవసరమా? అన్నవారూ ఉన్నారు. ఆ మాటలనేమీ ఆమె పట్టించుకోదు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే. ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలి. అందుకే వానొచ్చినా, ఎండ మండిపోతున్నా ఆమె లెక్కచేసేది కాదు. ఆమెది మంచి పోరాటం' అని కాశీపాలెం వాసులు 'ప్రజాశక్తి'కి తెలిపారు. 'అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన ఉక్కు కర్మాగారంపై మాటలకే పరిమితమయ్యాయి. ఉక్కు కర్మాగారం పీకను మోడీ సర్కారు నులిమేస్తున్నా నోరు మెదపడం లేదు. ఆయా పార్టీలకు చెందిన వారంతా వెంకటమ్మను చూసి చాలా నేర్చుకోవాలి. మనుషులుగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. స్వప్రయోజనాలు మాని జాతి సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి. వారంతా ఓసారి వెంకటమ్మను చూసి సిగ్గుపడాలి' అని పలువురు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా వెంకమ్మ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె మన కాలం 'ఉక్కు' మహిళ.
 

- కోడూరు అప్పలనాయుడు,
94915 70765