Nov 06,2023 10:24

కూతురుతో పాటే చదువుకోవాలని కోరిక ఉన్నా, ఆటలపై శ్రద్ద ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించని ఎందరో మహిళలు అర్ధంతరంగా చదువు ఆపేసి, పెళ్లి, పిల్లలతో కాలం వెల్లదీస్తుంటారు. కొందరు తమ కలలను, ఆకాంక్షలను పిల్లల ద్వారా నెరవేర్చుకుంటారు. ఆటల్లో, పాటల్లో, చదువులో ఉరకలు వేస్తున్న కన్నబిడ్డల భవిష్యత్తుకు దివిటీల్లా నిలబడతారు ఇంకొందరు. ప్రకాశం జిల్లాకు చెందిన తన కలలకు కుమార్తెను ప్రతిరూపంగా తయారు చేశారు. అంతేకాదు; తానూ బిడ్డతో పాటేచదువు కొనసాగించి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డారు. తనకు ఇష్టమైన రెజ్లింగ్‌ క్రీడలో ప్రతిభ కనబరుస్తున్నారు. రెజ్లర్‌ క్రీడాకారిణిగా పతకాలు సాధిస్తున్న కూతురు నిఖితా దేవితో పాటు పోటీలకు హాజరై సీనియర్‌ కేటగిరీలో తలపడుతూ, పతకాలు సాధిస్తున్నారు.

ప్రకాశం జిల్లా మార్టురు మండలం కొలలపూడి గ్రామానికి చెందిన సురగాని అంజినీదేవి దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి వీరభద్రయ్య, తల్లి కోటేశ్వరమ్మ. తండ్రి చిరు వ్యాపారి. కూతురంటే వల్లమాలిన అభిమానం. చదువులో, ఆటలో ఎప్పుడూ ముందుండే అంజినీదేవి స్కూలు స్థాయిలోనే వివిధ ఆటల పోటీల్లో పాల్గొనేవారు. తాత సుబ్బారావు కూడా మనవరాలిని క్రీడాకారిణిగా చూడాలని ఆశపడేవారు. ఇలా సాఫీగా సాగుతున్న అంజినీ దేవి బాల్యంలో, తండ్రి మరణం ఓ పెద్ద కుదుపు.
 

                                                   నాన్న మరణం నా జీవితాన్ని మార్చేసింది

'నేను 9వ తరగతి చదివేటప్పుడే అనారోగ్య కారణాలతో నాన్న చనిపోయాడు. ఆయన మృతి నేను కలలుగన్న భవిష్యత్తును అంధ:కారంలో ముంచేసింది. పదో తరగతి పూర్తయ్యాక మా తాతయ్య నన్ను కాలేజీకి పంపే ధైర్యం చేయలేదు. ఆడపిల్లకు చదువుకంటే పెళ్లి ముఖ్యమనుకున్న ఆ రోజుల్లో బాధ్యత తీరిపోతుందని పెళ్లి చేసేశాడు. ఇద్దరు బిడ్డలు పుట్టారు. నా భర్త దాసరి హనుమంతరావు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. నేను ఆశపడ్డ జీవితం ఇది కాదు. అందుకే ఎలాగైనా నా కలలను నెరవేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాను. ప్రైవేటుగానైనా సరే చదవాలనుకున్నాను. పెళ్లయి పదేళ్ల తరువాత పిల్లలతో పాటు మళ్లీ చదవడం మొదలుపెట్టాను. మొదట్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న నన్ను చూసి కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు' అంటూ ఆమె చెబుతున్నప్పుడు ఆ మాటల్లో ఆత్మస్థైర్యం తొణికిసలాడింది.

33


                                                                  క్రీడల వైపు అడుగులు ...

'మా అమ్మాయి నిఖితాదేవీ నవోదయ స్కూల్లో చదివింది. చదువులో బాగా ముందుండేది. ఆటల్లో కూడా రాణించేది. తనకు కూడా ఆటలంటే ఆసక్తి. స్కూలు తరపున వివిధ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించేది. స్కూలు పూర్తయి గ్రాడ్యుయేషన్‌లోకి వచ్చాక క్రీడలతో పాటు ఆడపిల్లకు ఆత్మరక్షణ విద్య అవసరమని రెజ్లింగ్‌ నేర్పించాలనుకున్నాను. అబ్బాయితో పాటే అమ్మాయిని కూడా జిమ్‌లో చేర్పించాను. జిమ్‌ కోచ్‌ పాపకు రెజ్లింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. రోజూ పిల్లలను తీసుకెళ్లడం, తీసుకురావడం, ఆటలో నిఖితకు వాళ్లు నేర్పించే మెళకువలు నాలో మళ్లీ బాల్యపు ఆశలను రేకెత్తించాయి. నేను కూడా రెజ్లింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తానని కోచ్‌తో చెప్పాను. చాలా తక్కువ సమయంలోనే సాధన చేశాను. రెజ్లింగ్‌ ఆటకు శరీర దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం చాలా అవసరం. చిన్నప్పటి నుండి ఆత్మస్థైర్యంతో ఎదిగిన నేను 7, 8 నెలల స్వల్ప కాలంలోనే రెజ్లింగ్‌లో నైపుణ్యం సాధించి, పోటీలకు సిద్ధమయ్యాను' అంటూ ఆట వైపు తన అడుగులను అంజినీ వివరించారు. ఇప్పుడు ఆమె రెజ్లింగ్‌తో పాటు డిస్కస్‌ త్రో, హేమర్‌ త్రో క్రీడల్లో రాణిస్తున్నారు.

011


 

                                                                సాధించిన విజయాలు..

ఉన్నత కొలువు సాధించాలన్న లక్ష్యంతో చదువు కొనసాగించిన అంజినీ దేవి ప్రైవేటుగానే బిఎ చేశారు. ఆ తరువాత ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుండి ఎంఎ ఇంగ్లీష్‌ పూర్తిచేశారు. గ్రూప్‌-2 పరీక్షలకు సిద్ధమవుతూ వివిధ పోటీ పరీక్షలు రాశారు. ప్రస్తుతం ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఒఎంసి) వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రూప్‌-2 సాధించడమే తన లక్ష్యమంటున్నారు. ఇక రెజ్లర్‌ క్రీడాకారిణిగా 2021లో తొలిసారి పోటీలో పాల్గొన్నారు. రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన హేమర్‌ త్రోలో ప్రకాశం జిల్లా తరపున పాల్గొని రాష్ట్రస్థాయి బంగారు పతకం సాధించారు. డిస్కస్‌ త్రోలో మూడోస్థానం వచ్చింది. ఈ ఏడాది విశాఖ మధురవాడలో నిర్వహించిన స్టేట్‌మీట్‌లో అండర్‌-19లో 70 కేజీల విభాగంలో నిఖిత, సీనియర్‌ మహిళల 90 కేజీల విభాగంలో అంజినీ పాల్గొని మొదటిస్థానం సంపాదించారు. దీంతో అక్టోబరు నెలలో హర్యానాలో నిర్వహించిన జాతీయ గ్రాప్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ పోటీల్లో అమ్మకు బంగారు పతకం వస్తే కూతురు రజతంతో మెరిసింది.
 

                                                               కూతురు ప్రగతికై శ్రమిస్తా..

'నిఖిత సివిల్స్‌ చదవాలని ఆశపడుతోంది. ఆ దిశగా ఆమెను ప్రోత్సహిస్తా. ఆటలో రాణించేలా కూడా చూస్తా. నేను సాధించలేనిది నా బిడ్డ అందుకుంటే అంతకుమించి సంతోషం ఉండదు' అంటున్న అంజినీలో ఎందరో అమ్మలు కనిపించారు.

44

                                                                 అమ్మ నా రోల్‌ మోడల్‌

'ఉన్నతవిద్య, ఇష్టమైన ఆట, నచ్చిన కళలో రాణించాలంటే వయసుతో సంబంధం లేద'ని మా అమ్మ నిరూపించింది. నాకు అన్ని విషయాల్లో తోడుంటుంది. ఆటలో కూడా రాణిస్తుంటే చాలా సంతోషమేస్తుంది. మా అమ్మ వంట చేస్తుంది. ఉద్యోగం చేస్తుంది. నాతో పాటు చదువుతుంది. ఆడుతుంది. 'నీకు మంచి ప్రోత్సాహం ఇచ్చే అమ్మ దొరికింది. నువ్వు చాలా లక్కీ' అని నా స్నేహి తులు అమ్మ గురించి పొగుడుతుంటే నాకు చాలా ఆనందమేస్తుంది' అని అమ్మ అంజినీదేవి గురించి నిఖిత చెబుతోంది.
ఈ తల్లీ కూతుళ్లు ఒకర్ని మించి మరొకరు స్ఫూర్తిపొందుతూ ముందుకు సాగుతున్నారు. వీరు అనుసరిస్తున్న మార్గం ఎందరో అమ్మలకు, కూతుళ్లకు ఆదర్శం.

                                              అమ్మ కళ్లల్లో సంతోషం నా ఎదుగుదలకు ప్రతిబింబం

'నేను చిన్నప్పటి నుండి ఎలాంటి భవిష్యత్తుకై ఆశపడ్డానో అమ్మకు తెలుసు. మా నాన్న మరణంతో నా కలలు, ఆశలు అడియాశలయ్యాయని ఎంతో బాధపడేది. ఇప్పుడు నేను సాధించిన ప్రగతి చూసి నా కంటే మా అమ్మే ఎక్కువ సంతోషపడుతోంది. అమ్మ కళ్లల్లో ఆ ఆనందం నాకు స్పష్టంగా కనిపిస్తోంది' అంటూ తన తల్లి గురించి చెబుతున్నారు అంజినీ దేవి.

                                                                                                                   - జ్యోతిర్మయి