పాలు బలవర్ధకమైన ఆహారం. పూర్వం నుంచి నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో పాలు కూడా ముఖ్యమైనవే. అప్పట్లో తక్కువ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేవి. దాంతో పాలు, పాల ద్వారా వచ్చే పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి.. తదితర పదార్థాలు ఇష్టంగా తీసుకునేవారు. అంతేకాక నేచురల్‌గా, తాజాగా వాడుకునే అవకాశం ఉండేది. కనుక వాటి రుచి కూడా అమోఘంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆకర్షణ.. ఆఘ్రాణ.. లతో కూడిన అనేకానేక పదార్థాలు.. ప్రత్యక్షమౌతున్నాయి. అందుకే పాలు అనగానే పిల్లలు, పెద్దలు కూడా అదోలా మొహం పెట్టడం.. ఇష్టం లేనివి తింటే డైజెస్ట్ కాదట అని తెలివిగా మాట్లాడే చిచ్చర పిడుగులు. ఇలాంటివారికి పాలలోని పోషకాలను ఏదోలా అందించాలని ప్రతి తల్లికీ ఉంటుంది. అందుకే పిల్లల అభిరుచికి తగ్గట్లు ఇవ్వాలనే కాంక్ష.. పాలతో పాటు మరికొన్ని పదార్థాలను కలిపి, పోషకాహారం అందించే ప్రయత్నంలో కొన్ని రుచులు.
- డ్రైఫ్రూట్ మిల్క్‌షేక్..
కావలసినవి : బాదం - 8, ఖర్జూర పండు - 6, అంజీర - 4, జీడిపప్పు - 8, కాచి చల్లార్చిన పాలు - 1/2 లీ. పంచదార - 1/4 కప్పు, రోజ్ వాటర్ / యాలకల పొడి - 1/4 స్పూన్
తయారీ : బాదం. అంజీర, జీడిపప్పు, ఖర్జూర పండు వేడినీటిలో గంటసేపు నానబెట్టాలి. తర్వాత వీటిని (మూడు నిమిషాలు) మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనికి కాచి చల్లార్చిన పాలు, పంచదార, రోజ్ వాటర్/ యాలకల పొడి కలిపి హైస్పీడ్ మీద గ్రైండ్ చేయాలి. దీనిని అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని, సర్వ్ చేసుకోవచ్చు. చల్లచల్లని సమ్మర్ మిల్క్‌షేక్ రెడీ.
- ఓట్స్ స్మూతీ..
కావలసినవి : నానబెట్టిన ఓట్స్ అటుకులు - 3 స్పూన్లు, పాలు - 1/4లీ., వేయించిన వేరుశనగ పప్పు -1/4 కప్పు, అవిసె గింజలు - స్పూను, చియా సీడ్స్ - స్పూను, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, ఖర్జూర పండు, అరటి పండు ఒక్కొక్కటి.
తయారీ : ముందుగా ఓట్స్ అటుకులను పావుగంట నానబెట్టాలి. తర్వాత వడకట్టి మిక్సీ జార్‌లో వేసి పైన చెప్పిన పదార్థాలన్నింటినీ జార్‌లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఫోర్స్‌గా బ్లెండ్ చేస్తే ఓట్స్ స్మూతీ రెడీ. కమ్మకమ్మని ఈ స్మూతీని ఫ్రిజ్‌లో పెట్టుకొని, చల్లగా తీసుకుంటే హాయిగా ఉంటుంది ఈ వేసవిలో.
- రోజ్ మిల్క్ షేక్..
కావలసినవి : పాలు - 1/2 లీ., రోజ్‌వాటర్ - స్పూను, పంచదార - 2 స్పూన్లు, రోజ్ సిరప్ - 1/4 కప్పు, ఐస్ క్యూబ్స్ - 5, సబ్జా గింజలు - 2 స్పూన్లు, గులాబీ రేకులు - 5
తయారీ : ముందుగా కాచి, చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకున్న పాలు తీసుకోవాలి. దానిలో రోజ్‌వాటర్, పంచదార, రోజ్ సిరప్, ఐస్ క్యూబ్స్, నానబెట్టిన సబ్జా గింజలు, గులాబీ రేకులు వేసుకొని మూడు నిమిషాల పాటు బాగా షేక్ చేయాలి. తర్వాత చల్లచల్లగా రోజ్ పాల షర్బత్ రుచిని ఆస్వాదించడమే.
- బాదం పాలు..
కావలసినవి : బాదం పప్పులు - 50 గ్రా., పాలు - లీ., కస్టర్డ్ పౌడర్ - 2 స్పూన్లు, పంచదార - 1/4 కప్పు
తయారీ : ముందుగా బాదం పప్పులను మరిగించిన నీటిలో గంటసేపు నానబెట్టాలి. (రాత్రంతా నానబెట్టిన బాదంతోనూ చేసుకోవచ్చు) బాదంపై పెచ్చు తీసివేయాలి. పప్పులు, పాలు మిక్సీ జార్‌లో వేసి, మెత్తని పేస్ట్ చేయాలి. ఒక బౌల్‌లో కస్టర్డ్ పౌడర్‌ను కొంచెం పాలతో క్రీమీగా కలుపుకోవాలి. మిగిలిన పాలను ఒక గిన్నెలోకి తీసుకొని, పొంగు వచ్చేవరకూ కాయాలి. పొంగు రావడంతోనే మెత్తని బాదం పేస్ట్ వేసి, బాగా కలిపి మీడియం ఫ్లేం మీద రెండు మూడు పొంగులు వచ్చేంత వరకూ కలుపుతూ ఆ పాలను కాయాలి. మూడు పొంగులు వచ్చిన తర్వాత పంచదార, కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కలిపి, పాలు కొంచెం చిక్కబడేంత వరకూ తిప్పుతూ కాయాలి. చిక్కదనం కనిపించిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కనీసం రెండు గంటలన్నా డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. దీనిని మరలా మిక్సీ జార్‌లోకి తీసుకొని 30 సెకన్ల పాటు మిక్సీ పట్టి సర్వ్ చేసుకోవడమే.