
- 80 వేల ఎకరాల్లో ఎండిన వరి
- తగ్గిన మొక్కజొన్న దిగుబడి
- వెంటాడుతున్న వర్షాభావం
- అధ్వానంగా సాగునీటి కాలువలు
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లాలో కరువు ఛాయలు అమలుకుంటున్నాయి. సుమారు లక్ష ఎకరాల్లో సాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. వర్షాభావం వెంటాడడంతోపాటు జలాశయాల కాలువల నిర్వహణ అధ్వానంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వరి పంట ఎండిపోతోంది. దీంతో, రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ నెలలో జిల్లాలో చినుకు కూడా రాలలేదు. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లా కరువుకాటుకు గురైనట్టేనని రైతులు, ఎపి రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టులేవీ లేవు. చంపావతి, వేగావతి, సువర్ణముఖి, గోముఖి వంటి నదులు, అనేక జీవగెడ్డలతోపాటు రాష్ట్రంలో మరెక్కడా లేనన్ని చెరువులు ఉన్నాయి. కానీ, వాటి నిర్వహణను పాలకులు పూర్తిగా గాలికి వదిలేయడంతో జిల్లాలో చాలావరకు వర్షాధారంగానే సాగు చేయాల్సి వస్తోంది. మరోవైపు జలాశయాల్లో కాస్త నీటిమట్టాలు తగ్గినప్పటికీ ఉన్న నీటిని సరఫరా చేసేందుకు కాలువల నిర్వహణ సరిగా లేదు. దీంతో, జిల్లాలో పంటల సాగు దినదినగండంగా మారింది. జిల్లా వాసులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఖరీఫ్ సీజన్‌లో అన్ని పంటలూ కలిపి ఈ ఏడాది 2,83,912 ఎకరాల్లో సాగవగా, అత్యధికంగా వరి 2,34,437 ఎకరాల్లో సాగులో ఉంది. ఇందులో లక్ష ఎకరాల వరకు నీటి ఎద్దడి నెలకొంది. మొత్తం పంట విస్తీర్ణంలో 80 వేల ఎకరాల్లో వరి ఎండుతోంది. పది వేల ఎకరాల్లో మొక్కజొన్న దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ఇంకో పది వేల ఎకరాల వరకు పత్తి, అపరాలు, చిరుధాన్యాల సాగు దిబ్బతినే ప్రమాదం ఉంది. క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల ఎండిన పంటలను పరిశీలించినప్పటికీ విస్తీర్ణాన్ని తక్కువగా చూపారు. ఈ ఏడాది తోటపల్లి జలాశయం ద్వారా 78,563 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, 45 వేల ఎకరాలకు మాత్రమే అందినట్టు వ్యవసాయ సలహా మండలి సమావేశంలో అధికారులు తెలియజేశారు. ఆచరణలో ఇంత కూడా లేదని రైతులు చెబుతున్నారు. ఇతర జలాశయాల పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం, పలుచోట్ల పిల్లల కాలువలు లేకపోవడం వంటివి ఇందుకు కారణం.
సగానికి తగ్గిన మొక్కజొన్న దిగుబడి
జిల్లాలో గుర్ల, మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి, పూసపాటిరేగ మండలాల్లో మొక్కజొన్న ఎక్కువగా సాగవుతోంది. గతేడాది ఆ మండలాల్లో ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ ఏడాది 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుర్లలో వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన పంటకోత ప్రయోగంలో కూడా ఇదే విషయం స్పష్టమైనట్టు జిల్లా వ్యవసాయ శాఖాధికారి విటి రామారావు తెలిపారు.
ఆది నుంచి అవస్థలే
సీజన్ ముగిసే నాటికి సాధారణ వర్షపాతం నమోదైనా, జూన్‌లో 52 మిల్లీమీటర్లు, ఆగస్టులో 24 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉంది. నాట్లు వేయడానికే రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అక్టోబర్‌లో ఇంతవరకూ వర్షాలు పడలేదు. 90 మిల్లీమీటర్ల లోటువర్షపాతం ఉంది. దీనికితోడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలన్నీ ఎండిపోతున్నాయి. అక్కడక్కడా పంట పొలాలు ఇప్పటికే బీటలు వారుతున్నాయి. ముఖ్యంగా వరి వెన్ను దశలో, అక్కడక్కడా పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో పుష్కలంగా నీరు అవసరం. నీటి ఎద్దడి వల్ల దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని అందించేందుకు కాలువలు ఉన్నంతలో బాగుచేయించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.
వారంలో వర్షం పడకుంటే అంతే !
నాకున్న 1.5 ఎకరాల పొలంలో వరి సాగు చేస్తున్నాను. రూ.40 వేలు మదుపైంది. పంటంతా పొట్ట దశకు చేరుకుంటోంది. ఇప్పటివరకు చెరువు నీరు వాడాను. చెరువులో నీరు ఖాళీ కావడంతో వర్షం కోసం ఎదురు చూస్తున్నాను. వర్షం పడి పంట పండితే సుమారు రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. ఈ వారం రోజుల్లో వర్షం పడకపోతే పంట పూర్తిగా ఎండిపోయి తీవ్రంగా నష్టపోతాను. అప్పులే మిగులుతాయి.
- శ్రీను, రైతు, పోరాం గ్రామం,
పూసపాటిరేగ మండలం