Jun 19,2022 12:04

గొప్ప తపస్సంపన్నుడు
పులిచర్మంపై ఆశీనుడైనట్టు
చిరుగుల పాత గోనెసంచిపై కూర్చొని
దర్జాను ఒలకబోస్తున్నాడు నాన్న

ఏ మారాజు తలపాగానో చుట్టినట్టు
అతుకుల తుండుగుడ్ద కిరీటం
నెత్తికి చుట్టి గొప్ప రాజసంతో
వెలిగిపోతున్నాడు నాన్న

పొద్దు పొద్దున్నే
మూటగట్టిచ్చిన పెద్దలనాటి ఆస్తినేదో
తనకు వొచ్చిన వాటాగా మురిసిపోతూ
తెగిన పాత చెప్పుల మూట ముందరేసుకుంటాడు

కూలబడిపోయే కొట్టం ముందు
విల్లులావొంగిన వీపుని మొండిగోడకానించి
నిప్పుల కుంపటి జీవితాన్ని నిటారుగా
నిలబెట్టే పనిలో నిమగమౌతాడు

గంపెడు పిల్లలని ఎట్ల సాకుతాడో
ఈడొచ్చిన కూతుర్లను ఎట్లా సాగనంపుతాడోనని
నాలుగు తీపి మాటలేవో ముఖాన పూసి
తెగిన చెప్పు ఉంగటం కుట్టించుకునో
కొత్త జోళ్లను కుట్టించమనో చెప్పి
పని కానిచ్చుకుని వెళ్లే ఉద్దర మాటలు
తనకేం కొత్తేమి కాదన్నట్టు తలాడిస్తాడు

ఇన్నేళ్లు మేడ మిద్దెలను సాపు చేశాడే కానీ
నాలుగు చినుకులకే కారిపోయే గుడిసెకు
ఇంత పైకప్పు ఏసుకోలేకపోయాడంటూ
వీధంతా ఇనబడేలా శోకాలు తీసే అమ్మ

అమ్మేమో..
గంపెడు పిల్లల గంజిమెతుకుల కోసం
వరికోతలకో కలుపు తీతలకో పరుగుపెట్టి
ఇంటి ఆకలి తీర్చిందే కానీ
బొబ్బలు తేలిన అరికాళ్లకు
ఆకుమందపు చెప్పులు కుట్టివ్వలేని
నాయిన లేమితనాన్ని పెదవిదాటనియ్యలేదు

ఉన్నోళ్ల చేను గట్టుపై
పంటకాలువై ప్రవహించడం తెలుసుగానీ
తమ బతుకు బండబారిపోయిన
వైనం గుర్తుకు రాదు
రేయి పగలు తేడాలేక పొద్దరగదీసి శ్రమించిన
గానుగెద్దు జీవితాన్ని మరిచిపోలేదు..!

తాతల కాలం నాటి ఐదెకరాల పొలం
సేద్యం మరిచిపోయి చాన్నాళ్లయిందని తెలిసీ
రెడ్డోళ్ల భూమిలో మాత్రం
తొలిపొద్దయి పొడవడం
ఇంటిల్లిపాది రెక్కలకష్టం
మరిచిపోయే జ్ఞాపకం గాదు.
 

ఆది ఆంధ్ర తిప్పేస్వామి
77802 63877