హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో సోమవారం ఆ బ్యాంక్ ఆన్‌లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు పూర్తిగా సేవలు నిలిచిపోయాయి. ఎస్‌బిఐ యోనో యాప్, నెట్ బ్యాంకింగ్‌తో పాటు యుపిఐ లావాదేవీలకు వీలు లేకుండా పోయింది. దీంతో ఖాతాదారులు డిజిటల్ చెల్లింపుల్లో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని పలువురు ఖాతాదారులు సామాజిక మాధ్యమాల్లో తమ బాధను, ఆందోళనను వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం (2022-23) ముగింపు నేపథ్యంలో ఏప్రిల్ ఒక్కటో తేదిన మధ్యాహ్నాం నుంచి సాయంత్రం వరకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను అధికారికంగా నిలిపివేసింది. ఆ తర్వాత కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలువురు పేర్కొన్నారు.










