Oct 06,2023 10:13
  • రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన సర్వర్‌

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వచ్చాక ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌ అవుతుండటం పరిపా టే. ఇదే తరహాలో పోలీసు సేవలు కూడా ఆన్‌లైన్‌లో ఎంతోకాలంగా నడుస్తూ వస్తున్నాయి. గత కొన్ని రోజులు గా ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో పోలీసు సేవలన్నీ ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనే నడుస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌ లు, వాహనా జరిమానాలు అన్ని ఆఫ్‌లైన్‌లో కొనసాగుతున్నాయి.
 

                                                                            ఆగిన సిసిఎస్‌టిఎన్‌

నేర చరితులకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలకూ ఇచ్చుపుచ్చుకునే విధంగా ఉండేదుకు కేంద్ర ప్రభుత్వం సిసిఎస్‌టిఎన్‌ (క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్కు అండ్‌ సిస్టమ్‌) పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2012లో ప్రారంభమైన ఈ వ్యవస్థ కింద దేశంలోని సుమారు 15 వేల పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేయబడ్డాయి. ఏ పోలీసు స్టేషన్‌లో అయిన ఎఫ్‌ఐఆర్‌ నమోదైయితే అన్ని స్టేషన్లలో ఆ సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మన రాష్ట్రంలో 2012 నుంచి ఈ విధానం నడుస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని టిసిఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసస్‌) అందిస్తూ వచ్చింది. ఈ సంస్థకు కొన్ని సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆ సంస్థ ఈ ఏడాది జూన్‌ నుంచి తన సేవలను నిలిపివేసినట్టు సమాచారం. తదనంతరం దీని నిర్వహణను డాటా ఎవాల్వింగ్‌ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సేవలను నిలిపివేసినట్టు సమాచారం. దీంతో ఆన్‌లైన్‌ సేవలు మొత్తం నిలిచిపోయాయి.
 

                                                                        ఆఫ్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్‌లు

సాంకేతిక సహకారం అందించే సంస్థలు నిర్వహణను నిలిపివేయడంతో పోలీసు సేవలన్నీ ఆగిపోయాయి. ఏదైనా కేసులొస్తే ఆఫ్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. అదే విధంగా వాహనాల జరిమానాలు కూడా వేయలేని పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఆఫ్‌లైన్‌లో అనేక అవతవకలు జరుగుతున్న నేపథ్యంలో అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే వేయాలని నిబంధనలు పెట్టారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ పనిచేయకపోవడంతో వీటిని కూడా వేయడానికి ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎంతకాలముంటుందో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు.