
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి బ్రాండిక్స్ కంపెనీ పరిధిలో ఉన్న... సీడ్స్ అపెరల్ కంపెనీ (వస్త్ర పరిశ్రమ)లో జూన్ 3న విష వాయువు వల్ల వందలాది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదం ఏ విషవాయువు వల్ల జరిగింది, ప్రమాదానికి కారణాలు ఏమిటన్న విషయాలు రోజులు గడుస్తున్నా నేటికీ ప్రకటించలేదు. దీన్నిబట్టే కంపెనీ యాజమాన్యాలకు ప్రభుత్వ యంత్రాంగంపై ఎంత పట్టు వున్నదో అర్ధమౌతుంది. ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు, పరిశ్రమలు-ఐ.టి శాఖామాత్యులు, అధికారులు ఘటన జరిగిన ప్రాంతాలకు విచ్చేసి హడావుడి చేసి వెళ్ళిపోయారు. అస్వస్థతకు గురైన వారికి, వారి కుంటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన భోజన సదుపాయాలు, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఘటన చూసి చలించిన కొంత మంది దాతలు మానవత్వాన్ని చాటుకొని భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఆస్పత్రులలో ఉన్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు కనీస సౌకర్యాలను కూడా బ్రాండిక్స్ యాజమాన్యం కల్పించలేదు. విషవాయువు వెలువడిన వెంటనే మహిళా కార్మికులు పడిన బాధలు వర్ణనాతీతం. హాస్పటళ్లలో కూడా ఎవరికీ కంపెనీలో జరిగిన విషయాలు వెల్లడించరాదని యాజమాన్యం హుకుం జారీచేసింది. ఇంత జరిగినా ఇప్పటి వరకు కార్మిక శాఖా మంత్రి ఒక్క ప్రకటన చేయలేదు. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ఆగమేఘాల మీద జోక్యం చేసుకుంది. బ్రాండిక్స్‌లో జరిగిన ప్రమాద విషయంలో పట్టించుకోక పోవడానికి ప్రజలకు ప్రభుత్వం మీద అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.
మొదటి నుండి బ్రాండిక్స్ యాజమాన్యానికి ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బ్రాండిక్స్ కంపెనీకి ఎస్‌ఇజెడ్‌లో ఎకరాకి రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలు వెయ్యి రూపాయలకే 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. బ్రాండిక్స్ యాజమాన్యం 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని, స్థానిక నిర్వాసితులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని నమ్మబలికింది. 2006లో ప్రారంభమైన కంపెనీ నేడు 18 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. నిర్వాసితులకు మొండి చెయ్యి చూపించింది. మహిళా కార్మికులను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని అనేక దఫాలుగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళనల సందర్భంగా నాడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్మోహన్‌రెడ్డి 'రాబోయే ప్రభుత్వం మనది. మీ అందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామ'ని హామీ ఇచ్చారు. నేటికీ అది కార్యరూపం దాల్చలేదు.
అచ్యుతాపురంలో 10 వేల ఎకరాల భూమిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్‌ఇజెడ్‌లు) ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు, కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పరిశ్రమల శాఖ జోక్యాన్ని ప్రభుత్వం నామమాత్రంగా మార్చడంతో, యాజమాన్యాలదే ఇష్టారాజ్యం అయిపోయింది. ఈ సెజ్‌లలో ఎక్కువగా రసాయన పరిశ్రమలు వున్నాయి. ఏ పరిశ్రమలో ఏ సమయంలో ఏ విష వాయువు లీక్ అవుతుందో తెలియని పరిస్థితి. ఏదైన ప్రమాదం జరిగితే ప్రమాదానికి సంబంధించిన నివేదికలు రహస్యంగా వుంచడం తప్ప దానిని అరికట్టే చర్యలు లేకపోవడంతో యాజమాన్యాలు మరింత బరితెగిస్తున్నాయి. బ్రాండిక్స్‌లో జరిగిన ప్రమాదంలో కూడా అమ్మోనియం వాయువు పీల్చితే వచ్చే లక్షణాలు కనిపించడంలేదని ''సైన్స్ ఫర్ ది పీపుల్'' ప్రకటించింది. నిజంగా అమ్మోనియం విడుదలై వుంటే బయోమేకర్ మెటబాలిస్ ద్వారా గుర్తించవచ్చని పేర్కొన్నారు. అటువంటి ఆధారాలతో గుర్తించారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. దీనిని బట్టి పరిశ్రమలపై అధికారులకు నియంత్రణ లేదని అర్ధమౌతుంది. ఈ ప్రమాదంలో 312 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు 194 మంది కార్మికులు డిశ్చార్జ్ అయ్యారు. 118 మంది చికిత్స పొందుతున్నారు.
సెజ్‌లో భద్రత ఏది?
సెజ్‌లో వివిధ పరిశ్రమలలో 50 వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. అందులో బ్రాండిక్స్ కంపెనీలో 18 వేల మంది మహిళల కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రసాయనిక మంటలు ఆర్పే సాంకేతిక పరికరాలు సైతం ఇక్కడ కనిపించవు. సెజ్‌ల లోని భద్రతా ప్రమాణాల్లో డొల్లతనం అనేక సందర్భాల్లో కనిపిస్తున్నాయి. ప్రమాదాలు అనునిత్యం జరుగుతున్నా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండా యాజమాన్యాలు నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల దగ్గరగా 26 గ్రామాలకు చెందిన నిర్వాసితుల దిబ్బపాలెం సెజ్ కాలనీ వుంది. అతి దగ్గరలో 20 వేల జనాభా కలిగిన అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక వుంది. ఈ ప్రాంత ప్రజలు నిరంతరం భయాందోళనతో జీవిస్తున్నారు. 50 వేల మంది పనిచేస్తున్న ప్రాంతంలో ఇఎస్‌ఐ ఆసుపత్రి లేదు. డిస్పెన్సరీ మాత్రమే నడుస్తుంది. వైద్య సేవలకు డాక్టర్లు, వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు అంతంతమాత్రమే. ఇఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని వాగ్దానం చేసి ఏళ్లు గడుస్తున్నా నేటికీ నిర్మాణం జరగలేదు. ప్రమాదాలు జరిగితే అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం లోని ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. కార్మికులు ప్రాణ భయంతో అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలు కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎందుకు నిర్మించకూడదు? ప్రైవేట్ కంపెనీలు లాభాలలో 2 శాతం సిఎస్‌ఆర్ నిధులు కేటాయించాలి. ఆ నిధులను ఆసుపత్రి నిర్మాణానికి ఎందుకు కేటాయించకూడదు? ఈ విషయమై ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదు? పని ప్రదేశాల్లో రసాయనిక రియాక్టర్లలో ఆక్సిజన్ స్థాయి ఎంత వుందో చూడకుండానే రియాక్టర్ల లోకి కార్మికులను దింపడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా వున్నాయి. రసాయనిక కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు. కార్మికులకు మాస్కులు, షూలు, గ్లౌజులు, ఆక్సిజన్ సూట్, ఫైర్ కోట్లు వంటి కనీస భద్రతా సామగ్రి కూడా అందించడంలేదు. పరిశ్రమల్లో రసాయనిక మార్పులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న శిక్షణ ఇవ్వడంలో కూడా తీవ్ర వైఫల్యం వుంది. దీనితో కార్మికులకు పని ప్రదేశాల్లో తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. ప్రాణాలతో చెలగాటం
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం...కార్మికులను పూర్తిగా యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలేసేలా...కార్మిక చట్టాలను సమూలంగా మార్చివేసింది. కార్మికుల ప్రాణాలు పోయినా పర్వాలేదు, లాభాలే పరమావధిగా అన్ని భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చే యాజమాన్యాల కొమ్ముకాస్తోంది. దీనితో ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. ఎక్కడైనా గట్టిగా పోరాడితే ఏదో కొంత నష్ట పరిహారం, లేకపోతే అది కూడా లేదు. నాణ్యత కలిగిన యంత్ర సామగ్రి వాడకం, భద్రతా చర్యలు చేపట్టడానికి డబ్బు వెచ్చించే బదులు, గట్టిగా అడిగిన చోట ప్రమాదాలకు కొద్దిగా పరిహారం చెల్లించడమే యాజమాన్యాలకు లాభసాటిగా ఉంది. అంటే కార్మికుల ప్రాణాలను కూడా వ్యాపార దృక్పథంతోనే చూడడం నేడు పరిపాటి అయింది. వీరి లాభతృష్ణకు ప్రాణాలు కోల్పోయి, అంగవికలులై ఎన్ని కుటుంబాలు రోడ్డునపడ్డా వీరికి చీకూ చింతా లేదు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పరవాడ రాంకీ ఫార్మా సిటీ, హెటిరో, దివీస్, అచ్యుతాపురం సెజ్‌లలో సుమారు 150 కంపెనీలు వున్నాయి. వాటిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా ఏదో ఒక కంపెనీలో పేలుడు సంభవిస్తోంది. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడానికి గల లోపాలను అధికారులు వెల్లడించడంలేదు. బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంలేదు. తాజాగా బ్రాండిక్స్ ఘటనలోనూ ఇదే వైఖరి. చాలా కంపెనీల్లో ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరిగితే అంబులెన్సులు అందుబాటులో లేని కంపెనీలు వున్నాయంటే కార్మికుల ప్రాణాల పట్ల యాజమాన్యాలకు ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమౌతుంది.
భద్రతా చర్యలు
అన్ని కంపెనీల్లో మూడు నెలలకు ఒకసారి భద్రతా ఆడిట్ జరిపించాలి. మండే స్వభావం కలిగిన రసాయనిక ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రతా పరికరాలు ఇచ్చి ఆ ప్రాంతంపై అవగాహన కల్పించాలి. సంవత్సరానికి రెండు సార్లు ధర్డు పార్టీ భద్రత ఆడిటింగ్ జరిపించాలి. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. సెజ్‌లలో సూపర్ స్పెషాలిటి హాస్పటల్ నిర్మాణం చేపట్టాలి. రసాయనాలతో కూడిన పరిశోధన ప్రయోగశాలలు వుండాలి. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రోగికి పరీక్షలు నిర్వహించి సరైన నిర్ధారణ చేసి, వైద్యం అందించాలి. ఇటువంటి చర్యలు చేపట్టి ప్రజల పట్ల ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి.
వ్యాసకర్త : సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె. లోకనాధం