Feb 20,2023 21:17

ముంబయి : దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో సోమవారం భారత మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌, రిలయన్స్‌, అదాని సూచీల అమ్మకాలతో సెన్సెక్స్‌, నిఫ్టీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ.. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 311 పాయింట్లు కోల్పోయి 60,692కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 100 పాయింట్లు తగ్గి 17,845 వద్ద ముగిసింది. అదాని గ్రూపు ఎకౌంట్స్‌ మోసాలకు పాల్పడుతుందని హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికతో గత కొన్ని రోజులుగా బ్యాంక్‌ సూచీలు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంక్‌ నిఫ్టీ 1.05 శాతం కోల్పోయింది. ఆటో, ఐటి రంగాలు మినహా మిగిలిన రంగాలు నష్టాలు చవిచూశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుందన్న భయాలు సూచీలను ఒత్తిడికి గురి చేశాయి. బిఎస్‌ఇలో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ షేర్‌ 1.01 శాతం లేదా రూ.24.55 కోల్పోయి రూ.2,415కు పడిపోయింది. అదాని ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 5.94 శాతం పతనమై రూ.1,619కి పడిపోయింది. ఇంట్రాడేలో ఈ సూచీ రూ.1,561 కనిష్ట స్థాయిని తాకింది.