ఆ సంఘటన విన్నప్పుడు
నా మనసు కుత కుతలాడుతుంది
నా నేత్రాలు అగ్నిగోళాలు అవుతాయి
నా నిస్సహాయతకు..
నవనాడులు కృంగిపోతాయి
ఆ వార్త చదివినప్పుడు
నా హృదయం ద్రవించిపోతుంది
నా కనులు నయాగరా
జలపాతాలు అయిపోతాయి
నా మనసు భగభగలాడిపోతుంది
ఆ దృశ్యం నన్ను పదేపదే వెంటాడుతుంది
నా కనురెప్పలు మూసుకోవు
నా గుండె తడారి పోతుంది
పాలకుల నిర్ణయాలు
వారి బతుకు పట్ల ఆశనిపాతమైపోతుంది
ఎందరి జీవితాలో
గాలిలో దీపాలై పోతున్నాయి
దేశానికి వెన్నెముక అంటారు
రైతే రాజు అంటూ అందలం ఎక్కిస్తారు
జై జవాన్ జై కిసాన్ అంటూ వంత పాడుతారు
ఎవ్వరూ.. చేయూతనివ్వరు
మట్టి ఎప్పుడూ నిన్ను మోసం చేయదు
మట్టిలో మాణిక్యాలు దొరుకుతాయి
మట్టి పరిమళాలు వెదజల్లుతుంది
మట్టి వాసన నీకు పట్టెడు మెతుకులు పెట్టకపోదు
కాలంతో పోటీ పడు
కాలాంతకుడుగా మారి చూడు
నవీన పద్ధతులు చేపట్టి చూడు
నీలో దయనీయం వీడిపోవునానాడు
పదిమందికి పని కల్పించేవు
కరువు కాటకాల్లో కూలీగా మారావు
కాయ కష్టం నీ కలవాటే
బ్రతుకు పోరాటంలో నీదే జయంలే
చావే సమస్యకు పరిష్కారం కాదు
బలవన్మరణం వద్దే వద్దు
బ్రతుకును బుగ్గి పాలు చేసుకోవద్దు
నిండు నూరేళ్లు చిరంజీవిగా జీవించు
గాదిరాజు రంగరాజు
8790122275