Sep 17,2022 06:36

న దేశంలో ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసు పరిశ్రమ రోజు రోజుకు విస్తరిస్తున్నది. సరుకుల ఉత్పత్తి రవాణా, రక్షణ మరియు సర్వీసుల కోసం ప్రైవేటు సెక్యూరిటీ మీద ఆధారపడుతున్న స్థితి క్రమంగా పెరుగుతున్నది. బహుళజాతి, జాతీయ సంస్థలు సెక్యూరిటీ సేవల పేరిట ఈ రంగంలో ప్రవేశించాయి. లక్షలాదిగా నిరుద్యోగులను సెక్యూరిటీ గార్డ్డులుగా నియమించుకుంటున్నాయి. వారికి నామమాత్రపు వేతనాలను చెల్లిస్తూ ఏజెన్సీలు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డుల భద్రత కోసం ప్రభుత్వాలు సెక్యూరిటీ, హౌస్‌ కీపింగ్‌ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఔట్‌సోర్సింగ్‌ సేవల ద్వారా సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నారు. ప్రభుత్వ రంగం లోని వివిధ సంస్థలలో, ప్రభుత్వ హాస్పటల్స్‌లో, యూనివర్సీటీలలో, బ్యాంకులు-ఎ.టి.ఎం ల విస్తరణ, ఎయిర్‌పోర్టులు, మెట్రోరైళ్ళు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియామకాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్‌ విద్యాలయాలు, ఆస్పత్రులు, రెసిడెన్షియల్‌ ఏరియాలన్నింటిలోనూ నేడు ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా నియమించబడిన వర్కర్లే పనిచేస్తున్నారు. నేడు దేశంలో సుమారు 22 వేలు ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల్లో సుమారు 80 లక్షల మంది గార్డులు, రిటైర్డ్‌ వర్కర్లు పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 5లక్షల మంది సెక్యూరిటీ గార్డులు ఈ సెక్యూరిటీ ఎజెన్సీల ద్వారా పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిలో వలస కార్మికులు గణనీయంగా వున్నారు. యు.పి, బీహార్‌, ఒడిషా, మధ్యప్రదేశ్‌, అస్సాం తదితర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్నారు. అనేక ఉన్నత విద్యార్హతలున్నప్పటికీ, ఉద్యోగాలు లేని స్థితిలో యువత ఈ సెక్యూరిటీ సర్వీసుల్లో అతి తక్కువ వేతనాలతో, ఎటువంటి సౌకర్యాలు లేక సెక్యూరిటీ లేని స్థితిలో వీరు పని చేస్తున్నారు.
     ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల కింద పని చేస్తున్న గార్డులు, ఇతర సిబ్బంది కోసం ప్రైవేటు సెక్యూరిటీ ఎజెన్సీ రెగ్యులేషన్‌ చట్టం-2005ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. దీని ప్రకారం ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీ లైసెన్సు తీసుకున్నాక మాత్రమే సర్వీసులు నడపాలి. ఆచరణలో చాలా సంస్థలు ఎలాంటి లైసెన్స్‌లు లేకుండానే తమ బిజినెస్‌ కొనసాగిస్తున్నాయి. ఇందులో పని చేస్తున్న కార్మికుల చేత రోజుకు 12 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు. 8 గంటలు దాటి వీరు అదనంగా పని చేస్తున్నా ఓ.టి చెల్లించడం లేదు. ఎలాంటి సెలవులు లేవు. కేంద్ర చట్టం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కనీస వేతనం నిర్ణయించలేదు. మన రాష్ట్రంలో సెక్యూరిటీ సర్వీసులు షెడ్యూల్‌ ఎంప్లారుమెంట్‌లో ఉన్నప్పటికీ గత పది సంవత్సరాలుగా వీరి కనీస వేతనాలను ప్రభుత్వం సవరించలేదు. దీని వలన 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు నష్టపోతున్నారు. ఈ మేరకు లాభాలు గడించటానికి కాంగ్రెస్‌, టి.డి.పి, వైఎస్సాఆర్‌సిపి రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలు మరింతగా లాభాలు గడించటానికి సహాయ సహకారాలు అందించాయి.
      పి.ఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌, గ్రాట్యూటీ, ప్రసూతి ప్రయోజనం, యాన్యూటి, కార్మికులకు పరిహారం వంటి చట్టబద్ధ సౌకర్యాలు సెక్యూరిటీ గార్డులకు అమలుకావటం లేదు. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ చెయ్యటంలేదు. విధి నిర్వహణలో సెక్యూరిటీ గార్డులపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయి. వీరి చేత పనిచేయించుకోవటమే తప్ప కనీసం పని ప్రదేశాల్లో మంచినీరు, టాయిలెట్లు, రక్షణ పరికరాలను యాజమాన్యాలు అందించడం లేదు. యూనిఫామ్‌, బూట్లు...వగైరా ఖర్చులను వీరికి వచ్చే అరకొర వేతనాల నుండే భరించాలి. కనీసం గుర్తింపు కార్డులను కూడా కొన్ని సంస్థలు జారీ చేయకపోవడం వలన విధులు నిర్వహించి అర్ధరాత్రి ఇళ్ళకు చేరుకునే సమయాలలో పోలీసుల వేధింపులు షరామామూలే. వచ్చే అరకొర వేతనాలు నెలనెలా రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను వీరు ఎదుర్కొంటున్నారు. రోజుకు బ్యాంకుల ద్వారా రూ.15,000 కోట్ల నగదును వ్యాన్ల ద్వారా వీరి పర్యవేక్షణలో రవాణా చేస్తున్నారు. కానీ ఈ సెక్యూరిటీ సిబ్బందికి ఎలాంటి రక్షణ లేదు. నిత్యావసర ధరల పెరుగుదల వల్ల చాలీచాలని వేతనాలతో, దుర్భరమైన జీవితాలు గడుపుతున్న సెక్యూరిటీ సంస్థల సిబ్బందిని ఆదుకునేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు మాత్రం లాభాలు కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వాల నిర్వాకం వలన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల పని నేడు మంచి లాభాదాయకమైన వ్యాపారంగా మారింది.
        ఇప్పటికే కేరళ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, ఎం.పి, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సెక్యూరిటీ గార్డులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఓరియన్‌, జైబాలాజీ, డీఏఎస్‌బీ, వారియర్‌, గ్లాడియేటర్‌, ఓపిడిఎస్‌, మాక్స్‌ సెక్యూరిటీ మొదలైన సంస్థల్లో పనిచేస్తున్న గార్డులు సంఘటితమై సమస్యలను కొంత మేర పరిష్కారం చేసుకున్నారు.
       ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీల రెగ్యులరైజేషన్‌ చట్టం-2005ను సక్రమంగా అమలు చేయాలని, సెక్యూరిటీ గార్డులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, చట్టప్రకారం ఓవర్‌టైమ్‌కు డబుల్‌ పేమెంట్‌ ఇవ్వాలని, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇ.ఎస్‌.ఐ, పి.ఎఫ్‌, గ్రాట్యూటీ, బోనస్‌, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, పని ప్రదేశాలలో మంచి నీరు, విశ్రాంతిగదులు, టాయిలెట్లు, యూనిఫారమ్‌, టార్చిలైట్లు, రక్షణ పరికరాలు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, కార్మిక చట్టాల సవరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సెక్యూరిటీ గార్డులు తమ జాతీయ సదస్సును ఆగస్టు 28న విజయవాడలో నిర్వహించుకున్నారు. దేశవ్యాప్తంగా సంఘటితమై తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి సన్నద్ధమవుతున్నారు.

(వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర కోశాధికారి,
ఎ.పి సెక్యూరిటీ గార్డ్స్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ సలహాదారు)
ఎ.వి. నాగేశ్వరరావు

ఎ.వి. నాగేశ్వరరావు