ప్రజాశక్తి-కాకినాడ : జిల్లాలో రెండో దశ సమగ్ర భూ సర్వే పనులపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి ఆగస్టు నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టరు ఎస్.ఇలక్కియ, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టరు కృతికా శుక్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకానికి సంబంధించి రెండో దశ కింద జిల్లాలో 112 గ్రామాల్లో సర్వే పనులు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న ఆగస్టు నెల నాటికి ఈ సర్వే పనులు అన్నిటిని పూర్తి చేసే విధంగా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకొని గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామ సర్వే అధికారి లాగిన్‌లో ఉన్న డేటా వివరాలు నమోదు చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంబంధించి ప్రజల సంతప్తి స్థాయిని పెంచే విధంగా అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కౌలు రైతు కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు అర్హులైన కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు అందే విధంగా చూడాలని అదేవిధంగా కౌలు రైతు కార్డు పొందిన రైతులకు బ్యాంకు రుణాల మంజూరుపై అధికారులు దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. జగనన్న పాల వెల్లువ పథకానికి సంబంధించి నిర్వహిస్తున్న బీఎంసీయు యూనిట్ల గ్రౌండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ల్ వంటి ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ఎ.రమణా రెడ్డి, సీపీవో పి.త్రినాథ్, ఏడీ సర్వే బి.లక్ష్మీనారాయణ, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజరు కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్.సూర్యప్రకాశరావు, డీపీవో ఆర్.విక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఆర్.రమేష్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, కాకినాడ, పెద్దాపురం డీఎల్‌డీవోలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.










