శీతాకాలం రాగానే .. వాతావరణం చల్లబడగానే.. ఆ గిలిగింతలకి ఎన్నో మొక్కలు ఉబ్బితబిబ్బులైపోయి.. తమ నవ్వుల్ని పువ్వుల రూపంలో విచ్చుకుంటుంటాయి. వీటినే మనం వింటర్ సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ అంటుంటాం. ఇవి సీజనల్ పూల మొక్కల ప్రపంచంలో వేల సంఖ్యలో ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న మొక్కలే అపురూపంగా పూసి, అబ్బురంగా విచ్చుకుంటాయి. అలాంటి కొన్ని అరుదైన సీజనల్ పూల మొక్కలను చూసేద్దాం!
- ప్రైములా వల్గారిస్..
గమ్మత్తయిన మొక్క ప్రైములా వల్గారిస్. ఆకులు దళసరిగా, ఆకుపచ్చగా, కాస్త వెడల్పుగా పుదీనా ఆకులను పోలి ఉంటాయి. మొక్క ఆరు నుంచి పది అంగుళాలు పొడవు వరకు పెరుగుతుంది. శీతాకాలం రాగానే వాటి మొవ్వు భాగం నుంచి గుత్తులుగా పూలు అంకురిస్తాయి. పూల ఆకారం, పరిమాణం ఆకర్షణీయంగా ఉంటాయి. వృత్తాకారంగా ఉన్న పూరేకలు ఒక రంగు, మధ్య భాగంలో వేరొక రంగుతో అందంగా ఉంటాయి. వీటిని ప్రైమ్ రోజాలు అని కూడా అంటారు. వీటిలో పింక్, పసుపు, తెలుపు రంగులే కాక, మరికొన్ని రకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి సెమీషేడ్ ఇండోర్ ప్రాంతాల్లో బాగా విచ్చుకుంటాయి. కొబ్బరి పొట్టులో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. కొద్ది కొద్దిగా నీటి వనరు అందిస్తే సరిపోతుంది. కుండీల్లో పెంచుకొని, ఇంటిలో ఎక్కడైనా అలంకరించుకునే సౌలభ్యమున్న మొక్క.
- గజేనియా లీనియరీస్..
అమెరికాలో గ్రాస్ ఫ్లవర్ అంటే.. గడ్డిపువ్వుగా పిలిచేది గజేనియా లీనియరీస్. చూడ్డానికి పువ్వులు ప్రొద్దుతిరుగుడు పువ్వుల్లా కనిపిస్తాయి. పసుపు రంగు పూరేకల మధ్యభాగంలో ముదురు రంగు స్నఫ్ కలర్‌తో ఈ పువ్వు ఎంతో మనోహరంగా ఉంటుంది. కేవలం ఆరు నుండి పది అంగుళాల పొడవు వరకు ఈ సీజనల్ మొక్క పెరుగుతుంది. సన్నగా, పొడవుగా ఉండే ఈ ఆకుల్ని పువ్వులు డామినేట్ చేసేస్తాయి. ఎండలు మొదలుకాగానే పూత తగ్గిపోయి, మొక్క కూడా చనిపోతుంది. ఇది పూర్తిగా ఎండలో పెరిగే మొక్క.
- డయాంతస్ బార్బాటస్..
డయాంతస్ బార్బాటస్ సీజనల్ మొక్క. శీతాకాలంలో విరగ పూస్తుంది. ఆకులు చిన్నగా ఉంటాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే పువ్వులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొక్క నిండుగా పూలు పూస్తే భలే కనిపిస్తుంది. దీనిలో చాలా రకాల రంగుల్లో పూలు పూసే మొక్కలు ఉన్నప్పటికీ.. బార్బాటస్ అనేది సరికొత్త రకం. ఇది అమెరికాకు చెందిన మొక్క.
- కొరియాప్సిస్ లాన్స్యోలేట..
అద్భుతమైన తేజోవంతమైన సీజనల్ పూలు కొరియాప్సిస్ లాన్స్యోలేట. ఇంగ్లాండ్‌కి చెందిన ఈ సీజనల్ పూల మొక్కలు తొలిసారి కడియం నర్సరీకి వచ్చాయి. పసుపు రంగు పూలకు చుట్టూ తెలుపురంగు ఛాయ ఎంతో అందంగా ఉంటుంది. మధ్యలో ఉండే పుప్పొడి పూలకు మరింత అందం, అద్భుతం. పూల మొగ్గలు చామంతి పూలను పోలి ఉంటాయి.
- లోరో పెటాలం చైనెన్స్..
అచ్చంగా కాగితం రేకల్లా ఉండే ఈ పూలమొక్కను లోరో పెటాలం చైనెన్స్ అంటారు. జెండా కాగితాన్ని పీలికలుగా కత్తిరించిన మాదిరిగా పువ్వు ఉంటుంది. మొక్క కొమ్మకి చిటారున గుత్తి రేఖలుగా, ఒకేపువ్వు పూస్తుంది. పింకు రంగులో ఉండే ఈ పువ్వు చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క అడుగు ఎత్తు వరకు పెరుగుతుంది. ఇదికూడా శీతాకాలం సీజన్లో పువ్వులు పూసే మొక్కే. సీజన్ కాగానే నెమ్మదిగా మొక్క కూడా చనిపోతుంది. శీతల దేశాల్లో అలంకరణకు ఈ మొక్కలను ఎక్కువగా వినియోగిస్తారు. బయట వాతావరణంలో పెరిగే వీటిని కుండీల్లోనూ, గ్రోబ్యాగుల్లోనూ పెంచుకోవచ్చు.
లిల్లీయం బుల్బిఫెరం..
దళసరిగా పొడవాటి ఆరు రేకలుండే మొక్క లిల్లీయం బుల్బిఫెరం. స్పష్టంగా చెప్పాలంటే ఇది లిల్లీ పూలజాతిలో ఒక రకం మొక్కే. అత్యాధునిక రంగుల్లో ఫ్లోరోసెంట్ మెరుపులతో పువ్వు కనిపిస్తుంది. సువాసన భరితంగా ఉంటాయి. ఇందులో చాలా రంగులు, రకాలు ఉన్నాయి. మొక్క ముందుగా దొండకాయ ఆకారంలో పొడవాటి మొగ్గలు వేస్తుంది. తర్వాత పువ్వులుగా విచ్చుకుంటాయి. స్పెయిన్, ఫిన్లాండ్, ఉక్రెయిన్‌లో ఇవి కనిపిస్తాయి. కుండీల్లోనూ, నేల మీద అలంకరణ కోసం పెంచుకోవచ్చు.
చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506