Feb 26,2023 12:42
  • 33వ విజయవాడ పుస్తక మహోత్సవం...

నేస్తాలన్నీ ఒకే చోట.. ఆగుతుందా మనసిక..!
విరిసిన విరుల నడుమ... పురివిప్పిన తలపులు
సుమనోహర పరిమళాలను వెదజల్లునట్లు...
విరితోటలోని రకరకాల పూలన్నీ కుప్పలుగా పోసి
మనసును మధురోహల్లోకి కొనిపోయినట్లు...
విజ్ఞానమంతా ఒకేచోట చేరి...
మెదళ్లలో గూడుకట్టిన
అజ్ఞానాంధకారాన్ని తరుముతూ...
ప్రభవించే కాంతిపుంజం... అక్షరం.

అక్షర సమూహాలన్నీ రంగురంగుల పూలమాలికల్లా
అరల్లో ఒదిగిపోయి... విజ్ఞానపు వెలుగులను ప్రసరింపజేస్తుంటే
చూడటానికి రెండు కళ్లూ చాలవు.
ఆ విజ్ఞాన కాంతిని ఆవాహన చేసుకోడానికి జ్ఞాననేత్రం కావాలి. మనోనేత్రంతో చూడాలి.
కొలనులో కనువిందు చేసే బంగారు తామరల్లా.... విద్యుద్దీపాల కాంతిలో రకరకాల పుస్తకాలు
విజ్ఞాన కాంతులను ప్రసరింపజేస్తున్నాయి.
మనిషి మెదళ్లను విజ్ఞాన జ్యోతులుగా మార్చే జ్ఞాన సంపద అది.
పూల మకరంధాన్ని గ్రోలడానికి పూలచుట్టూ తిరిగే తుమ్మెదల్లా...
ఆ విజ్ఞానామృతాన్ని గ్రోలడానికి గుమికూడినట్లు కనిపిస్తున్నారు ఆ బుక్‌స్టాల్స్‌ చుట్టూ మూగిన జనం.
అవును... చదువరులకు బుక్‌ ఎగ్జిబిషన్‌ ఎప్పుడూ విందు భోజనమే..! పసందైన పండుగే !
అసలు పుస్తక పరిచయమే లేనివారికి కొత్త నేస్తాలు దొరికినట్టే..! అక్షరాలన్నీ కూడబలుక్కొని, ఒక్కచోట చేరి పండుగ చేసుకుంటుంటే.. ఆ సందడే వేరు... ఆ కిక్కే వేరు.
రుతువులన్నీ ఒక్కచోట చేరినట్లు... పుస్తకాలన్నీ ఒక్కచోట చేరితే... అదే పుస్తకాల రుతువు.
ఈ రుతువులో తెలుగు రాష్ట్రాల్లోని పుస్తకాలన్నీ ఒక్కచోట చేరతాయి. విజ్ఞాన దివిటీలను వెలిగిస్తాయి.
అలాంటి సందర్భమే... విజయవాడలో ఫిబ్రవరి 9నుంచి 19వరకు నిర్వహించిన బుక్‌ ఫెస్టివల్‌.

01


'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నాడో కవి. ఒక్క పుస్తకం తోడుంటే.. అనంత జ్ఞానం మనతో ఉన్నట్లే. అలసిపోయిన బాటసారికి చల్లని చెట్టు నీడ దొరికితే.. ఆ చెట్టుకు తియ్యటి పండ్లు ఉంటే..! అలా ఉంటుంది పుస్తకాలతో నేస్తం.. అక్షరాలతో సహవాసం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా... పుస్తకాలు డిజిటల్‌ రూపంలోకి మారినా... పుస్తకాన్ని స్పర్శించే అనుభూతి... పఠనంతో వచ్చే జ్ఞానం శాశ్వతం. పుస్తకం మనకు విజ్ఞానం, వినోదం అందిస్తూ కొత్త ఆలోచనల ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఊహాశక్తిని పెంచి మరింత జ్ఞానవంతం చేస్తుంది. పుస్తకం నిజమైన స్నేహితుడు.

22


ప్రతీ ఏడూ విజయవాడ నగరంలో జనవరిలో జరిగే ఈ పుస్తక మహౌత్సవం... ఈసారి ఫిబ్రవరిలో జరిగింది. 33వ విజయవాడ పుస్తక మహౌత్సవం.. ఈసారి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ గ్రౌండ్‌లో జరిగింది. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో 200కి పైగా ప్రచురణ సంస్థలు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్నాయి.

779


                                                                     హుషారుగా ప్రతిభా వేదిక...

పుస్తక ప్రదర్శన మహోత్సవాలలో ... ప్రతీరోజూ సాయంత్రం 6 గంటలయితే చాలు... ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గొల్లపూడి మారుతీరావు సాహిత్య వేదికపై కళాకారుల సందడి హౌరెత్తింది. కళాకారులు, వక్తలు, విద్యార్థులు, యువతీయువకులు, రచయితలు, కవులు, జర్నలిస్టులు.... చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ ఆ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించి సత్తా చాటారు. సాహిత్య చర్చలు, పుస్తకావిష్కరణలు, రచయితలకు-కవులకు సన్మానాలు జరిగాయి. క్విజ్‌ పోటీలు, పప్పెట్‌ షోలు, సైన్స్‌ ప్రయోగాలు, మ్యాజిక్‌లు ఒకటేమిటీ అన్ని రకాల కళా ప్రదర్శనలతో ప్రతిభా వేదిక హుషారు నింపేసింది.

33


                                                                         విద్యార్థులతో కళకళ...

ఈ పుస్తకాల పండుగలో .. రోజురోజుకూ సందర్శకులు, పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్ద స్థాయిలో కళాశాలలు, విద్యా సంస్థలు ఉండటంతో సాయంత్రవేళల్లో పుస్తక మహౌత్సవ ప్రాంగణమంతా విద్యార్థులతో కళకళలాడింది. ముఖ్యంగా విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాల కోసం ఆయా పుస్తక స్టాల్స్‌ను సంప్రదించడంతోపాటు ఎలాంటి పుస్తకాలు కావాలో ఆయా పబ్లిషర్స్‌ను అడిగి తెలుసుకుంటున్నారు. రానున్న రెండు మూడు నెలల్లో వివిధ ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు జరుగనుండగా... దీనితో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, వివిధ ప్రవేశ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో పేరొందిన పబ్లిషర్స్‌ ప్రత్యేకంగా పుస్తకాలను రూపొందించాయి. వాటిని విద్యార్థులు ఎక్కువ మంది కొనుగోలు చేశారు. విద్యాసంస్థల ఉపాధ్యాయులు, మహిళలు పుస్తక మహౌత్సవ్‌కు రావడంతో ఎటుచూసినా సందడి నెలకొంది.

33


                                                              టెక్నాలజీ పెరిగినా.. పుస్తకాలదే పైచేయి..

ప్రస్తుతం టెక్నాలజీ ప్రాధాన్యతగా ఉంది. ఏది కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చాలు అనుకుంటే పొరపాటే. గూగుల్‌లో దొరికే సమాచారం ఆలోచన శక్తికి ప్రాధాన్యతనివ్వదు. కావాల్సిన సమాచారాన్నంతా చిత్రాలతో సహా ఇస్తూ అప్పటికి అవసరాన్ని మాత్రమే తీరుస్తుంది. కానీ పుస్తకం చదువరుల ఆలోచనాశక్తిని పెంచుతుంది. ప్రశ్నించే తత్వాన్ని పెంచుతుంది. దృశ్యాలను కళ్లకు చూపిస్తుంది. ఒక్కచోటే ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఎన్ని ఏళ్లయినా పాఠకుని ఆలోచనలో పుట్టిన చిత్రాలు, విషయ సంగ్రహణ తొలగిపోవంటే అతిశయోక్తి కాదు. అందుకే కదా.. టెక్నాలజీ ఎంత పెరిగినా పాఠకుల మనస్సు పుస్తకం పైనే ఉంటుంది. పరుగుపందెంలో పుస్తకాలదే పైచేయి మరి..!

444


                                                                       పుస్తక పఠనం పెరగాలి..

  • ఆధునికయుగంలో పుస్తకపఠనం తగ్గింది. ఎక్కువ మంది సెల్‌ఫోన్లకు బానిసలవుతున్నారు. కానీ, పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెంపొందుతుంది. చైతన్యం కలుగుతుంది. ప్రతీ ఒక్కరూ తప్పకుండా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. మంచి పుస్తకాలను కొనాలి. బహుమానంగా పుస్తకాలను ఇచ్చి పుచ్చుకోవాలి. పుస్తక పఠనం అభిరుచిగా మారాలి.
  • యువత సెల్‌ఫోన్లను అవసరం మేరకు వినియోగించుకోవాలి. పుస్తక పఠనానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.
  • సబ్జెక్టు పుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి పెంపొందుతుంది.
  • విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలు కాకూడదు. పుస్తకపఠనం అలవాటు చేసుకోవాలి. తప్పనిసరిగా మహనీయుల జీవిత చరిత్రలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను చదవాలి.
  • పుస్తకం చదవడం వల్లనే విప్లవాలు వస్తాయి. చైతన్యమే ఒక విప్లవం.
  • పిల్లలతో కలిసి పుస్తక ప్రదర్శనను సందర్శించి మంచి పుస్తకాలు పొందేలా, చిన్నప్పటి నుండే పుస్తకాలు చదివేలా వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
997


                                                                  పుస్తక పఠనంతో ఇవి సాధ్యం...

పుస్తక పఠనం వల్ల మెదడుకు వ్యాయామం, మెరుగైన జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణ, సాహిత్య నైపుణ్యం, మంచి నిద్ర, ఒత్తిడిని అధికమించటం, ఉన్నతంగా ఆలోచించే శక్తి సాధ్యమవుతుంది

555


                                                                  చైతన్యాన్ని ఏవీ అడ్డుకోలేవు...

శాస్త్రీయ దృక్పథం వైపు ముందడుగులు వేస్తూ .... సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని దేశాభ్యుదయానికి సన్నద్ధం కావల్సిన యువతను, ప్రజలను తప్పు దారి పట్టించే రాజకీయ ప్రయోజనాలు, మతతత్వ సిద్ధాంతాలు ప్రగతిని అడ్డుకునే గుదిబండల్లా ఉండటం విచారకరం. గతంలోనూ మతాలను, మూఢనమ్మకాలను బలపరిచే పుస్తకాలు, స్టాల్స్‌ లేకపోలేదు.. కానీ ఈసారి పుస్తక ప్రదర్శన పండుగలో అవి ఎక్కువగా ఉండటం శోచనీయం. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాట యోధుల ఫొటోల్లో మొదట సావర్కర్‌ చిత్రాలు పెట్టడం చూస్తే.. సంఘపరివార్‌ శక్తులు బుక్‌ ఫెస్టివల్‌నూ తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. మతభావజాలాన్ని ప్రతిబింబించేలా కొన్ని స్టాల్స్‌, ప్రదర్శనలు ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు. పావురాళ్ల మధ్య కాకులు వాలినంత మాత్రాన వ్యత్యాసం తెలియకపోదు. పుస్తకాల నేస్తాలు ఆ వాసనను ఇట్టే పసిగట్టేస్తాయి. ముఖ్యంగా మత సామరస్యాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఎన్ని జరిగినా ... విజ్ఞానవంతులు, ఆలోచనాపరులు వాటిని సులభంగానే గుర్తిస్తారు.

777


                                                                       200కుపైగా స్టాల్స్‌....

తెలుగు తెర, తెలుగు సినిమా సాహిత్యం, ధ్రువతారలు వంటి సినిమా పుస్తకాలు,
వేయిపడగల మేధావి వంటి రాజకీయ ప్రచురణలు
పాటల తోటమాలి, ఎంఎస్‌.సుబ్బలక్ష్మి, ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల వంటివారి సంగీత పుస్తకాలు
జర్నలిస్టు కరదీపికలు, జర్నలిజం విత్‌ హ్యుమన్‌ టచ్‌ వంటి పాత్రికేయుల పుస్తకాలు

888


పురాతన నాణెములు, మంగళగిరి హాస్యానందాలు, సరసి కార్టూన్లు వారి... నవ్వుల కరోనాయనా..!, అమ్మనుడిని అటకెక్కిస్తావా !, నవ్వించే కార్టూన్ల పుస్తకాలు. ఇంటర్‌ స్టార్‌ క్వశ్చన్‌ బుక్స్‌, సమాజ సిద్ధాంతాలు, పెద్ద బాలశిక్ష, మనోరమా ఇయర్‌ బుక్‌ 2023, గంటల పంచాంగము, శుభతిధి, నెల్లూరువారి ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలలో.. రోజూ మనం తినే ఆహార నియమాలు, పద్ధతులు వంటివి అనేకం వున్నాయి.

1111


కెరియర్‌ గైడెన్స్‌నిచ్చే ఎక్సెల్లా ట్రైనింగ్‌ సెంటర్‌ స్టాల్‌, జనవిజ్ఞానవేదిక స్టాల్స్‌లో చిన్నలను పెద్దలను అలరించే తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు, ఎరేజ్‌ స్కెచ్‌ రైటింగ్‌ స్టాల్స్‌ , ఎరేజ్‌ పెన్సిల్‌ రైటింగ్‌ స్టాల్స్‌, సాహిత్య, విజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషన్‌, కార్టూన్లు, బిజినెస్‌, తదితరాంశాలతో చిన్నారుల నుండి పెద్దల వరకు ఉపయోగపడే ప్రజాశక్తి బుకహేౌస్‌ స్టాల్స్‌, చెగువేరా, మహానటి సావిత్రి వంటి మహనీయులు, పోరాటయోధులు, కళాకారుల చిత్రపటాల స్టాల్స్‌, చందమామకథలు, చిన్నారుల కథలు, పిల్లల భాషా ప్రచురణలతో పిల్లల పుస్తక ప్రపంచంగా ప్రత్యేక ఆకర్షణగా మంచి పుస్తకం బుక్‌ స్టాల్‌, అక్షరాలను లిపి భాషలో దిద్దే పలకల స్టాల్‌, హైదరాబాద్‌ నుండి వచ్చిన జేత కాంపిటీషన్స్‌ వారి పుస్తకాలు..

665

ముఖ్యంగా ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌కు కావల్సిన అన్ని పుస్తకాలున్నాయి. సిరీ క్రిష్టల్స్‌ విజయవాడ వారి హిందూ పురాణాలు, ధర్మ దీపం ఫౌండేషన్‌వారి భారతీయ జానపద కథలు, వేమన ఫౌండేషన్‌వారి ప్రచురణలు

889


ప్రజాసాహితి వారి ప్రగతిశీల, అభ్యుదయ సాహిత్యం పుస్తకాలు, శ్రీహర్ష పబ్లికేషన్స్‌ విజయవాడ వారి సాహిత్య కళారంగ పుస్తకాలు, పేపర్లతో కళాత్మక వస్తువులను తయారుచేసే స్టాల్స్‌, సుప్రీం లా హౌస్‌ వారి లా బుక్స్‌, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం వంటి వాటితో పాటు సాయిలత డ్వాక్రా గ్రూప్‌ వారి పచ్చళ్లు, కారపొడులు, ఒడియాలు, పూతరేకులు, ఫుడ్‌ ఐటమ్స్‌కు కూడా చోటు కల్పించారు.

990


రాష్ట్ర స్థాయిలో ఆయా ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహించిన పోటీలలో విద్యార్థులు పాల్గొనగా విజేతలైనవారు ప్రదర్శించిన చేతి అలంకరణ వస్తువులు 'పాఠశాల విద్యా శాఖ .. సమగ్ర శిక్షా పేరున పెద్ద స్టాల్‌ ఎపి గవర్నమెంట్‌, డెక్కన్‌ క్రోనికల్‌ స్టాల్‌, లోగిలి. కో గుంటూరు, దేవుళ్లు.కం రాజమండ్రి, శ్రావ్య ఎడ్యుకేషనల్‌ ఎడిటి. హైదరాబాద్‌, ఎమెస్కో బుక్స్‌ విజయవాడ, తెలుగు పబ్లికేషన్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌, అక్షయ బుక్స్‌ విజయవాడ, తెలుగుజాతి ట్రస్ట్‌ అమ్మనుడి పత్రిక, న్యూకమల్‌ పబ్లికేషన్స్‌ న్యూఢిల్లీ హైదరాబాద్‌, సాహిత్య నికేతన్‌, 10 శాతం తగ్గింపుతో ప్రజాశక్తి బుకహేౌస్‌,

886

విశాలాంధ్ర బుకహేౌస్‌ విజయవాడ, హేమా పబ్లికేషన్స్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా, తెనాలి..దీప్తి పబ్లికేషన్స్‌, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా కోల్‌కత్తా, నవచేతన బుక్‌ హౌస్‌ హైదరాబాద్‌, మంజుల్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రైవేటు లిమిటెడ్‌..నోయిడా, విజిఎస్‌ బుక్‌ లింక్స్‌ విజయవాడ, జెపి పబ్లికేషన్స్‌ విజయవాడ, ముంబయి బుక్స్‌, ముద్ర బుక్స్‌ విజయవాడ, చందమామ కథలు విజయవాడ, జనచేతన, బుక్‌ స్టోర్‌ హైదరాబాద్‌, జికె పబ్లికేషన్స్‌, సాహితీ, దిశా, అరుణతార హైదరాబాద్‌, వివేకా వాణి తెనాలి, జై భీమ్‌ బుక్‌ హౌస్‌ సికింద్రాబాద్‌, రైతు నేస్తం హైదరాబాద్‌, నవరత్న, స్వాతి, లోకాయత పొన్నూరు, శ్రీగణేష్‌, శ్రీనిహిల్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం హైదరాబాద్‌, వేదవ్యాస స్టాల్స్‌ విభిన్న రకాల సాహిత్యాన్ని అందించేందుకు ప్రయత్నించాయి.

997


పుస్తకం అతి పెద్ద సంపద. పుస్తకం... రాబోయే తరాలకు వారధి. పుస్తకాన్ని చదువుదాం... చదివిద్దాం. ముఖ్యంగా పిల్లలకు చిన్నతనం నుంచే పుస్తక పఠనం అలవాటు చెయ్యాలి. తద్వారా ఒక తరాన్ని విద్యావంతులను చేస్తే... ఎన్నో తరాలకు కావాల్సినంత విజ్ఞానాన్ని వారు అందించగలుగుతారు. భవిష్యత్తరాలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దగలుగుతాం.