
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మత్స్య సంపద వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈనెల 28నుంచి 30వరకు విజయవాడలో సీఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని ఎ వన్ కన్వెన్షన్ సెంటర్‌లో భూమి ఆర్గానిక్స్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా మన్నారు. మత్స్యసంపద వినియోగాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ మార్కె టింగ్ సౌకర్యాలను విస్తృతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. సాలీనా 50లక్షల మెట్రిక్ టన్నులతో మత్స్య సంపద ఉత్పత్తిలో రాష్ట్రం ఆక్వా హబ్‌గా పేరు తెచ్చుకుందన్నారు. దేశ వ్యాప్తంగా 75శాతం మేర రొయ్యలు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంటే వాటి వినియోగం రాష్ట్రంలో 5శాతంలోపే ఉందన్నారు. డొమెస్టిక్ మార్కెట్‌ను విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్న సిఎం ఆదేశాల ప్రకారం తక్షణ చర్యగా ''ఫిష్ ఆంధ్రా'' అనే ఒక బ్రాండును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ తరువాత విశాఖ, కాకినాడ, బీమవరం, నెల్లూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్లు వివిరావు, హీరానాయక్ పాల్గొన్నారు.