Nov 30,2022 10:22
  • ఓటుహక్కు వినియోగించుకోనున్న 2,39,76,670

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌ : గుజరాత్‌ తొలి దశ శాసనసభ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. బిజెపి, కాంగ్రెస్‌, ఆమాద్మీ పార్టీ హోరాహోరీగా ప్రచారం సాగించాయి. వామపక్షాల అభ్యర్థులు ప్రజా సమస్యలను అజెండాగా చేసేలా తమ ప్రచారాన్ని నిర్వహించాయి. తొలి దశలో 89 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 1న గురువారం నాడు పోలింగ్‌ జరగనుంది. మిగిలిన 93 స్థానాలకు డిసెంబరు 5న పోలింగ్‌ జరుగుతుంది.
           తొలి విడతలో దక్షిణ గుజరాత్‌, కచ్‌ - సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాలకు సంబంధించిన 89 శాసనసభ స్థానాల్లోనూ బిజెపి, కాంగ్రెస్‌ పోటీ పడుతుండగా, ఆమాద్మీ పార్టీ 88 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఆఖరు గడియలో సూరత్‌ తూర్పు స్థానం నుంచి ఆమాద్మీ పార్టీ నేత తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ 57 స్థానాల్లోనూ, భారతీయ ట్రైబల్‌ పార్టీ (బిటిపి) 14 స్థానాల్లోనూ, సమాజ్‌ వాదీ పార్టీ 12 చోట్ల, సిపిఎం నాలుగు స్థానాల్లోనూ, సిపిఐ రెండు స్థానాల్లోనూ తొలి విడతలో పోటీ చేస్తున్నారు. వీరుగాక 339 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 718 మంది పురుషులు కాగా, 70 మంది మహిళలు. గుజరాత్‌లో సాధారణంగా బిజెపి, కాంగ్రెస్‌ మధ్యే ద్విముఖ పోరు ఉండేది. ఈ దఫా ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ ప్రవేశంతో త్రిముఖ పోటీ నెలకొంది. వామపక్షాలు సైతం ఈ సారి తమకు పట్టున్న కేంద్రాలపై ప్రధానంగా దృష్టి నిలిపాయి.
తొలి దశలో ఇసుదన్‌ గద్వీ, పరుషోత్తం సోలంకి, కుంవర్జీ భవలియా, కాంతిలాల్‌ అమ్రుతియా, వివబ జడేజా, గోపాల్‌ ఇటాలియా వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. ఇసుదన్‌ గద్వీ ఆమాద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. కునవర్జీయా ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కాగా కాంతిలాల్‌ అమ్రుతియా ఇటీవల జరిగిన మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనలో సహయక చర్యల్లో పాల్గొని మంచి పేరు పొందారు. ఇక రిబ జడేజా ప్రసిద్ధ భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య. వీరితో పాటు ఆప్‌ గుజరాత్‌ అధ్యక్షులు గోపాల్‌ ఇటాలియా కూడా తొలి విడత బరిలోనే ప్రజాతీర్పు కోరుతున్న వారిలో ఉన్నారు.
 

                                                                        మోడీ విస్తృత ప్రచారం

తొలి విడత ఎన్నికల ప్రచారంలో బిజెపి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పెద్ద సంఖ్యలో సభలు నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తించారు. ధరల పెరుగుదల, మోర్భీ విషాద ఘటన, రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, మహిళలపై దాడులు, మత విద్వేషాలు, గోద్రా అనంతరం మారణహోమంలో భాగంగా మైనార్టీలపై చెలరేగిన హింసాకాండ, అదే నేపథ్యంలో అత్యాచారాలకు తెగబడిన కరడు గట్టిన నేరస్థులను ఇటీవల విడుదల చేయడం వంటివి బిజెపి పట్ల ప్రజానీకం తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకేలా చేశాయి. ప్రజాగ్రహాన్ని దారి మళ్లించేందుకు బిజెపి అగ్ర నేతలు తమ ప్రచారంలో శక్తిమేర ప్రయత్నించారు. ఉమ్మడి పౌర స్మృతి తీసుకొస్తామని, యుపి తరహాలో నిరసనకారుల నుంచి నష్ట పరిహారం రాబట్టే బిల్లు తెస్తామని వంటి మత విభజనకు దారితీసే అంశాలకే కాషాయ నేతలు ప్రాధాన్యత నిచ్చారు.
            ఆమాద్మీ పార్టీ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకొని బిజెపి వైఫల్యాలను ఎండగట్టారు. నోట్ల మీద లక్షీదేవి ప్రతిమ ముద్రించాలని, గణేష్‌ బొమ్మలు ముద్రించాలని డిమాండ్‌ చేయడం ద్వారా ఆయన తాను హిందూత్వ వాదినేననే సంకేతాలను సంఫ్‌ు పరివార్‌ కు చేరవేశారు. 27 ఏళ్ల బిజెపి పాలనలో గుజరాత్‌లో అన్నిరంగాల్లోనూ అభివృద్ధి పడకేసిందని, అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలోనూ ఢిల్లీ తరహాలో ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలలు నిర్మిస్తామని ఆయన హ్షామీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా జోడో యాత్రతో కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు నింపాలని ప్రయత్నిస్తున్న రాహుల్‌ గాంధీ గుజరాత్‌ ఎన్నికలకు అంతటి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
           ఎన్నికల సంఘం ప్రకారం తొలి విడతలో 2,39,76,670 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,24,33,362 మంది పురుషులు, 1,15,42,811 మంది మహిళలు కాగా 497 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు . గుజరాత్‌ లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,91,35,400 .
తొలి విడతలో 25,434 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పట్ణణాల్లో 9018, గ్రామీణ ప్రాంతాల్లో 16,416 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. తొలి విడతలొో మొత్తం 34,324 బ్యాలెట్‌ యూనిట్లను 34,324 కంట్రోలు యూనిట్లను, 38,749 ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ - వివిపిఎటిలు వినియోగించనున్నారు.