Apr 09,2023 07:57

ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ. కొత్తపాతల మేలుకలయికతో తెలుగువారి మత్తు వదలగొట్టిన భావ విప్లవకారుడు. తనకి అవసరమైన సాహిత్యాన్ని ఆ తరమే సృష్టించుకొంటుం దన్న సూక్తికి 'కన్యాశుల్కం' ప్రత్యక్ష నిదర్శనం. సాంఘిక నాటకాలు, స్వతంత్ర నాటకాలు, సామాజిక సమస్య గల నాటకాలు లేని లోటును 'కన్యాశుల్కం' పూరించింది. అందుకే గురజాడ 'కన్యాశుల్కం' అపూర్వ నాటక శిల్పంగా నిలిచింది. లెక్కలేనన్ని పునర్ముద్రణలతో ఈ నాటకం ఎప్పటికప్పుడు పునరుజ్జీవనం పొందుతోంది. ఇందులో భాగంగానే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలోని 'మానవవికాస వేదిక' కన్యాశుల్కం నాటకాన్ని తాజాగా మళ్లీ ముద్రించింది. విజయనగరంలోని గురజాడ గృహాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికీ కన్యాశుల్కం ప్రతిని ఉచితంగా ఇవ్వడం ఈ ప్రచురణ ముఖ్య ఉద్దేశం. ఆ ఇంటిని పర్యవేక్షిస్తున్న గురజాడ ముని మనుమడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్‌, సతీమణి ఇందిరాదేవిలకు ఈ 'కన్యాశుల్కం' ప్రతులను అందించారు.
'కన్యాశుల్కం' నాటకాన్ని గురజాడ అసలు ఎందుకు రాశారు!? గర్భస్థ శిశువును కూడా బేరం పెట్టడం వంటి దారుణ స్థితిగతులు గురజాడను కలచివేసి కన్యాశుల్కం నాటక రచనకు ప్రేరేపించాయి. ఈ దురాచారం పైన గురజాడ కత్తి దూయలేదు, దండెత్తలేదు, అవహేళన చేసి వదిలారు. లండన్‌లో మురికివాడల గురించి ప్రపంచ ప్రసిద్ధ నాటకకర్త జార్జ్‌ బెర్నార్డ్‌ షా 'విడోవర్స్‌ హౌసెస్‌' అన్న నాటకాన్ని రాసి 1892 డిసెంబర్‌ 9న ప్రదర్శించారు. దానికి నాలుగు నెలల ముందే 1892 ఆగస్టు 12న విజయనగరంలో 'కన్యాశుల్కం' నాటకాన్ని గురజాడ ప్రదర్శించారు. అయితే కన్యాశుల్కం నాటకం 1897లో ప్రచురించారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న 'కన్యాశుల్కం' రెండో కూర్పును 1909లో రచించారు. అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. ఓ సర్వే ద్వారా ఏటా 344 బాల్యవివాహాలు జరిగేవని తెలుసుకొన్న గురజాడ కలత చెందగా 'కన్యాశుల్కం' అనే ఒక గొప్ప సాంఘిక నాటకం మనకి లభించింది.
ఈ నాటకంలో గురజాడ సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు జీవం పోసుకున్నాయి. ఆనాటి హేయమైన మానవ నైజాలూ, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, నాటి సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ ఫొటో తీసి మన ముందుంచారు. ఈ నాటకంలోని కథావస్తువు 'సంఘసంస్కరణ'కి ఉద్దేశించింది. అందులో ముఖ్యాంశాల్లో చిన్న పిల్లల్ని ముసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయడం, వేశ్యావృత్తి హైన్యత, స్త్రీల దుస్థితి, పెద్ద మనుషులుగా చెలామణీ అయే కుహనా మేధావులు.ఐదేళ్ళకే బాలికలకి పెళ్ళిచేయడం వల్ల అనతికాలంలో వైధవ్యం రాక తప్పదు. బాలవితంతువులుగా జీవితం వెళ్ళబుచ్చవల్సిందే. ఈ నాటకంలో అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురిని లుబ్ధావధానికివ్వడంలో ప్రేమ లేక కాదు ధనాశ వల్లనే. ఎందుకంటే తన కొడుక్కి కూడా డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళి చెయ్యాలనుకుంటాడు కాబట్టి. కన్యాశుల్కం తీసుకోవడంలో ఉచితానుచితాలూ, న్యాయాన్యాయాలూ లేవు. అభం శుభం తెలియని ఆడపిల్లకి అమానుషంగా పెళ్ళి చెయ్యడం వెనుక ఉన్నది ధనవ్యామోహం. వీటినే గురజాడ ఈ నాటక రూపంలో వెల్లడించారు. పెద్ద మనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ, ఆదర్శాలకీ ఆచరణకీ పొంతనలేని వ్యక్తుల్ని 'గిరీశం', 'రామప్పపంతులు' వంటి పాత్రలతో కథలో పొందుపరిచారు గురజాడ. 'ఆధునికత' పేరుతో ఇంగ్లీషు చదువుపై గల వ్యామోహాన్ని వ్యక్తం చేశారు. ఈ నాటకంలోని వస్తువు మన సంస్కృతీ రుగ్మతను హెచ్చరిస్తూ సంఘ సంస్కరణ ఎంత అవసరమో వెల్లడిస్తుంది.
ప్రస్తుత కాలమాన పరిస్థితులతో పోలిస్తే.. నేటి తరానికి కన్యాశుల్కంలోని వస్తువు పాతదే. ఇందులో ప్రధాన సమస్యగా చెప్పిన కన్యాశుల్కం ఇప్పుడు లేదు. అయితే కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చింది. వేశ్యలకి చదువు, తెలివి, సంపద పోయి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ఈనాటికీ ఈ నాటకం జనాదరణ పొందడానికి కారణం, ఈ నాటకాన్ని ఒక 'సజీవసాహిత్య ప్రక్రియ'గా రూపొందించడమే. గురజాడలోని కళాప్రతిభ ఇందుకు ఒక ముఖ్యకారణం. పాత్రల తీరుతెన్నులు, సంభాషణల్లోని నైపుణ్యం, నాటకాన్ని సజీవం చేశాయి. 'గిరీశం' పాత్ర నాటకానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇకపోతే హాస్యం అన్ని కాలాల్లో అందరూ ఆనందించేటట్టు తీర్చిదిద్దారు. ఈ రోగిష్టి సమాజం, మనసు పుచ్చిన మనుషులు ఉన్నంతవరకూ ఈ నాటకం నిలుస్తుంది. అందుకనే ఇదొక మహా దృశ్యకావ్యంగా, తెలుగు సాహిత్య వారసత్వ సంపదగా నిలిచిపోయింది.

- తేజశ్విని

కన్యాశుల్కం
రచన : గురజాడ అప్పారావు
ప్రచురణ : భూమన కరుణాకర రెడ్డి
(గౌరవ అధ్యక్షులు మానవ వికాస వేదిక, తిరుపతి)
సందర్భం : సెప్టెంబర్‌ 21, 2022
వెల : గురజాడ గృహ సందర్శన
వివరాలు : 7306588999