Feb 28,2023 07:28

  • నేడు జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం

ప్రజల కోసం సైన్స్‌, దేశ స్వావలంబన కోసం సైన్స్‌, ప్రపంచ శాంతి కోసం సైన్స్‌, ప్రగతి కోసం సైన్స్‌, పర్యావరణం కోసం సైన్స్‌...అనే లక్ష్యాల సాధన కోసం జన విజ్ఞాన వేదిక 35 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కృషి చేస్తోంది. శాస్త్రీయ సమాజ నిర్మాణం పరమావధిగా పాటుపడుతూ నిరంతరం వైవిధ్య భరిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
          శాస్త్రీయ సమాజ నిర్మాణానికి అవరోధంగా నున్న నిరక్షరాస్యతను నిర్మూలించాల్సిన అవసరాన్ని గుర్తించి, బాధ్యతతో లక్షలాది స్వచ్ఛంద కార్యకర్తలను తయారుచేసింది. వారికి శిక్షణ ఇచ్చి కళాజాతాల ద్వారా ప్రజలలో చదువుకోవాలనే కోరికను రగిలించింది. కోట్లమంది నిరక్షరాస్యులను అక్షర కేంద్రాలకు నడిపించింది. ఎర్నాకులం నుండి ఆంధ్రావని దాకా సాగిన సాక్షరతా ఉద్యమంలో మమేకమై సాగింది.
        సాక్షరతా చైతన్యంతో అక్షర కేంద్రాలలో మహిళలు మద్యపాన నష్టాలను గుర్తించారు. మా ఊరికి సారా వద్దని దూబగుంట రోశమ్మ చేసిన పోరాటం రాష్ట్రమంతా వ్యాపించింది. జన విజ్ఞాన వేదిక వారికి అండగా నిలిచింది. అనేక నిర్బంధా లను తట్టుకొని నిలబడింది. ఈ ఉద్యమం రాజకీయ అంశంగా మారి ప్రభుత్వాలు మారే పరిస్థితి ఏర్పడింది. సారా వ్యతిరేక ఉద్యమంలో సంఘటితమైన మహిళలు ఆర్థిక పరిపుష్టి కొరకు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది వేలాదిగా పొదుపు సంఘాల ఏర్పాటుకు, మహిళా సాధికారతకు ఉపయోగపడింది. ఆ తరువాత రాజకీయ పరిస్థితులు మారి మద్యపాన నిషేధం ఎత్తివేయబడింది. అయినా తూర్పు గోదావరి జిల్లాలో జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ విభాగం చేస్తున్న అవగాహనా, ప్రచార కార్యక్రమాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి.
          నేడు కొంతమంది సూడోసైన్స్‌ను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. పురాణ కాలంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ వుందంటూ ప్రజలను నమ్మించాలని చూస్త్తున్నారు. ఇటువంటి రుజువు లేని అశాస్త్రీయ అంశాల వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తూ నిజమైన సైన్స్‌ ప్రజల ప్రగతికి ఎలా దోహదం చేసిందో జెవివి ప్రచారం చేస్తోంది.
         ''దేశమంటే మట్టి కాదోయ్ ...దేశమంటే మనుషులోయ్'' అనే గురజాడ మహాకవి స్ఫూర్తితో ఈ దేశం మనది ఈ దేశాన్ని కాపాడుకుందాం అని, సైన్స్‌ ప్రజల కోసమే అని చాటిచెప్పింది జన విజ్ఞాన వేదిక. రాష్ట్రం లోని వేలాది గ్రామాలలో 'జన జాగరణ' పేరుతో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి మౌలిక విషయాలపై 'హమారా దేశ్‌' కార్యక్రమంలో రోజుల తరబడి ప్రజలతో ప్రత్యక్షంగా చర్చించింది. దేశాన్ని తెలుసుకుందాం - దేశాన్ని మార్చుకుందాం (దేశ్‌ కో జానో - దేశ్‌ కో బదలో) అంటూ మేధావులను దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసింది.
         రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు కీలకమైన సహజ వాయువు విషయంలో రిలయన్స్‌ సంస్థ చేసిన అన్యాయాన్ని ఆనాడే ఎండగట్టడానికి 2007లో జీపు జాతాలను నిర్వహించింది. గవర్నర్‌, ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి కౌన్సిల్‌లో తీర్మానం ఆమోదించబడేటట్లు చేసింది జన విజ్ఞాన వేదిక.
ఆస్తమా వ్యాధిగ్రస్తులతో చెలగాటమాడుతూ హైదరాబాదులో బత్తిన సోదరులు వేసే చేపమందు శాస్త్రీయతను జన విజ్ఞాన వేదిక ప్రశ్నించింది. ప్రయోగశాలలో పరిశీలింపచేసి చేప మందుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసింది. ప్రజా చైతన్య, అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. అన్ని ప్రయోగశాలల్లో చేపమందులో ఆస్తమా నివారణ గుణాలు లేవని తేల్చి చెప్పడంతో వారు చట్టం నుండి తప్పించుకోడానికి ''మందు కాదు..ప్రసాదం'' అని చెప్పడం జరిగింది. చేపమందు కోసం లక్షలలో వచ్చే జనం సంఖ్య వేలకు పడిపోయింది. చేపమందుపై కరపత్రాన్ని అందరికీ పంచింది. డాక్టర్లను కలిసి అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రతి సంవత్సరం పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నది.
        ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేస్తూ లక్షలాది కోట్ల రూపాయలను దోస్తున్న మందుల కంపెనీల మాయా జాలాన్ని ''మందులా! మారణాయుధాలా!!'' అని ప్రశ్నించింది జన విజ్ఞాన వేదిక. మార్కెట్లో ఉన్న ఎన్ని మందులు అవసరమో వివరించి చెప్పింది. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో వుండాలని ''ఆరోగ్య దీపం'' కార్యక్రమాలు నిర్వహించింది. ''ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకుందాం - ప్రజారోగ్యాన్ని పరిరక్షించుదాం'' అనే నినాదంతో రాష్ట్రంలోని అనేక సంస్థలతో కలిసి ప్రజారోగ్య ఉద్యమం జన స్వాస్త్య అభియాన్‌ కృషి కొనసాగిస్తున్నది. జె.వి.వి ఆవిర్భావం నాటి నాయకులు, భద్రాచలం పూర్వ ఎంపి డా.మిడియం బాబూరావు ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో గ్రామ సర్వేలు నిర్వహించింది. అందరికీ ఆరోగ్యంపై సంతకాల సేకరణ కార్యక్రమం చేసింది. గిరిజన బాల మేళాల ద్వారా సైన్స్‌ పట్ల అవగాహన కల్పిస్తూ, ఆరోగ్య జాగ్రత్తలు చెప్తూ వారిలో వున్న మూఢనమ్మకాలను పోగొట్టింది.
          ''కూల్‌ డ్రింక్స్‌ కావు అవి కిల్లర్‌ డ్రింక్స్‌'' అని శీతల పానీయాలలో మేలు కన్న కీడు ఎక్కువ వున్నది అని ప్రచారం చేసింది జన విజ్ఞాన వేదిక. కూల్‌ డ్రింక్స్‌లో ఆరోగ్యానికి హానిచేసే పదార్థాలు ఉన్నాయని నిరూపించి వాటిలోని కుళ్ళును బయట పెట్టింది. కూల్‌ డ్రింక్స్‌ పేరుతో బహుళజాతి సంస్థలు వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయని వివరించింది. మజ్జిగ, నిమ్మ నీళ్ళు, పండ్ల రసాల వాడకం వలన శీతల పానీయాల వల్ల జరిగే హాని జరగదని, మన రైతులకు బాసటగా నిలిచి వ్యసాయ రంగానికి మేలు చేయవచ్చని తెలియజెప్పింది. ఆ కృషి ఫలితంగా అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులలో కూల్‌ డ్రింక్స్‌ అమ్మకాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో నెం. 921 ద్వారా నిషేధించింది.
మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయాలని మహారాష్ట్రలో ఉద్యమించిన డా||ధభోల్కర్‌ని మతోన్మాద మూకలు హత్య చేసిన ఆగస్ట్‌ 20వ తేదీని జాతీయ దృక్పథ దినోత్సవంగా జరుపుతోంది. అంతేగాక అన్ని ప్రాంతాలలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51 ఎ(హెచ్‌)కు అనుగుణంగా జాతి మొత్తం శాస్త్రీయ ఆలోచన కలిగివుండాలని కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
         1988 ఫిబ్రవరి 28న జన విజ్ఞాన వేదిక ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం ఈ రోజు జాతీయ సైన్సు దినోత్సవం, జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం జరుపుతూ ప్రజల చెంతకు సైన్స్‌ తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వాలు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ, ప్రజా శ్రేయస్సును గాలికి వదిలేస్తున్న నేటి పరిస్థితుల్లో జన విజ్ఞాన వేదిక బాధ్యత, పని మరింత పెరిగింది. ప్రజలను సమస్యల నుంచి మళ్లించడానికి, ప్రజల్లో హిందూ మతోన్మాద విధానాలను పెంచి పోషిస్తూ అనైక్యతను, అభద్రతా భావాన్ని పెంచి పోషిస్తున్న ఈ తరుణంలో జన విజ్ఞాన వేదిక విస్తరణ, ప్రచారం మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ వైపు కృషి పెంచుదాం. చేయి చేయి కలిపి మన లక్ష్యాల సాధనకు పాటుపడదాం.

/ వ్యాసకర్త:జన విజ్ఞాన వేదిక (ఎ.పి) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సెల్‌:8500004953 /
కెవివి సత్యనారాయణ

కెవివి సత్యనారాయణ