Dec 13,2022 07:28

ఈ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజలకు ప్రాథమిక సేవలను అందజేసే స్కీమ్‌ వర్కర్లను మాత్రం కార్మికులుగా గుర్తించరు. 'వాలంటీర్లు'గానే పరిగణిస్తున్నారు. వీరికి 'గౌరవ వేతనం', 'ప్రోత్సాహకాలు' మాత్రమే చెల్లిస్తున్నారు. 30-35 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత స్కీమ్‌ వర్కర్లను తొలగించి, పింఛను, ఎలాంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు లేకుండా ఇంటికి పంపిస్తున్నారు.

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, పౌష్టికాహారం, విద్య, వైద్యం తదితర సేవలను అందించడంలో స్కీమ్‌ వర్కర్లదే కీలక పాత్ర. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా, సర్వశిక్షా అభియాన్‌, ఐకెపి, కస్తూర్బా, స్వచ్ఛ కార్మిక...తదితర పథకాలలో దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది కార్మికులు పనిచేస్తున్నారు.
         మోడీ ప్రభుత్వం వచ్చాక 2014 సంవత్సరం నుండి పథకాల్లో ప్రాథమిక నిర్మాణ మార్పులు జరిగాయి. బడ్జెట్‌లో కోతలు విధించారు. ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేశారు. మొదటి బడ్జెట్‌ సందర్భంగా ఐసిడిఎస్‌ బడ్జెట్‌లో 55 శాతం, మధ్యాహ్న భోజన బడ్జెట్‌లో 30 శాతం, ఎన్‌హెచ్‌ఎమ్‌ బడ్జెట్‌లో 20 శాతం తగ్గించింది. వేదాంత, పెప్సికో, పతంజలి వంటి కార్పొరేట్లకు, ఇస్కాన్‌ వంటి కార్పొరేట్‌ ఎన్జీవోలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఈ పథకాల ప్రైవేటీకరణ జరుగుతోంది. ఇప్పుడు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ పేరుతో పన్నులు ఎగవేసేందుకు, సడలింపులకు, కార్పొరేట్లు లాభాలు ఆర్జించుకునేందుకు...సంక్షేమ పథకాలు సువర్ణ అవకాశాలుగా మారాయి. కార్పొరేట్లు, బ్యూరోక్రాట్లు, అధికార రాజకీయ పార్టీల నేతల అపవిత్ర బంధంతో ఇదంతా జరుగుతోంది.
          అదే సమయంలో, మోడీ ప్రభుత్వం పథకాల గురించిన ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వివిధ పథకాల పేర్లను మార్చివేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం పేరును పీఎం పోషణ్‌ శక్తి మిషన్‌గా, అంగన్‌వాడీని పోషణ్‌ మిషన్‌గా మార్చింది. కార్పొరేట్‌ సంస్థల ప్రమేయంతో అంగన్‌వాడీ కేంద్రాల పేరును 'నంద్‌ ఘర్‌'గా మార్చింది.
        పథకాలు లబ్ధిదారులకు అందాలంటే ఆధార్‌ లింక్‌ తప్పనిసరి చేసింది. ఎన్‌ఇపి-2020 కింద పాఠశాలలకు 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలను అప్పగిస్తోంది. కార్పొరేట్లు నడిపే కేంద్రీకృత వంటగదులను ప్రవేశ పెట్టడం ద్వారా ఎమ్‌డిఎమ్‌ పథకాన్ని ప్రైవేటీకరిస్తోంది. జాతీయ డిజిటల్‌ మిషన్‌ ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రైవేటీకరిస్తోంది. ఈ చర్యలన్నీ సదరు పథకాలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడే.
         ఈ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజలకు ప్రాథమిక సేవలను అందజేసే స్కీమ్‌ వర్కర్లను మాత్రం కార్మికులుగా గుర్తించరు. 'వాలంటీర్లు'గానే పరిగణిస్తున్నారు. వీరికి 'గౌరవ వేతనం', 'ప్రోత్సాహకాలు' మాత్రమే చెల్లిస్తున్నారు. స్కీమ్‌ వర్కర్లు జీతాలు లేకుండా, తక్కువ వేతనంతో పని చేస్తూ ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలను సబ్సిడీగా ఇస్తున్నారు. 30-35 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో పనిచేసిన తర్వాత స్కీమ్‌ వర్కర్లను తొలగించి, పింఛను, ఎలాంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు లేకుండా ఇంటికి పంపిస్తున్నారు.
వివిధ ప్రభుత్వ పథకాల్లో ఉన్న స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించకుండా... సేవా రంగంలో శ్రమ దోపిడీని అధికారికంగా మార్చారు. ఆశా, అంగన్‌వాడీ, ఎమ్‌డిఎమ్‌ వర్కర్లతో సహా స్కీమ్‌ వర్కర్ల దారుణ శ్రమ దోపిడీ జరుగుతోంది.
           ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆరు నుండి పన్నెండు గంటల పాటు నిర్దేశించిన విధులతో పాటు, స్కీమ్‌ వర్కర్లు (ముఖ్యంగా ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు) వివిధ శాఖల ద్వారా సర్వేలు, వివిధ సేవలను అందించే అదనపు పనులకు కేటాయించారు. ఎమ్‌డిఎమ్‌ స్కీమ్‌లో మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేయడమే కాకుండా పాఠశాలలో స్వీపర్‌, ప్యూన్‌ పని కూడా చేయాలని ఆదేశిస్తున్నారు. వీరికి సెలవులు తరచూ నిరాకరిస్తున్నారు. ఆశా వర్కర్లు, ఎమ్‌డిఎమ్‌ వర్కర్లు ప్రసూతి సెలవులకు కూడా అర్హులు కాదు. ఉద్యోగ భద్రత లేదని, వారిని తొలగిస్తామని బెదిరిస్తున్నారు.
         ఉమ్మడి ట్రేడ్‌ యూనియన్‌ వేదిక ఆధ్వర్యంలో స్కీమ్‌ వర్కర్లు సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న 45వ ఐఎల్‌సి సిఫార్సులు ఉన్నప్పటికీ వారిని క్రమబద్ధీకరించలేదు. కనీస వేతనాలు, సామాజిక భద్రత లేవు. పెన్షన్‌ చెల్లించటం లేదు. వారు ఏ కార్మిక చట్టం పరిధిలోకీ రారు. పైగా, అనేక పోరాటాల ద్వారా సంపాదించుకున్న కనీస వేతనాలు, ఎనిమిది గంటల పనిదినం, సామాజిక భద్రత, సంఘం మరియు సమ్మె హక్కుతో సహా అన్ని హక్కులనూ నాలుగు లేబర్‌ కోడ్‌ల ద్వారా ప్రభుత్వం తొలగిస్తోంది.
 

                                                                             డిమాండ్లు ఇవీ...

  •  లక్షలాది మంది పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక ఆరోగ్యాన్ని అందిస్తున్న ఐసిడిఎస్‌, ఎన్‌హెచ్‌ఎమ్‌, ఎమ్‌డిఎమ్‌ వంటి పథకాలను నాణ్యతతో సార్వత్రీకరించాలి.
  •  తగిన బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి.
  •  స్కీమ్‌ వర్కర్లందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫార్సులను అమలు చేయాలి. వీటి ప్రకారం స్కీమ్‌ కార్మికులకు నెలకు రూ. 26 వేలు కనీస వేతనం, నెలకు రూ. 6 వేలు పెన్షన్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యుటీ మొదలైన అన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేయాలి.
  •  అన్ని రాష్ట్రాల్లోని వివిధ వర్గాల స్కీమ్‌ వర్కర్లకు ఒకే విధమైన సర్వీస్‌ నిబంధనలు ఉండాలి.
  •  పథకాల ప్రైవేటీకరణను ఆపాలి.
  •  ఎన్‌ఇపి-2020, నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డిహెచ్‌ఎమ్‌)ని ఉపసంహరించుకోవాలి.
  •  నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలి.
  •  స్కీమ్‌ వర్కర్లను కార్మిక చట్టాల పరిధిలో చేర్చాలి.

- ఎ.ఆర్‌. సింధు,
సిఐటియు జాతీయ కార్యదర్శి.