Jul 19,2022 06:51

సామ్రాజ్యవాద విధానం కొనసాగడంలో తక్కిన సామ్రాజ్యవాద దేశాల మాదిరిగానే స్కాండినేవియన్‌ దేశాలకు కూడా వారి ప్రయోజనాలు ఇమిడి వున్నాయి. ఇందులో కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయనుకోరాదు. సామ్రాజ్యవాదం కొనసాగుతూన్నంత కాలం ఆ యా పెట్టుబడిదారీ దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థను అది పరిరక్షిస్తూ వుంటుంది. ఇది రాజకీయ ప్రయోజనం. దానితోబాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో మాత్రమే లభించే ముడి సరుకులను ఈ స్కాండినేవియన్‌ దేశాలు కూడా పొందగలగాలంటే, ఇప్పుడున్న సామ్రాజ్యవాద ఆధిపత్యం ప్రపంచ మార్కెట్లపై కొనసాగడం అవసరం. ఆ ఆధిపత్యం గనుక బలహీనపడితే, ఆ ముడిసరుకులు లభించడం కష్టం ఔతుంది.

(డెన్మార్క్‌, నార్వే, స్వీడెన్‌, ఫిన్‌లాండ్‌, ఐస్‌ల్యాండ్‌- ఈ ఐదు దేశాలతోబాటు ఫారో దీవులను కలిపి స్కాండినేవియన్‌ దేశాలు అంటారు. యూరప్‌ ఖండానికి ఉత్తర భాగంలో, ధృవ ప్రాంతానికి దగ్గరలో ఈ దేశాలు ఉంటాయి.)

స్కాండినేవియన్‌ దేశాలలో అమలౌతున్న పెట్టుబడిదారీ విధానం గురించి చాలా పొరపాటు అభిప్రాయాలు చెలామణిలో ఉన్నాయి. స్కాండినేవియన్‌ దేశాలు బలమైన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయని, తమ ఆధీనంలో ఎటువంటి వలస దేశాలూ లేకపోయినా ఈ విధమైన అభివృద్ధిని సాధించగలిగాయని, అందుచేత, పెట్టుబడిదారీ అభివృద్ధి జరగాలంటే సామ్రాజ్యవాదం తప్పనిసరిగా ఉండి తీరాలనే వాదన తప్పు అని ఈ దేశాల అనుభవాలు రుజువు చేస్తున్నాయని ఒక వాదన ఉంది. దశాబ్దాల నుండీ ఈ వాదనను నేను వింటున్నాను. కాని ఇది ఒక పొరపాటు భావన మీద ఆధారపడి చేస్తున్న వాదన. కేవలం స్కాండినేవియా గురించి మాత్రమే కాక, సామ్రాజ్యవాదం గురించి కూడా ఉన్న పొరపాటు అవగాహన నుండి ఈ వాదన వచ్చింది.
    స్కాండినేవియన్‌ దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి సోషల్‌ డెమోక్రసీ బలవంతంగా లాక్కున్న వివిధ రాయితీల గురించి ఎవరైనా చాలా సానుకూలంగా మాట్లాడవచ్చు (ఐతే ప్రస్తుత నయా ఉదారవాద వ్యవస్థలో ఈ రాయితీల కొనసాగింపు ప్రమాదంలో పడింది సుమా). ఐతే, అంతమాత్రం చేత సామ్రాజ్యవాద స్వభావం లేని పెట్టుబడిదారీ వ్యవస్థకు స్కాండినేవియన్‌ దేశాలు ప్రతిబింబం అని ఎవరైనా భావిస్తే వారు పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావాన్ని పొరపాటుగా అర్ధం చేసుకున్నారనే చెప్పాలి. స్కాండినేవియన్‌ దేశాలకు స్వంతంగా వలసలు ఉండివుండక పోవచ్చు. కాని రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, ఆ తర్వాత కూడా ఈ దేశాలు తక్కిన సామ్రాజ్యవాద దేశాల వీపుల మీదకెక్కి కూచుని ప్రయాణం చేశాయి. దానికి సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిద్దాం.
     విజయవంతంగా పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేయగలిగిన ప్రతీ దేశానికీ తనకంటూ స్వంత వలసలు ఉండి తీరాలన్న నియమం ఏదీ లేదు. మొత్తం సామ్రాజ్యవాద వ్యవస్థలో జరిగే పెట్టుబడిదారీ అభివృద్ధి వలన కొన్ని సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ప్రయోజనం పొందుతాయి. అందుకోసం వాటికి స్వంతంగా వలసలు తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఏమీ లేదు. ఉదాహరణకి: బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం ఒక వెలుగు వెలుగుతున్న కాలంలో బ్రిటన్‌ మార్కెట్లలోకి తక్కిన యూరోపియన్‌ దేశాల సరుకులు స్వేచ్ఛగా ప్రవేశించే పరిస్థితి ఉండేది. తక్కిన దేశాల కన్నా బ్రిటన్‌ వలసలను ముందుగా ఆక్రమించుకుంది. ఆ వలసల లోని మార్కెట్లకు కావలసిన సరుకులన్నీ ఉత్పత్తి చేయగలిగినంత శ్రామిక ఉత్పాదకత బ్రిటన్‌ వద్ద లేదు. అందుచేత తక్కిన పారిశ్రామిక దేశాల సరుకులకు బ్రిటన్‌ మార్కెట్‌లో ప్రవేశం లభించింది. అదేవిధంగా వలసదేశాల నుండి తెచ్చిన ముడిసరుకులను వినియోగించుకునే అవకాశం కూడా ఆ యూరోపియన్‌ ఖండం లోని పారిశ్రామిక దేశాలకు లభించింది. అందుకోసం ఆ దేశాలు వేరే స్వంత ఏర్పాట్లు చేసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.
      నిజానికి, సామ్రాజ్యవాద దేశాలలో నాయకత్వ స్థానంలో ఉండే ప్రతీ దేశమూ బ్రిటన్‌ ఆనాడు పోషించిన పాత్ర వంటిదే పోషిస్తుంది. ఆ దేశాల నాయకత్వ పాత్రలో అది ఒక అవశ్యమైన అంతర్భాగం. తమతోబాటు కొత్తగా పారిశ్రామికీకరణ జరిగిన దేశాలకు పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమాన్ని విస్తరింపజేయడానికి అవి అనుమతిస్తాయి. తద్వారా ఆ పారిశ్రామిక దేశాల నుండి తమకు సవాలు ఎదురవకుండా జాగ్రత్త పడతాయి. వాస్తవానికి ఈ నాయకత్వ దేశాలు తక్కిన పారిశ్రామిక దేశాల నుండి వచ్చిపడే సరుకులను తమ మార్కెట్‌లో ఇముడ్చుకుంటాయి. తద్వారా విదేశీ వ్యాపారంలో చెల్లింపుల లోటు తలెత్తకుండా సర్దుబాటు చేసుకోగలుగుతాయి. సామ్రాజ్యవాద దోపిడీ జరిగే తీరు ఇందుకు తోడ్పడుతుంది. యూరోపియన్‌ పారిశ్రామిక దేశాల నుండి వచ్చిన సరుకుల నిమిత్తం చేయవలసిన చెల్లింపులలో లోటు తలెత్తకుండా ఉండేందుకు బ్రిటన్‌ తన వలస దేశాల సంపదను విపరీతంగా కొల్లగొట్టింది. ఆ విధంగా కొల్లగొట్టిన సంపదతో కేవలం విదేశీ చెల్లింపులను సర్దుబాటు చేయడమే గాక, ఆ పారిశ్రామిక దేశాలకు పెట్టుబడిని సైతం అదనంగా ఎగుమతి చేయగలిగింది.
       తర్వాత కాలంలో బ్రిటన్‌ స్థానాన్ని అమెరికా తీసుకుంది. ఐతే బ్రిటన్‌ కి ఉండినట్టు వలసలు అమెరికాకు లేవు. అందుచేత విదేశీ చెల్లింపుల లోటు సమస్య తలెత్తకుండా ఉండడానికి అమెరికా డాలర్లను అదనంగా ముద్రించడం మొదలెట్టింది. బ్రెట్టన్‌ వుడ్‌ వ్యవస్థలో (ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ పెత్తనం కింద నడిచే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ) డాలరు బంగారంతో సమానంగా పరిగణించబడింది (ఒక ఔన్సు బంగారం విలువ 35 డాలర్లు గా స్థిరీకరించబడింది). ఆ తర్వాత కాలంలో ఈ స్థిరీకరణ నిలబడలేదు. కాని ప్రపంచంలో సంపద కలిగివున్న వ్యక్తులు, సంస్థలు ఇప్పటికీ డాలరును బంగారంతో సమానమైనట్టే పరిగణిస్తున్నారు. తమ సంపదను డాలర్ల రూపంలో నిల్వ చేసుకోడానికి వారికి ఎటువంటి సంకోచమూ లేదు.
      తన భుజాలపైకి ఎక్కి స్వారీ చేయమని మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచాన్నంతటినీ నాయకత్వ స్థానంలో ఉన్న సామ్రాజ్యవాద దేశం ఆహ్వానిస్తుంది. కొన్ని సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు తమ తమ స్వంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోడానికి ఈ ఏర్పాటు ఆటంకంగా అనిపించవచ్చు. కాని స్కాండినేవియన్‌ దేశాల వంటి కొన్ని దేశాలకు ఇది ఆ విధంగా అనిపించదు. తమ స్వంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోనవసరం లేకుండానే ఆ సామ్రాజ్యవాద దోపిడీ ఫలాలను అనుభవించగలిగే అవకాశం ఈ ఏర్పాటు కల్పిస్తోంది.
      ఇక్కడ ఇంకో రెండు పాయింట్లు గుర్తుంచుకోవాలి. మొదటిది: కొత్తగా బలపడుతున్న పెట్టుబడిదారీ దేశాలు నాయకత్వ స్థానంలో ఉన్న పెట్టుబడిదారీ దేశపు మార్కెట్‌లో యథేచ్ఛగా ప్రవేశించవచ్చు. అదే సమయంలో తమ తమ దేశాల మార్కెట్లలోకి దిగుమతులు అదే రీతిన ప్రవేశించడానికి వీలు లేకుండా సుంకాలు విధించవచ్చు. ఆ విధమైన ఆంక్షలు నాయకత్వ స్థానంలో ఉన్న దేశపు దిగుమతులపైన కూడా విధించవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో జర్మనీ, అమెరికా తమ దేశాల మార్కెట్లలోకి ప్రవేశించే ఇతర దేశాల దిగుమతులపై సుంకాలు విధించాయి. అదే సమయంలో తాము మాత్రం బ్రిటిష్‌ మార్కెట్‌ లోకి ఏ ఆంక్షలూ లేకుండానే చొరబడగలిగాయి. ఈ అసమాన పొందిక వలనే తమకన్నా ముందు పారిశ్రామికీకరణ జరిగిన బ్రిటన్‌ను పారిశ్రామికాభివృద్ధిలో అందుకోగలిగాయి. యూరప్‌ ఖండంలోని తక్కిన పెట్టుబడిదారీ దేశాలూ ఈ విధంగానే చేశాయి. రెండవది: ఈ దేశాలకు కేవలం బ్రిటిష్‌ మార్కెట్‌ మాత్రమే గాక, బ్రిటన్‌ కు వలసలుగా ఉన్న దేశాల మార్కెట్లూ అందుబాటులోకి వచ్చాయి. కనీసం 1920-1930 వరకూ అటువంటి పరిస్థితి కొనసాగింది.
     రెండు ప్రపంచ యుద్ధాల నడుమ కాలంలో బ్రిటన్‌ తమకు అనుకూలంగా ఉండే సుంకాల విధానాన్ని ప్రవేశపెట్టింది. తమ సామ్రాజ్యం లోపల ఉత్పత్తి అయిన సరుకులతో పోల్చినప్పుడు బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వెలుపల ఉత్పత్తి అయిన సరుకులపై ఎక్కువ దిగుమతి సుంకాన్ని విధించింది. దీనితో అంతవరకూ ఉన్న ఏర్పాటు ఆగిపోయింది. బ్రిటన్‌ కు చెందిన ఆసియా దేశాల మార్కెట్లలో పట్టు సంపాదించాలన్న జపాన్‌ ప్రయత్నాలను అడ్డుకోడానికే ఈ విధానాన్ని మొదట ప్రవేశపెట్టినా, ఆ తర్వాత ''యూరప్‌ సరుకులనే కొనండి'' ప్రచారానికి ఉపయోగించారు. ఏది ఏమైనా, వేరు వేరు సుంకాల పద్ధతి రావడం అంతవరకూ ఉండిన విధానానికి భిన్నం. ''మహా మాంద్యం'' కాలంలో సామ్రాజ్యవాద దేశాల నడుమ పెరిగిన పోటీని ఇది సూచించడమే కాకుండా, ఆ పోటీకి కారణం కూడా అయింది. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం నుండీ ఉండిన పాత ఏర్పాటు జపాన్‌ ఆర్థిక సామ్రాజ్య విస్తరణ యత్నం కారణంగా తాకిడికి లోనైంది. దానిని ఎదుర్కోడానికి బ్రిటన్‌ అనుసరించిన రక్షణ సుంక విధానం జపాన్‌ సైనిక విస్తరణకు దారితీసింది. ఈ పరిణామాలు జరిగే వరకూ బ్రిటిష్‌ వలసల మార్కెట్లు బ్రిటన్‌కే గాక తక్కిన పెట్టుబడిదారీ దేశాల సరుకులకు సైతం అందుబాటులో ఉండేవి.
     స్కాండినేవియన్‌ దేశాలకు స్వంతంగా వలసలు లేకపోవచ్చు. కాని ఆ దేశాలలో పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదం తోడ్పాటు లేకుండా అభివృద్ధి చెందిందని చెప్పడం సరైనది కాదు. ఆ దేశాలలో జరిగిన అభివృద్ధి సామ్రాజ్యవాద దోపిడీ తీరు తెన్నుల సంక్లిష్టతను వెల్లడి చేస్తుంది. ఆ సామ్రాజ్యవాద విధానం కొనసాగడంలో తక్కిన సామ్రాజ్యవాద దేశాల మాదిరిగానే స్కాండినేవియన్‌ దేశాలకు కూడా వారి ప్రయోజనాలు ఇమిడి వున్నాయి. ఇందులో కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయనుకోరాదు. సామ్రాజ్యవాదం కొనసాగుతూన్నంత కాలం ఆ యా పెట్టు బడిదారీ దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థను అది పరిరక్షిస్తూ వుంటుంది. ఇది రాజకీయ ప్రయోజనం. దానితోబాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో మాత్రమే లభించే ముడి సరుకులను ఈ స్కాండినేవియన్‌ దేశాలు కూడా పొందగలగాలంటే, ఇప్పుడున్న సామ్రాజ్యవాద ఆధిపత్యం ప్రపంచ మార్కెట్లపై కొనసాగడం అవసరం. ఆ ఆధిపత్యం గనుక బలహీనపడితే, ఆ ముడిసరుకులు లభించడం కష్టం ఔతుంది.
      ఇటీవల స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాలు నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. వారి సభ్యత్వానికి టర్కీ అభ్యంతరం పెట్టింది. ఆ అభ్యంతరాన్ని అధిగమించడానికి ఈ రెండు దేశాలూ టర్కీతో కూడా ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధపడ్డాయి. టర్కీకి చెందిన కుర్దిష్‌ రాజకీయ శరణార్ధులకు ఈ రెండు దేశాలూ ఆశ్రయం కల్పిస్తున్నందున టర్కీ వాటి నాటో సభ్యత్వం విషయంలో అభ్యంతరం లేవనెత్తింది. ఇప్పుడు స్వీడన్‌, ఫిన్లాండ్‌, కుర్దిష్‌ శరణార్ధులకు కల్పించుతున్న రక్షణను ఉపసంహరించడానికి సిద్ధపడ్డాయి. తద్వారా టర్కీకున్న అభ్యంతరాన్ని అధిగమించి నాటో సభ్యత్వాన్ని పొందవచ్చు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఈ రెండు దేశాల నిర్ణయానికి తక్షణ ప్రేరణ కావచ్చు. కాని వాటి వైఖరిలో మార్పు (నాటో కూటమికి దూరంగా ఉండాలన్నది వాటి గత వైఖరి) పెట్టుబడిదారీ ప్రపంచంలో సంభవిస్తున్న మౌలికమైన మార్పును సూచిస్తోందని లోతుగా పరిశీలిస్తే కనిపిస్తుంది.
       ''రష్యన్‌ విస్తరణ వాదం'' వల్లనే తమ వైఖరిలో ఈ మార్పు వచ్చిందని వాళ్ళు చెప్పుకోవచ్చు. కాని ఈ వాదన నిలవదు. ఒకవేళ రష్యా విస్తరణ వాదంతోటే వ్యవహరిస్తోందని వాదన కోసం అంగీకరించినా, ఆ విస్తరణ ఒకప్పుడు సోవియట్‌ భూభాగంలో ఉన్న ప్రదేశాలకే పరిమితం. స్వీడన్‌ కాని ఫిన్లాండ్‌ కాని ఆ కోవలోకి రావు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో యూరోపియన్‌ సామ్రాజ్యవాదులు 'సోవియట్‌ ప్రమాదం' గురించి గొంతు చించుకుని గోల చేసినప్పుడు కూడా ఈ రెండు దేశాలూ నాటో కూటమికి దూరంగానే ఉంటూవచ్చాయి. ఇప్పుడు ఆ సోవియట్‌ యూనియన్‌ కూలిపోయి, సామ్రాజ్యవాదుల ఆధిపత్యానికి ఏ విధమైన సైద్ధాంతిక సవాలూ లేనప్పుడు ఎందుకు నాటో లో చేరడానికి సిద్ధపడుతున్నాయి ?
     నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఏర్పడిన సంక్షోభం దీర్ఘకాలం కొనసాగుతోంది. దాని తాకిడికి పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదం చితికిపోతోంది. సంక్షోభం సుదీర్ఘకాలం పాటు కొనసాగితే సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ప్రపంచం ఒక మార్పును చవిచూడబోతోంది. ఆ మార్పు జరగడం పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ వ్యవస్థకు అంగీకారం కాదు. ఆ మార్పును ఏ విధంగానైనా ఆపడానికి ఈ దేశాలు ఒక దుందుడుకు వైఖరిని అనుసరిస్తున్నాయి. రష్యా, చైనా ఒక ప్రత్యామ్నాయ ఆధిపత్య కేంద్రంగా ఆవిర్భవించకుండా, తమ ఆధిపత్యం చేజారిపోకుండా చూద్దామని పశ్చిమదేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వైఖరి కారణంగానే అన్ని పశ్చిమదేశాల పెట్టుబడిదారీ వ్యవస్థలూ మున్నెన్నడూ లేనంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. వాటిలో స్కాండినేవియన్‌ దేశాలూ ఒక భాగమే. స్కాండినేవియన్‌ దేశాలలో ఇప్పుడు కనిపించే మార్పు రష్యా ప్రదర్శించే అతి దుందుడుకు విధానం వలన వచ్చినది కాదు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెట్టుబడిదారీ సంక్షోభం అందుకు అసలు కారణం.

(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌