Jan 03,2023 08:00

ప్రపంచ వ్యాప్తంగా జాతి విముక్తి పోరాటాలు జరుగుతున్న రోజులవి. మన దేశం కూడా బ్రిటీష్‌ పరాయి పాలనలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆ కాలంలోనే అనేకమంది సంస్కరణల కోసం ప్రాణాలు అర్పించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయినిగా, సామాజిక వైతాళికురాలిగా...బాలికా విద్య కోసం, బడులు పెట్టడం కోసం సావిత్రీ బాయి ఫూలే చేసిన త్యాగాలు, కనబరచిన పట్టుదల మనందరికీ ఆదర్శనీయం.
            విద్యా వ్యవస్థ పట్ల, విద్య సమాజానికి దారి చూపే తీరు పట్ల ఆమెకు ఎంతో స్పష్టత ఉంది. 1881లో లార్డ్‌ రిప్పన్‌, హంటర్‌ అధ్యక్షతన విద్యాకమిషన్‌ను నియమించేటప్పుడు మాతృభాషలో విద్య అందించాలని, శూద్ర, అతి శూద్ర కులాల వారికి పాఠశాలలు పెట్టాలని, పేదరికం వలన దిగువ కులాల పిల్లలకు 12 సంవత్సరాల వయసు వరకు ఉపకార వేతనం మంజూరు చేయాలని మహర్‌, మాంగ్‌ (గిరిజన తెగ) కులస్థులకు ప్రత్యేక పాఠశాలలు పెట్టాలని ప్రతిపాదనలు పెట్టారు ఫూలే.
           ఆనాటి ప్రజల స్థితిగతులు, అవిద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహలు సావిత్రీబాయిని కదిపేశాయి. వీటిని నిర్మూలించడానికి అవసరమైన చైతన్యం పెరగాలంటే విద్య అందరికి అందుబాటులోకి రావాలని విశ్వసించారామె. బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం మొదలెట్టారు. తద్వారా సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కృషి చేశారు. తన దగ్గర చదువుకున్న పిల్లలు, పెద్దలు స్వేచ్ఛ కోసం స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో విద్యా వ్యాప్తికి చేపట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అక్షరాస్యతను సాధించలేక పోయినా, విద్య బలోపేతానికి ప్రభుత్వమే బాధ్యత పడింది. కాని ప్రస్తుత సమాజంలో ఫూలే ఆశించిన లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు.
             రెండు దశాబ్దాలుగా చేపడుతున్న విద్యా సంస్కరణలు వ్యాపార వర్గాలకు లాభాలు చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఇపి) అమలుతో పాఠశాలల మూత, క్లస్టరైజేషన్‌, మతతత్వ ధోరణులు సిలబస్‌లో జొప్పించడం, విద్యా హక్కు చట్టాలను నిర్వీర్యం చేయడం, రాష్ట్రాల విద్యాహక్కు చట్టాలపై పెత్తనం వంటి వాటికి పూనుకుంటున్నది. నేటి విద్యారంగ సంస్కరణలు బడుగు, బలహీన సామాజిక వర్గాల వారికి మరలా విద్యను దూరం చేసేవిగా ఉన్నాయి. మాతృభాషలో శూద్ర కులాల వారికి పాఠశాలలు పెట్టించిన ఫూలే ఆశయానికి భిన్నంగా నేడు పాఠశాలలు మూసివేస్తున్నారు. వెరసి బాలికలు పెద్ద సంఖ్యలో చదువుకు దూరం అవుతున్నారు.
              అవిద్య, బాల్య వివాహాలపై పోరాటం, సతీ సహగమనం వంటి వాటిపై చైతన్య పరిచి, నిషేధించడం వంటివి సమాజానికి మేలు చేసిన సంఘటనలు. సామాజిక దురాచారాలను తిప్పి కొట్టాలంటే చదువే కీలకమని నిరూపించింది సావిత్రీబాయి ఫూలే. నేడు నూతన రూపాల్లో మతం, కులం, సంప్రదాయాల పేరుతో స్త్రీలపై, బాలికలపై జరుగుతున్న దాడులు చూస్తున్నాం. దుస్తులు, హిజాబ్‌, సంప్రదాయాలు, ఆహారం పరంగా ఆంక్షలను గమనించినట్లయితే ఇవన్నీ సమాజాన్ని మనువాదం లోకి తీసుకెళ్తున్నాయి. మరలా ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్య భారత దేశంలో పునరావృతం అవుతున్నాయంటే స్త్రీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తున్నారనే అర్థం. ఫూలే స్ఫూర్తితో ఇటువంటి విధానాలపై పోరాటాలకు సిద్ధపడాలి.
              సమకాలీన సమాజంలో సామాజిక అంతరాలను పెంచే విధానాలపై కళారూపాల ద్వారా చైతన్యపరచాలని, సాంస్కృతిక, జానపద అంశాలలో మహిళా టీచర్ల జోక్యం పెరగాలని, మూఢ విశ్వాసాలను పారదోలడానికి జానపదాలను ఎంచుకోవాలని, సాంఘిక దురాచారాలపై నిరంతరం పోరాడాలని ఆచరణలో చూపించారు సావిత్రీ బాయి ఫూలే. కాని ప్రస్తుత బిజెపి ప్రభుత్వ విధానాలు పాఠ్యపుస్తకాలలో మతతత్వాన్ని చొప్పిస్తున్నాయి. లౌకిక, రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నాయి.
             బాలికా విద్య కోసం, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు, కుల మత తత్వాలకు వ్యతిరేకంగా సావిత్రీబాయి పోరాడారు. సమాన హక్కులు నినాదంతో అట్టడుగు వర్గాలవారికి బడులు పెట్టి విద్యనందించేందుకు కృషి చేశారు. స్వాతంత్య్రం రాకమునుపు బ్రిటిష్‌ పాలకుల ఎజెండాలో, స్వాతంత్య్రం వచ్చాక మన రాజ్యాంగంలో పైఅంశాలన్నింటికీ చట్టబద్దత కల్పించాలని, సమ సమాజం స్థాపించాలని సావిత్రీ బాయి ఫూలే ఆశించారు. ఆ కృషి ఫలితమే నాటి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బాలికల పాఠశాలలు. కాని నేటికీ విద్యాభివృద్ధికి కుల వ్యవస్థ ఆటంకంగానే ఉంది. కులతత్వాన్ని, మతతత్వాన్ని పెంచి పోషించే విధానాలను ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పటికీ బడుగు వర్గాల పిల్లలు చదువుకి దూరంగా ఉన్నారు. మొత్తం అక్షరాస్యతలో మహిళల అక్షరాస్యత 64 శాతం మాత్రమే. ఇటువంటి గణాంకాలు దేశ అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడవు. విద్యకు దూరంగా ఉండే ప్రాంతాలు, వర్గాల వారు నిరంతరం దోపిడికి గురవుతారని అనేక అంశాలు సూచిస్తున్నాయి. బాల్య వివాహాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఉపాధి, కార్మిక శక్తిలో 34 దేశాలతో పోల్చుకుంటే 24వ స్థానంలో ఉన్నాం. సరికొత్త సమస్యలు విద్యారంగంలో మొదలయ్యాయి. ఈ అవశేషాలను రూపుమాపాలంటే సావిత్రీబాయి సూచించిన సామాజిక ఉద్యమాలను నిర్మించాలి. అది మనందరి కర్తవ్యం.
          స్త్రీలు చదువు నేర్చుకోవడమే అరుదైన కాలంలో బాలికలకు పాఠశాలలో విద్య నేర్పడానికి తన భార్య సావిత్రిని విద్యా వంతురాలిని చేసి దేశానికి తొలి ఉపాధ్యాయురాలిని అందించారు జ్యోతిరావు ఫూలే. విద్యపై, ఉపాధ్యాయులపై, విద్యార్థులపై ఎంతో ప్రభావితం చేయగలిగిన ఆమె స్ఫూర్తిదాయక చరిత్ర మన దేశానికి ఎంతైనా అవసరం. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పెద్దలు ఆమె విగ్రహాలకు పూలమాలలు వేసి సరిపెట్టుకుంటే సరిపోదు. ఆమె ఆశయాలకు కార్యరూపం ఇవ్వవలసిన బాధ్యత చేపట్టాలి. అలాగే ఆమె జయంతి రోజును జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి.

/ వ్యాసకర్త : యు.టి.ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
సెల్‌ : 8985383255 /
కె.విజయగౌరి

కె.విజయగౌరి