
తొలి దశలో దేశభక్తుడిగా నటించినా, తర్వాత కొంత కాలానికే అతని అనైతికత ఈ దేశ ప్రజలకు అర్థమైంది. అంతే కాదు, ఆనాటి బ్రిటిషు ప్రభుత్వానికి ఇంకా బాగా అర్థమైంది. అందుకే జైలు పాలయ్యాడు. బయటికి వచ్చి గాడ్సేను తయారుచేసి, ప్రోత్సహించి, గాంధీ హత్యకు దోహదం చేశాడు. ఇలాంటివాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
వినాయక్ దామోదర్ సావర్కర్ చరిత్ర అంతా చీకటి చరిత్ర. విష చరిత్ర. కుట్రలు కుతంత్రాల చరిత్ర. అతను స్వాతంత్య్ర పోరాటాన్ని అడ్డుకుని, బ్రిటిష్ వారికి సహకరించినవాడు. పైగా సెల్యులార్ జైలులో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎనిమిది సార్లు వినతిపత్రాలు సమర్పించి క్షమాపణలు కోరిన వ్యక్తి. అంతకు ముందు అతను బ్రిటన్‌లో ఉండగా ఒక రేప్ కేసులో దొరికిపోయి, తప్పు ఒప్పుకుని, శిక్ష అనుభవించినవాడు. ఇలాంటి వాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెడతారా? ఆ ఆలోచనే సిగ్గుపడాల్సిందిగా ఉంది. ఆనాటి హిందువుల్ని ముఖ్యంగా ఆర్య బ్రాహ్మణుల్ని ఏకం చేయడానికి ఇతర మతస్థుల మీద, ఇతర కులస్థుల మీద విషం చిమ్మిన వ్యక్తి... సావర్కర్! దేశంలో కేవలం ఆర్య బ్రాహ్మణులు మాత్రమే ఉండాలని తాపత్రయ పడినవాడు. శత్రువులు బ్రిటిష్‌వారు కాదు, అంతర్గత శత్రువులు దేశంలోనే ఉన్నారని ప్రకటించినవాడు. ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనుల వంటి ఇతర మతస్థుల్ని చంపేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చినవాడు. వారి ఇళ్లలోని తల్లులు, భార్యలు, అక్కా చెల్లెళ్ళు...ఎవరైనా సరే గర్భిణులు ఉంటే, వారి పొట్టల్ని చీల్చి, పుట్టబోయే పిల్లల్ని కూడా చంపేయాలని పిలుపునిచ్చిన- 'మహనీయుడు' ఈ విషయాలన్నీ సావర్కర్ పర్సనల్ అసిస్టెంట్ (పి.ఎ.) లిబయ రాస్తే బయటికొచ్చినవే! అందువల్ల సావర్కర్‌ను విమర్శించడం నేరం కాదు, ప్రతి భారతీయుడి హక్కు.
ఏ ప్రభుత్వమూ, ఏ సంస్థా ఇవ్వకపోయినా తనకు తానే 'వీర్' అనే పదం తన పేరుకు ముందు తగిలించుకుని, 'వీర్ సావర్కర్'గా ప్రాచుర్యం పొందిన నీచ ప్రవృత్తి గలవాడు సావర్కర్. తొలి దశలో దేశభక్తుడిగా నటించినా, తర్వాత కొంత కాలానికే అతని అనైతికత ఈ దేశ ప్రజలకు అర్థమైంది. అంతే కాదు, ఆనాటి బ్రిటిషు ప్రభుత్వానికి ఇంకా బాగా అర్థమైంది. అందుకే జైలు పాలయ్యాడు. బయటికి వచ్చి గాడ్సేను తయారుచేసి, ప్రోత్సహించి, గాంధీ హత్యకు దోహదం చేశాడు. ఇలాంటివాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతిపిత స్థానాన్ని ఒక దేశద్రోహికి అంటగట్టాలని చూస్తోంది. అందువల్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ కుతంత్రాల్ని బట్టబయలు చేయాలి. ఆధునిక భారతీయ చరిత్రలో నీచాతిచీచుడుగా మిగిలిపోయినవాడు ఎవరూ? అంటే.. దేశ ప్రజలంతా ఏకకంఠంతో 'సావర్కర్' అని నినదించాల్సిన అవసరం ఉంది. అందుకు అతనికి అన్ని అర్హతలూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ చాలామంది చెప్పినవే. మరీ ముఖ్యంగా ముంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి సావర్కర్ నైతికతను దుయ్యబడుతూ, ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియోలో మాట్లాడారు. ఆనాటి విషయాలు నేటి తరానికి అందించాలన్న తపనకొద్దీ ఆయన మాట్లాడారు. విషయ పరిజ్ఞానం ఉన్న ఆ న్యాయమూర్తి జస్టిస్ కె.పాటిల్‌ను ఈ దేశ ప్రజలు నమ్ముతారు.
నాధూరామ్ గాడ్సే, ఆప్టే, బాడ్గే, శంకర్‌లు 1948 జనవరి 17న చివరిసారి సావర్కర్‌ను దర్శించుకోవడానికి వెళ్ళారు. నాధూరాం, ఆప్టేలు లోపలికి వెళ్ళారు. మిగిలిన ఇద్దరు బయట కాపలా కాశారు. సావర్కర్‌ను కలిసి, నాధూరాం, ఆప్టేలు బయటికి రాగానే - ఆప్టే, బాడ్గేతో ఓ మాట చెప్పాడు. ''యశస్వి హో ఉన్యా'' - విజయుడవై తిరిగి రమ్మని సావర్కర్, నాధూరామ్‌ను దీవించారని - గాంధీకి నూరేళ్లు పూర్తయ్యాయనీ - అనుకున్న ప్రకారం పథకం పూర్తవుతుందని సావర్కర్ ఆశగా ఉన్నాడన్న విషయం - ఆప్టే బయట ఉన్న సహచరులకి చెప్పాడు. గాంధీజీ హత్య కేసులో సరైన ఆధారాలు దొరకక శిక్ష పడలేదు కానీ, ఒకరకంగా సావర్కర్ నిత్య నూతన క్రిమినల్. అతని పేరు ముందు 'వీర్' అని రాయడం, పలకడం పెద్ద తప్పిదం అవుతుంది. ఈ దేశ ప్రజలు సావర్కర్ నుండి ఏం నేర్చుకోవాలీ? ఏ విషయంలో అతను ఆదర్శప్రాయుడవుతాడూ? విశ్లేషించుకుంటున్న ఈ దేశ ప్రజలు, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుల నిర్ణయాల్ని అసహ్యించుకుంటున్నారు. సావర్కర్‌కు వీరు ఇస్తున్న ప్రాముఖ్యాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు.
చంద్రనాథ్ బసు అనే అతను 'హిందూత్వ' అనే పదాన్ని రూపొందిస్తే, దాన్ని విరివిగా వాడుకుని, ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు సావర్కర్. ఒక దశలో సిక్కులు పంజాబ్‌ను సిక్కిస్తాన్‌గా చేసుకోవాలని, అందుకు తను సహకరిస్తాననీ అన్నాడు. పాకిస్తాన్, సిక్కిస్తాన్‌లు విడిపోతే, ఇక హిందూ రాష్ట్ర (హిందూస్థాన్) మిగులుతుందని కలలుగన్నాడు. ఒకనాడు ఒక క్రిమినల్ కన్న కలల్ని నేటి ఈ కేంద్ర ప్రభుత్వం నిజం చేయాలనుకుంటోంది. దేశంలో అదే 'హిందూత్వ' సెంటిమెంట్‌ను విస్తృత ప్రచారంలోకి తెచ్చి... ఎలాగైనా దొడ్డిదారిన మళ్ళీ గెలవాలన్నదే వీరి ప్రయత్నం! ఉపాధి, అభివృద్ధి, ధరల తగ్గింపు వంటి వాటి గురించి వీరు ఏమాత్రమూ మాట్లాడరు. ఆవు మూత్రం, ఆవు పేడల దగ్గర ఆగిపోయిన ఈ దేశనాయకుల మెదళ్ళు-బహుశా వాటితోనే నింపుకున్నారేమో! అందుకే ఇతర అంశాల గూర్చి మాట్లాడలేక పోతున్నారేమో! అని - నేటి యువతరం అనుకుంటూవుంది. ఏమైనా, ఈ దేశ ప్రజలు నాయకులను అనుసరించకుండా, స్వతంత్రంగా ఆలోచించడం అన్ని విధాలా మంచిది.
(వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత,
జీవశాస్త్రవేత్త)
డా|| దేవరాజు మహారాజు