చీరమీను శీతాకాలం ప్రారంభంలోనే దొరుకుతుంది. రుచిలోనూ, ధరలోనూ పులసచేపతో పోటీపడుతుంది. ఎక్కువగా దసరా నుంచి నాగులచవితి వరకు అంటే ఏడాదికి ఇరవై రోజులు మాత్రమే దొరుకుతుంది. వలలో నుంచీ జారిపోయేంత చిన్నగా ఉండటంవలన వీటిని చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపకి చీరమీను అని పేరు. శాస్త్రీయనామం సారిడా గ్రాసిలిస్, టంబిల్, ఆండోస్క్వామిస్. ఈ జాతులకు చెందిన పిల్ల చేపలే ఈ చీరమీను. సముద్రపు నీరూ, గోదావరీ జలాలూ కలిసే బురదనీటి మడుగుల్లో- అంటే మడ అడవులు ఎక్కువగా పెరిగే ఆ నీళ్లలో ఆక్సిజన్ సమద్ధిగా ఉండటంతో ఆ జాతులకు చెందిన చేపలు అక్కడికి వచ్చి గుడ్లు పెడతాయి. సముద్రం మీద తూర్పుగాలులు వీచగానే ఆ బురదనీటిలోని గుడ్లన్నీ పిల్లలుగా మారి ఒక్కసారిగా గోదావరీ జలాల్లోకి ఈదుకొస్తాయి. వాటి రాకను ముందుగా పక్షులు గమనించి, వాటిని తినేందుకు ఆ నీళ్లపై ఎగురుతుంటాయి. యానాం, తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, కోటిపల్లి, ఐ పోలవరం, కాట్రేనికోన ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ఈ చీరమీనుతో సూపర్ మెనూస్ అదుర్స్.. మరి అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
గారెలు
కావలసిన పదార్థాలు : చీరమీను- కేజీ, ఉప్పు - తగినంత, పసుపు- 1/4 స్పూను, కారం-4 స్పూన్లు, ధనియాపొడి-2 స్పూన్లు, జీరా పొడి-స్పూను, అల్లంతరుగు-2 స్పూన్లు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి-3, శనగపిండి-4 స్పూన్లు, వరిపిండి-6 స్పూన్లు, నూనె-డీప్ ఫ్రైకి తగినంత.
తయారీ : పైన పేర్కొన్న అన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకుని, బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని గారెలు మాదిరిగా చేసుకుని, బాండీలో డీప్ ఫ్రై చేసి, ఎర్రగా వేయించుకోవాలి.
టమోటాతో..
కావలసిన పదార్థాలు : చీరమీను - కేజీ, టమోటాలు-4, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-4, అల్లం,వెల్లుల్లి పేస్ట్-టేబుల్ స్పూన్, పసుపు-1/4 స్పూను, నూనె-3 స్పూన్లు, ఉప్పు, కారం - తగినంత, గరం మసాలా -స్పూను.
తయారీ : ముందుగా చేపలను కల్లుప్పు, పసుపు కలిపి మృదువుగా 5, 6 సార్లు కడగాలి. నీరు పూర్తిగా వంపేసి ఉప్పు, కారం, పసుపు కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. బాండీలో నూనె కాగిన తరువాత ఉల్లి తరుగు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి దోరగా వేయించాలి. తరువాత సన్నగా తరిగిన టమోటా ముక్కలను వేసి నాలుగైదు నిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత చేపలను దానిలో వేసి చాలా నెమ్మదిగా చేప చితికి పోకుండా గిన్నెను మాత్రమే తిప్పాలి. చిన్న సెగ మీదే అంచుల వెంబడి నూనె కన్పించేంత వరకూ ఉడికించాలి.
పచ్చి మామిడితో..
కావలసిన పదార్థాలు : చీరమీను - కేజీ, పచ్చి మామిడికాయ తురుము - కప్పు, ఉప్పు-తగినంత, కారం-2 స్పూన్లు, పసుపు-1/4 స్పూను, నూనె-3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-4, అల్లంవెల్లుల్లి పేస్ట్-స్పూను, గసగసాల పేస్ట్-స్పూను, గరం మసాలా-స్పూను, కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తయారీ : శుభ్రంగా కడిగిన చీరమేనును ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. దానికి పసుపు, ఉప్పు, కారం కలిపి పావుగంట పక్కనుంచాలి. బాండీలో నూనె వేడి చేసి ఉల్లి తరుగు, మధ్యకు చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి బంగారువర్ణం వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు గసగసాల పేస్ట్, మామిడికాయ తురుము వేయాలి. కొద్దిగా మగ్గాక, చిన్నగ్లాసు నీరు పోసి ఐదు నిమిషాలు సన్న సెగ మీద ఉడికించాలి. పక్క కలిపి నుంచుకున్న చేపలను వేసి, ఒకసారి బాండీని అటూ ఇటూ కదపాలి. నూనె అంచుల వెంబడి కనిపించేటప్పుడు గరం మసాలా చల్లి నిమిషం పాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత కొత్తిమీర తరుగు చల్లి నెమ్మదిగా ఒకసారి బాండీ కదిపి, దింపేసుకోవాలి.