Nov 07,2023 07:17

         రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల, వసతి గృహాల దుస్థితి స్వయాన హైకోర్టు జోక్యంతో మరో మారు చర్చల్లోకొచ్చింది. వెల్ఫేర్‌ విద్యాలయాల్లో కనీస మాత్రంగానైనా సదుపాయాల్లేక సమస్యలతో కునారిల్లుతున్నాయని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తరచూ ఆందోళన చెందుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. సామాజిక కార్యకర్త ఒకరు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన దరిమిలా హైకోర్టు స్పందించి బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి వసతి గృహంలో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని తూర్పుగోదావరి ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జిని ఆదేశించింది. విచారణ జరిపి హైకోర్టుకు పంపిన నివేదికలో పేర్కొన్న దారుణాలు హైకోర్టునే దిగ్భ్రాంతి కలిగించాయి. నాలుగొందల మంది విద్యార్థులున్న హాస్టల్‌లో రెండంటే రెండే టాయిలెట్లున్నాయి. బెడ్లు లేక పిల్లలు కింద పడుకుంటున్నారు. చలికాలంలో దుప్పట్లూ ఇవ్వలేదు. ఇటువంటి దయనీయ ఉదంతాలెన్నో ఆ నివేదికలో నిక్షిప్తమయ్యాయి. విస్మయం చెందిన న్యాయస్థానం, అసలు స్కూళ్లు, హాస్టళ్లపై సాంఘిక సంక్షేమ శాఖ నియంత్రణ ఉన్నదా అనే అనుమానం వెలిబుచ్చింది. గురుకుల సొసైటీ సభ్యుల పనితీరుపై విచారణకు, నిధుల నిర్వహణపై ఆడిట్‌కు, గోడి గురుకులంలో తక్షణ సదుపాయాలకు, ఉన్నత స్థాయిలో క్రమానుగత తనిఖీలకు ఆదేశాలిచ్చింది.
         సంక్షేమానికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌ తమ ప్రభుత్వమని ముఖ్యమంత్రి, మంత్రులు వల్లె వేయని క్షణం లేదు. సంక్షేమానికి బడ్జెట్‌లో అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్నామని బస్తీమే సవాల్‌ అంటున్నారు. మరి వెల్ఫేర్‌ హాస్టల్స్‌, స్కూల్స్‌ అధ్వాన స్థితిపై ఏం సమాధానం చెబుతారు? సంక్షేమ బడులలో చదువుతున్నది సామాజికంగా వెనకబడ్డ బలహీనవర్గాలు, పేద పిల్లలే. డబ్బున్న మారాజుల పిల్లలు ఎలాగూ కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్లకే వెళతారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి తరగతుల పిల్లలకు దిక్కైన సంక్షేమ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా ఎలా విద్యనభ్యసిస్తారు? ఇదేనా సామాజిక న్యాయం, సాధికారత? అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, ఆంగ్ల మాధ్యమం, జగన్‌ మామ.. ఈ ఆశయాలు వెల్ఫేర్‌ స్కూళ్లను సంక్షోభంలోకి నెడితే సిద్ధిస్తాయా? ప్రస్తుతం అధికార వైసిపి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తోంది. వెల్ఫేర్‌ హాస్టళ్లను గాలికొదిలేశాక సామాజిక సాధికారత ఏ రకంగా నెలకొంటుందో ప్రభుత్వం శెలవిస్తే బాగుంటుంది.
            నవరత్నాల్లో కొన్ని పథకాలకు నగదు బదిలీలు చేసి, అదే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, పేదల సంక్షేమం అనడం ప్రభుత్వ పాక్షిక దృష్టికోణం. సమాజంలో అన్ని విధాలుగా వివక్షకు గురవుతున్న తరగతుల వారు అభ్యున్నతి చెందాలంటే వారి విద్యకు తొలి ప్రాధాన్యమివ్వాలని యావత్‌ ప్రపంచం ఘోషిస్తోంది. సకల సౌకర్యాలతో వెల్ఫేర్‌ స్కూళ్లు ఏర్పాటు చేసినప్పుడే విద్య సాధ్యమవుతుంది. పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్‌ ఛార్జీలు ఇవ్వకుండా, పాలు, కూరగాయలు, గ్యాస్‌ సరఫరా చేసే వెండర్లకు బిల్లులు బకాయిలు పేరబెట్టి, చివరికి మరుగుదొడ్లు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులకు జీతాలివ్వకుండా వెల్ఫేర్‌ స్కూళ్లల్లో చదువుకునే పిల్లలు ఐఎఎస్‌లు, ఇంజనీర్లు, సైంటిస్టులు కావాలని కోరుకోవడం ఆయా తరగతులను వంచించడమే అవుతుంది. మిణుకు మిణుకుమనే లైట్లు, , విరిగి పడే శ్లాబులు, రెక్కలు విరిగిన ఫ్యాన్లు, బయటికి వేలాడే వైర్లు, డోర్లు లేని మరుగుదొడ్లు, మూలనపడ్డ ఆర్‌ఒ ప్లాంట్లు, తుప్పుపట్టిన ట్రంకు పెట్టెలు, ప్రహరీ గోడల్లేని భవనాలు.. ఇదీ రాష్ట్రంలో అత్యధిక సంక్షేమ స్కూల్స్‌, హాస్టల్స్‌ దుస్థితి. హైకోర్టు మొట్టికాయలతోనైనా సంక్షేమ పాఠశాలల స్థితిగతుల మెరుగుదలకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అప్పటికి వేడి చల్లార్చేందుకు ఏవో ఒకటీ అరా స్కూళ్లల్లో పైపై ఉపశమన చర్యలకు పరిమితం అయితే ప్రభుత్వంపై ప్రజల్లో, సామాజిక తరగతుల్లో నమ్మకం పోతుంది. సర్కారు ఇప్పటికైనా మేల్కోవాలి.