Jan 15,2023 09:38

''సందళ్లే.. సందళ్లే.. సంక్రాంతి సందళ్లే.. 
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్లే..
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా!
మన వారితో కలిసుండడం ఒక వరమేరా!!
నన్ను మరవని చూపులెన్నెన్నో..
నన్ను నడిపిన దారులెన్నెన్నో..
నన్ను మలచిన ఊరు.. ఎన్నెన్నో గురుతులనిచ్చినదే !
సందళ్లే.. సందళ్లే.. సంక్రాంతి సందళ్లే..
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్లే..''
అంటూ సాగే 'శ్రీకారం' చిత్రంలోని పాట ప్రతి ఒక్కరికీ పుట్టి పెరిగిన ఊరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. అందుకే ఏడాదిలో ఒక్కసారైనా సొంతూళ్లకు పయనమవుతారు. అదీ సంక్రాంతి సమయంలో అస్సలు మిస్‌ కారు. ఎందుకంటే పల్లెల్లో అసలైన సందడంతా సంక్రాంతి సమయంలోనే ఉంటుంది. ఓ వైపు అప్పుడే కల్లాల్లోనించి ఇళ్లకు చేరిన ధాన్యపు రాశులు. ఇళ్ల ముందు ముత్యాల ముగ్గులు, వాటి మధ్యలో ముచ్చటగొలిపే గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, పిండివంటల ఘుమఘుమలు, పట్టణాల నుంచి ఇళ్లకు చేరిన పిల్లలు, బంధుమిత్రులతో సందడి సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఆరునెలల పాటు తీరిక లేకుండా వ్యవసాయ పనులు చేసి, అలసిపోయి ఉంటారు. వాటి నుంచి కాస్తంత విరామం తీసుకుని, ఆ అలసటలను సంక్రాంతి సంబరాల ద్వారా తీర్చుకుంటారు. అయితే ఈ పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. యావత్‌ భారత్‌లో ఇప్పటికే సంక్రాంతి సందడి మొదలైంది. మరి వీటితోపాటు మన తెలుగు రాష్ట్రాల్లో పండగ ఉత్సాహం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..

Sankranti-all-over-town

కర సంక్రాంతిని పంటకోతలు, పంట నూర్పిడుల పండగగానూ పిలుస్తారు. ఎందుకంటే ఈ సమయానికల్లా పంట నూర్పిడులు అయిపోయి, ప్రజలు పెద్ద ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున, పంటలలో వారికి సహాయపడిన వారికి కృతజ్ఞత తెలుపుతారు. పంటలలో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అందువల్ల పండగ తరువాతి రోజు వాటి కోసమే పండగ చేసుకుంటారు. అదే 'కనుమ' పండగ. మొదటిరోజు భూమికి పిల్లలకు, రెండో రోజు మనకు, మూడోరోజు పాడిపశువులకు. ఇక్కడ పశువులను మనకంటే ఉన్నత స్థాయిలో ఉంచారు. ఎందుకంటే వాటివల్లే మనం జీవిస్తూ ఉన్నాం. మన వల్ల అవి జీవిస్తూ లేవు. మనం లేకపోతే అవన్నీ స్వతంత్రంగా, సంతోషంగా ఉంటాయి. కానీ అవి లేకపోతే మనమే జీవించలేము. ఓరకంగా ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండగల్లో సంక్రాంతి ఒకటి. అందుకే పండగలన్నింటిలోకీ దీనికి అధిక ప్రాధాన్యముంది.
         అయితే పండగలనేవి మన వర్తమాన, భవిష్యత్తులను స్పృహతో మలచుకోవాలి అనే దాన్ని గుర్తుచేస్తాయి. ఇప్పుడు మనం గత సంవత్సరపు పంటను కోసుకున్నాం. తరువాత పంటను సృష్టించడానికి కావాల్సిన ప్రణాళికను స్పృహతో, పశువులను కూడా పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేయాలి. అందువల్ల ఈ మకర సంక్రాంతి పండగ 'పంటల పండగ' అయ్యింది.
         రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి, గరిసెలు నిండుతాయి. చేతికొచ్చిన కొత్త ధాన్యంలో పాలు కలిపి వండిన అన్నంతో ఈ పండగను ప్రారంభిస్తారు. అంతేకాదు ఈ సంక్రాంతికి తెలుగు వారందరూ కొత్త బియ్యంతో పిండి వంటలు చేసుకుంటారు. ఇంటిల్లిపాది ఒకచోట చేరి, ఈ పండగ జరుపుకుంటారు. అందుకే ఇది పెద్ద పండగ అయ్యింది. ముచ్చటగా మూడురోజులు జరుపుకునే ఈ పండగ. తెలుగు లోగిళ్లలో ఆనంద హేల లాంటిది. దేశవ్యాప్తంగానూ ఈ పండగకు ప్రాధాన్యత ఉంది. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులూ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనే పదం 'సంక్రమణము' అనే మూలం నుంచి పుట్టింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే దీన్ని రైతుల పండగగానూ దీన్ని అభివర్ణిస్తారు.
 

                                                             ఊరంతా కలిసి చేసుకునేది..

మన దేశం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతం. అందుకే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా చెబుతారు. మరీ ముఖ్యంగా ఈ రంగం ఒక వ్యక్తితో నడిచేది కాదు. వ్యవసాయం ఒక సామూహిక వ్యవహారం. దేశంలో అత్యధిక జనాభా వ్యవసాయ ఆధారిత పనులపైనే జీవిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి వ్యవసాయ పనులే ఉపాధి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి రావడం.. దీనికి సంబంధించిన శ్రమ ఫలితాన్ని ఆస్వాదించడం.. ఆ ఆనందాన్ని అన్ని వర్గాల ప్రజలు కలిసి దేశమంతా సంక్రాంతిని జరుపుకుంటారు.
 

                                                                తీగల్లా అల్లుకుపోవాలి..

ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.
 

                                               వ్యామోహాన్ని బుగ్గిచేయడం.. భోగిమంటలు..

మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోర్కెలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాత చెత్తను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. కాబట్టి వ్యామోహాలకు, వినిమయదారీ సంస్కృతికి దూరంగా ఉండమంటుంది భోగిమంట. అందుకే భోగిమంటల కోసం కేవలం పాడైన చెక్క సామాన్లు, దుంగలతోనే మంటల్ని వేస్తారు.

Sankranti-all-over-town


                                                                దారంలాంటిది జీవితం..

ప్రతి మనిషికీ మనోనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపు లేకుండా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెంటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైనా ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి, గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే పిల్లలకు మహా సరదా. ఎక్కువ శాతం పిల్లలంతా అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ల ఊళ్లకి వెళ్లి సరదాగా గడుపుతారు. పట్టణాల్లో ఉన్న వారంతా పల్లెలకు చేరుకుంటారు. నిత్యం పుస్తకాలు, ఆన్‌లైన్‌ క్లాసులతో కుస్తీ పట్టి, అలసిసొలసిన పసి హృదయాలు గాలి పటాలను ఎగురవేసి ఆనందిస్తారు. రంగు రంగుల గాలి పటాలను పోటాపోటీగా ఎగరేస్తూ కేరింతలు కొడతారు.
 

                                                            జూదంలా మార్చుకున్నారు..

పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మారుస్తున్నాం. నేడు జరుగుతున్న కోడిపందాలే అందుకు నిదర్శనం. కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు, కోడిపందేలకు తరగని చరిత్ర ఉంది. కానీ ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి, ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు పెట్టి జూదంలా మార్చేశారు.
 

                                                                  శ్రమకు కృతజ్ఞతగా..

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటికి కృతజ్ఞత చెప్పుకోవాలనే ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే 'కనుమ రోజు కాకైనా కదలదు' అంటారు. అందుకే రైతులు కాటిరావల పండగను ప్రత్యేకంగా చేస్తారు. పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు జాజు పూసి అందంగా అలంకరిస్తారు.

Sankranti-all-over-town

                                                                  డూ.. డూ.. బసవన్న

తెల్లవారక ముందే చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. గంగిరెద్దులను ఆడించేవారు 'డూ..డూ...బసవన్న' అంటూ ఇంటి ముంగిళ్లలో.. 'అయ్యవారికి దండం పెట్టు..అమ్మ గారికి దండం పెట్టు!!' అంటూ వారి కులవృత్తులను ప్రదర్శిస్తారు. డోలు తిప్పుతూ, సన్నాయి పాటలతో గంగిరెద్దుల నృత్యాలతో ఇల్లిల్లూ తిరుగుతారు. ఇంటి యజమాని నిద్ర లేచే వరకూ తన డోలు (గంట) తో శబ్ధం చేస్తూనే ఉంటారు.
 

                                                                   హరిదాసు కీర్తనలు..

హరిదాసుల కీర్తనలతో పల్లెలన్నీ మార్మోగుతాయి. 'హరిలో రంగ హరి..!' అంటూ హరిదాసులు గ్రామాల్లో దర్శనమిస్తారు. హరిదాసు వేషధారణ సైతం చూడముచ్చటగా ఉంటుంది. నడినెత్తిపై చెంబు, తిరుమని పట్టెలతో, కంచు గజ్జెలు కట్టుకుని గల్లు గల్లుమని శబ్ధం చేస్తూ ఇళ్ల వద్దకు వస్తారు. చిడతలు కొడుతూ కీర్తనలు పాడుతారు.

Sankranti-all-over-town

                                                         ఆటల పోటీలకు ప్రసిద్ధి..

సంక్రాంతి అనగానే పిల్లలకు, యువకులకు ముందుగా గుర్తొచ్చేది ఆటల పోటీలు.. యువత చెడుమార్గాలు పట్టకుండా ఉండేందుకు, మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఆటలు దోహదపడతాయి. జూదం, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆకర్షితులవ్వకుండా, యువతను సన్మార్గంలో నడిపించాలనే సదుద్దేశంతో గ్రామాల్లో సంక్రాంతి క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తుంటారు.
 

                                                               వెండితెర సందడి..

సంక్రాంతి సీజన్‌ వస్తుందంటే సినిమాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్‌ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకూ సినిమాలను రిలీజ్‌ చేయడానికి అదే సరైన సమయం అని చాలామంది దర్శక నిర్మాతలు నమ్ముతారు. అందుకే ముందుగానే తేదీలనూ ప్రకటిస్తుంటారు. ప్రతిసారిలానే ఈసారీ బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ నెలకొంది. తెలుగులో అగ్ర తారలైన చిరంజీవి, బాలకృష్ణతో పాటు తమిళ స్టార్‌ హీరోలైన అజిత్‌, విజరు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. అన్నిటికంటే ముందు అజిత్‌ 'తునివు' 11న విడుదలైంది. 1987లో జరిగిన లూథియానా బ్యాంక్‌ దోపిడీ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇక ఇళయదళపతి విజరు ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'వారసుడు'. తమిళంలో 'వారిసు' పేరుతో తెరకెక్కుతుంది. దీంతో పాటు బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' 12న విడుదలైంది. ఇక చివరగా చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య'. విశేషం ఏమిటంటే బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న ఈ రెండు సినిమాలు ఒకే ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి రావడం, కేవలం ఒకరోజు వ్యవధితోనే ప్రేక్షకులను అలరించడం.. 14న చిన్న చిత్రమైన 'విద్యా వాసుల అహం' సంక్రాంతి సినిమా పోటీలో నిలిచింది.

Sankranti-all-over-town

                                                                   మూడు రోజులు..

సంక్రాంతిని మూడు రోజుల పాటు భోగి, మకర సంక్రాంతి, కనుమగా చేసుకుంటారు.
1. మొదటి రోజు (భోగి) : భోగి అనే పదం భుజ్‌ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఆ రోజున తెల్లవారు జామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చేయటమే భోగి ప్రధానోద్దేశం.. దీంతోపాటు సంక్రాంతిలో నెల రోజుల పాటు చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి, భోగి మంటల్లో వేస్తారు.
2. రెండో రోజు (మకర సంక్రాంతి) : క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం. సంక్రాంతి అంటే ఉద్యమం అని కూడా అర్థం వస్తుంది. అయితే శీతాకాలం నుంచి వసంతకాలానికి పరివర్తనను కూడా సూచిస్తుంది. చెట్లు, పొదలు వికసించడం ప్రారంభిస్తాయి. ఇక ఈ రోజు గాలిపటాలు ఎగుర వేయటం, యువకులకు, పిల్లలకు, ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం వంటివి చేస్తారు.
3. మూడో రోజు (కనుమ) : ఇది సంక్రాంతి చివరి రోజు, నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున తమకు సంవత్సరం పొడవునా పనుల్లోనూ, కుటుంబ పోషణకు శ్రమలోనూ, ఆర్థికంగానూ తోడ్పాటును అందించిన పశువులను అందంగా అలంకరించి, పూజిస్తారు. ఎడ్లపందాలు కూడా అక్కడక్కడా జరపడం ఆనవాయితీ.

Sankranti-all-over-town

                                                        ముగ్గులు కళాత్మక సంస్కృతి..

సంక్రాంతి నెలలో ఇంటి ముందు లోగిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. గంటసేపు ట్రెడ్‌మిల్‌ మీద వ్యాయామం చేసిన శ్రమకు ఇది సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. మహిళలకు ఇదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే సృజనాత్మక కళా సంస్కృతి. అదే సందర్భంలో ప్రకృతిలోని తోటి జీవుల పట్ల సానుభూతి తెలియజేస్తుంది. అందుకే వాటికి ఆహారంగా ఉపయోగపడేలా బియ్యపు పిండితోనే ముగ్గులేస్తారు. దీనికోసం ఇంట్లోని సూక్ష్మక్రిములు, చీమలు, బొద్దింకలన్నీ లోగిళ్లలోకి వచ్చి చేరతాయి. తద్వారా ఇల్లు శుభ్రపడుతుంది.

Sankranti-all-over-town


                                                               ఇంటింటా పిండి వంటలు..

పండగకు వారం రోజుల ముందు నుంచి పిండి వంటలు తయారుచేస్తారు. ఈ పండగకు ఆంధ్రప్రదేశ్‌లో అరిసెలు, బూందీ మిఠాయి, లడ్డూలు, చక్రాలు చేస్తారు. తెలంగాణాలో సకినాలు స్పెషల్‌. బియ్యం, పిండి, వాము, ఉప్పుతో కలిపి సకినాలు తయారుచేస్తారు. ఇక పండగ రోజు పొంగలి, గారెలు చేసుకుంటారు. కనుమ రోజు మాంసాహార ప్రియులకు అసలైన పండగ. ఈ రోజు ఎంతో ఇష్టంగా నాటుకోడి వంటలు చేసుకొని తింటారు. కొత్త అల్లుళ్ల్లు, బంధుమిత్రుల కలయికతో పండగను సరదాగా గడుపుతారు.
 

                                                             బదరీఫలం.. భోగిపండు..

సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది. కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. భోగిపండ్లు అంటే ఈ కాలంలో విరివిగా వచ్చే రేగుపండ్లే. వీటిల్లో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్‌) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కానీ సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనేవారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

Sankranti-all-over-town

                                                            ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా...

మనదేశం గురించి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా సంస్కృతులు, సంప్రదాయాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మకర సంక్రాంతిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు.. విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ పండగను అన్ని రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మలేషియా, సింగపూర్‌ వంటి ఇతర దేశాల్లోనూ దీనిని జరుపుకుంటారు.

Sankranti-all-over-town


           ఆంధ్రప్రదేశ్‌లో దీనిని పెద్ద పండగ అంటారు. ఇక తెలంగాణలో మకర సంక్రాంతిగా, హిమాచల్‌ప్రదేశ్‌లో మాఘీ సాజీ/ మఘ రా సాజా అని పిలుస్తారు. ఇక గుజరాత్‌లో ఉత్తరాయణం అంటారు. ఈ రోజు గాలిపటాలు ఎగరేస్తారు. వివిధ దేశాల ప్రజలు గాలిపటాలు ఎగరేయడంలో పాల్గొంటారు. ఇక అసోంలో కూడా భోగి మంటలు వేసే సంస్కృతి ఉంది. కొన్ని సంఘాలు ఈ మంటల చుట్టూ ఒక సమూహంగా ఆహారం వండుకుని తింటాయి. హర్యానా, పంజాబ్‌లో మాఘీగా పిలుస్తారు. రాష్ట్ర ప్రామాణిక నృత్య రూపమైన భాంగ్రాను ప్రదర్శిస్తారు. రాజస్థాన్‌లో గాలిపటాల పండగను నిర్వహిస్తుంది. సంక్రాంతి భోజ్‌ అనేది ప్రత్యేక భోజనం, ఇందులో వివిధ రకాల స్వీట్లు, సావరీస్‌ ఉంటాయి. ఉత్తరాఖండ్‌లో ఉత్తరాయణి మేళా. ఇక తమిళనాడులో పొంగల్‌, కర్ణాటకలో సుగ్గి, మహారాష్ట్ర, ఒడిశాలో మకర సంక్రాంతి, కేరళలో మకరవిళక్కు, పశ్చిమ బెంగాల్‌, త్రిపురలో పౌష్‌ సంక్రాంతి, ఉత్తరప్రదేశ్‌లో కీచేరి, బీహార్‌లో దహీ చురా/ టిల్‌ సక్రాత్‌గా జరుపుకుంటారు. అయితే పేరుకు తగ్గట్టే అక్కడి పండగ పద్ధతుల్లోనూ మార్పులు ఉంటాయి. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇది రైతులు పెద్దఎత్తున జరుపుకునే పండగ.

ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815