Mar 08,2023 07:50

             సరైన ప్రోత్సాహం, దృఢమైన సంకల్పం ఉంటే...మహిళలు సాధించలేనిదేమీ లేదని నిరూపించిన అతి కొద్దిమంది దిగ్గజ క్రీడాకారిణుల్లో ఒకరిగా 36 ఏళ్ల సానియా మీర్జా చరిత్రను పునర్లిఖించింది. తన కెరీర్‌ ఎక్కడ మొదలుపెట్టిందో... అదే ఎల్‌బి స్టేడియంలో చివరి మ్యాచ్‌ ఆడేసిన ఈ భారత టెన్నిస్‌ సూపర్‌స్టార్‌ ఘనంగా తన కెరీర్‌కు వీడ్కోలు పలికింది. మహిళలు ఎదుర్కొనే ఆటుపోట్లతోపాటు మత కట్టుబాట్లను సైతం దాటి దేశానికి గర్వకారణంగా నిలిచి... ఓ పోరాట యోధురాలిగా తన ప్రస్థానాన్ని సాగించి.... యువ మహిళా క్రీడాకారులతోపాటు ఎందరికో ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రెండు దశాబ్దాల ఆమె క్రీడా జీవితాన్ని పరిశీలిస్తే... మూడు డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, మరో మూడు మిక్స్‌డ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, 43 డబుల్స్‌ ట్రోఫీలు, 91 వారాలపాటు డబుల్స్‌లో నంబర్‌వన్‌గా నిలవడం లాంటి ఎన్నో ఘనతలు సాధించింది. అంతేకాదు...తన ఆటతోపాటు మాటతోనూ... చేతలతోనూ తాను ఎంత ప్రత్యేకమో నిరూపించుకుని... క్రీడల్లో అడుగుపెట్టాలనుకునే అమ్మాయిలందరికీ ఓ స్ఫూర్తిప్రదాతగా.. సూపర్‌ స్టార్‌గా... నిలిచింది.
             అమ్మాయిలు ఆటల్లో ప్రవేశించాలి... రాణించాలి... అన్న ఓ తండ్రి పట్టుదల సానియా మీర్జా విజయంలో కీలకపాత్ర. టెన్నిస్‌లాంటి ఖరీదైన, వ్యక్తిగత క్రీడలోకి తండ్రి ఇమ్రాన్‌మీర్జా ప్రోత్సాహంతో ఆరో ఏటే అడుగుపెట్టింది సానియా...11 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఓ కోర్టులో సాధన చేయిస్తుండగా... 'ఇలాంటి పొట్టి దుస్తులతో టెన్నిస్‌ అవసరమా?' అంటున్న మాటలు ఈటెల్లా తగులుతూనే ఉన్నాయి ఆ తండ్రికి. మరో మిత్రుడు వచ్చి 'ఏంటి సానియాను మార్టినా హింగిస్‌ చేద్దామనుకుంటున్నావా' అంటూ ఓ కామెంట్‌ చేసి వెళ్లిపోయాడు. తర్వాతి రోజుల్లో మార్టినా హింగిస్‌తోనే నంబర్‌వన్‌ జోడీగా నిలవడంతోపాటు 14 డబుల్స్‌ టైటిల్స్‌ సాధించి తానెంత ప్రత్యేకమో సానియా నిరూపించుకుంది. ఎన్ని వ్యాఖ్యలెదురైనా చిన్నారి సానియాను తన శిక్షణలోనే రాటుదేల్చాడు ఇమ్రాన్‌ మీర్జా. టోర్నీలు గెలిచాకా... ప్రోత్సాహకాలు అందజేయడం, ముందుగానే ఔత్సాహిక క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి తగు విధంగా ప్రోత్సాహాన్నిస్తే మట్టి నుంచి మాణిక్యాలు తీయొచ్చు. ఆ దూరదృష్టి ప్రభుత్వాలకు కొరవడింది. మొదట్లో సానియా కుటుంబానికి దేశవ్యాప్తంగా టోర్నీలకు విమానాల్లో వెళ్లే స్తోమత లేక పాతకారులోనే వందల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసింది. 13 ఏళ్ల వయసులో జాతీయ అండర్‌ -14, అండర్‌-16 టైటిల్స్‌ గెలిచి తొలిసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎల్‌బి స్టేడియంలో తొలిసారి సీనియర్‌ స్థాయి టోర్నీ హైదరాబాద్‌ ఓపెన్‌లో సింగిల్స్‌ విభాగం నుంచి పోటీపడి తొలిరౌండ్లోనే పరాజయం పాలైనా... రెండేళ్ల తరువాత అదే టోర్నమెంట్‌ విజేతగా తన ముద్రను బలంగా చాటింది. ఈ క్రమంలోనే గ్రాండ్‌స్లామ్స్‌లో పోటీపడుతూ 2007 ఆగస్టులో సింగిల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరుకుని, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఆ తరువాత సింగిల్స్‌ నుంచి డబుల్స్‌ విభాగానికి మారి, టెన్నిస్‌ ప్లేయర్లు కలలుగనే గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీని డబుల్స్‌ విభాగంలో మూడుసార్లు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మరో మూడుసార్లు సాధించి తన సత్తా చాటింది.
          టెన్నిస్‌ ప్రపంచంలో అసమాన విజయాలను అందుకున్న ఈ సూపర్‌ స్టార్‌...ఎన్నో వివాదాలనూ, విమర్శలనూ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది. స్కర్ట్‌ వేసుకుని ఆడటంపై మతపెద్దల ఫత్వా, మసీదులో షూటింగ్‌లో పాల్గొనడం, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో వివాహం... వంటి వాటిని కొందరు వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించినా, ధైర్యంగా ఎదుర్కొంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ సందర్భంలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనతో సానియాను ఆడిస్తేనే విష్ణుతో కలిసి డబుల్స్‌ ఆడతానని పేస్‌ చెప్పడంపై ఘాటుగా స్పందించింది. పురుషాధిక్యతకు నిదర్శనంగా పేర్కొంటూ, ఒక ఆటగాడి కోసం తనను ఎరగా వేశారని జాతీయ టెన్నిస్‌ సమాఖ్యపై మండిపడింది. ఇలా... తనదైన శైలిలో టెన్నిస్‌ క్రీడాయవనికపై ముద్రవేసిన సానియా కెరీర్‌కు స్వస్తి పలికినా... ఎందరో సానియాలను తీర్చిదిద్దుతానని చేసిన ప్రకటన భారత టెన్నిస్‌కు సరికొత్త తారలను తీసుకురావాలని ఆశిద్దాం. సరైన సామర్ధ్యం ఉండి, ఆటాడే వసతులు లేక, ప్రోత్సాహం, డబ్బు లేక మరుగునపడిన ఆణిముత్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వాలు నడుంబిగిస్తే... సరైన ప్రోత్సాహాన్నిస్తే... ఎందరో సానియాలను సృష్టించొచ్చు.