May 31,2023 07:53

          కొట్టవద్దు తిట్టవద్దు, పొమ్మనకుండా పొగబెట్టు...ఎలా దారికి రారో చూద్దాం...అన్నట్లుగా ఆర్థిక ఆంక్షలను ఆయుధాలుగా చేసుకొని అమెరికా, పశ్చిమ దేశాలు, సామ్రాజ్యవాదులు, వాటి తొత్తులు అనేక దేశాల మీద దాడులు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి బాగా పెరిగాయి. వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక మరియు విధాన పరిశోధనా కేంద్రం (సిఇపిఆర్‌) ''ఆర్థిక ఆంక్షల మానవీయ పర్యవసానాలు'' అనే శీర్షికతో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం వంటి పెద్ద కబుర్లు చెప్పే పశ్చిమ దేశాల దుర్మార్గాన్ని అది ఎండగట్టింది. ఆంక్షలలో రెండు రకాలు, ఐరాస విధించేవి ఒక తరగతి. ఇవి స్వంత పౌరుల పట్ల లేదా ఇతర దేశాల మీద కాలు దువ్వే పాలకులను దారికి తెచ్చేందుకు సమిష్టిగా విధించేవి. ఐరాసతో నిమిత్తం లేకుండా కర్ర ఉన్న వాడితే గొర్రె అన్నట్లుగా తమకు లొంగని దేశాలు, సంస్థలు, వ్యక్తుల మీద ఏకపక్షంగా అమెరికా, దాని మిత్ర దేశాలు విధించేవి రెండవ కోవకు చెందినవి. కేవలం కమ్యూనిస్టులుగా ఉన్నందుకు, ప్రపంచమంతటా కమ్యూనిజాన్ని అరికట్టే మొనగాడిగా ఉన్న తమకు కూతవేటు దూరంలోనే ఒక సోషలిస్టు దేశం ఉనికి లోకి రావటాన్ని సహించలేని అహంతో అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అమానవీయ ఆంక్షలను క్యూబా మీద అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. 1992 నుంచీ ప్రతి ఏటా 2020లో కరోనా కారణంగా తప్ప వాటిని ఖండిస్తూ ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం పెట్టటం దాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం, అమెరికా వత్తిడిని తట్టుకోలేక కొన్ని దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం తప్ప మిగిలిన దేశాలన్నీ ఖండించినా అమెరికా ఖాతరు చేయటం లేదు.
       ఐరాస విధించేవి తప్ప భద్రతా మండలి అనుమతి లేని మిగిలిన ఆంక్షలన్నీ చట్టవిరుద్ధమైనవే. దేశమంటే మట్టి కాదు, మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ ప్రకారం అనేక దేశాలను అనేకంటే అక్కడి పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ దుర్మార్గాలను నిరోధించే సత్తా ఐరాసకు లేదు. 1960 దశకం నాటికి ప్రపంచంలోని నాలుగు శాతం దేశాలు ఐరాస, అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలకు గురికాగా ప్రస్తుతం 54 దేశాలు లేదా 27 శాతానికి చేరాయి. వీటి జిడిపి నాలుగు నుంచి 29 శాతానికి పెరిగింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇటీవలి పరిణామాలను చూస్తే బరాక్‌ ఒబామా ఏలుబడిలో సంస్థలు లేదా వ్యక్తుల మీద ఏడాదికి 544 కొత్త ఆంక్షలు విధిస్తే అవి ట్రంప్‌ కాలంలో 975, వర్తమాన జో బైడెన్‌ ఇప్పటి వరకు సగటున 1,151గా ఉన్నాయి. దీర్ఘకాలంగా అమల్లో ఉన్నవాటిలో క్యూబా మీద 1960 దశకం నుంచి అమలు జరుగుతుంటే ఇరాన్‌ మీద 1979, ఆఫ్ఘనిస్తాన్‌ మీద 1999 నుంచి అమల్లో ఉన్నాయి. ఐరాస మానవ హక్కుల మండలి 2014లో ఆమోదించిన తీర్మానంలో ఏకపక్ష ఆంక్షలు పౌరుల మీద చూపుతున్న ప్రతికూల ప్రభావాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ తరువాత తీవ్రత, సంఖ్య రీత్యా ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు.
           ఔషధాల దగ్గర నుంచి అన్నింటి మీద అమెరికా విధించిన ఆంక్షల వలన క్యూబా అపార నష్టానికి గురైంది. ఒక దశలో వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్ల వంటి వాటికి కూడా డీజిలు, పెట్రోలు దొరక్క గుర్రాలతో సాగు చేసుకోవాల్సి వచ్చింది. క్యూబా మీద ఆంక్షల వలన తమకు జరిగిన నష్టం గురించి అమెరికా సంస్థలు కూడా గగ్గోలు పెట్టాయి. ఎవడి గోల వాడిది. క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అనే సంస్థ 2002లో వేసిన అంచనా ప్రకారం ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 360 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. తరువాత అక్కడి కార్పొరేట్ల ఒత్తిడి మేరకు ఆంక్షలను సడలించటంతో 2000-2006 కాలంలో అమెరికా వార్షిక ఎగుమతులు 60 లక్షల నుంచి 35 కోట్ల డాలర్లకు పెరిగాయి. అయినప్పటికీ తమకు ఏటా 120 కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతున్నట్లు 2009లో అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. ప్రారంభం నుంచి తమకు 753 బి.డాలర్ల నష్టం జరిగిందని క్యూబా సర్కార్‌ చెప్పింది. అమెరికాకు ఏటా 484 కోట్ల డాలర్ల మేర, క్యూబాకు 68.5 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్లు క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అంచనా వేసింది. భిన్నమైన అంశాల ప్రాతిపదికన చెప్పే ఈ అంచనాలు ఒకదానికి ఒకటి పొసగవు. ఉదాహరణకు 2015లో అల్‌ జజీరా ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం ఆంక్షలు ప్రారంభమైన 55 సంవత్సరాలలో క్యూబాకు 1.1 లక్షల కోట్ల నష్టం జరిగింది.
           ఇరాన్‌ మీద విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర ఔషధాల జాబితాలోని 32తో సహా 73 ఔషధాలకు అక్కడ కొరత ఏర్పడింది. ఆప్ఘ్‌నిస్తాన్‌లో తలసరి ఆదాయం దారుణంగా తగ్గింది. 2021లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అదే అమెరికా, ఐరోపా సమాఖ్య 960 కోట్ల డాలర్ల విలువగల ఆప్ఘన్‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఆ దేశ జిడిపిలో సగం. ఆంక్షల కారణంగా విదేశాల నుంచి ఏటా వచ్చే 80 కోట్ల డాలర్ల మేర నిలిచిపోయాయి. వెనెజులా మీద 2017లో విధించిన ఆంక్షల కారణంగా 2020 నాటికి దేశ దిగుమతులు 91 శాతం తగ్గాయి. దాదాపు పూర్తిగా దిగుమతుల మీదనే ఆహారం సమకూర్చుంటున్న వెనెజులా దిగుమతులు 78 శాతం పడిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షల కారణంగా జీవన ప్రమాణాలు తగ్గి శిశు, సాధారణ మరణాల రేటు పెరిగింది. తమ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడిన జనం ఇరాన్‌, వెనెజులా పాలకులపై తిరుగుబాటు చేసే విధంగా పురికొల్పటమే లక్ష్యమని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో గతంలో చెప్పాడు. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పేరుతో ఇలాంటి దుర్మార్గమైన ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. ఆంక్షలు ప్రకటించిన ఏ దేశంలోనైనా జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప వీటిని సాధించలేదు. అవి సమర్ధించే అనేక దేశాల్లో వాటి జాడే కనపడదు. సోషలిస్టు బాట నుంచి వైదొలిగేట్లుగా లేదా తనకు అనుకూలంగా మార్చుకొనేట్లు క్యూబా మీద అమలు జరుపుతున్న ఆంక్షల ప్రభావం ఏమాత్రం లేదని విలియం లియోగ్రాండే అనే విశ్లేషకుడు చెప్పాడు. ప్రాణాలైనా ఇస్తాంగానీ అమెరికాకు లొంగేది లేదన్న కమ్యూనిస్టుల ప్రత్యేకత ఇది.

table


          అన్ని దేశాల మీద ప్రకటిస్తున్న ఆంక్షల లక్ష్యం కూడా లొంగదీసుకోవటమే. అణు పరీక్షలు జరుపుతున్నదనే కారణంతో ఇరాన్‌ మీద భద్రతా మండలి విధించిన ఆంక్షలు కొన్ని కాగా దానితో నిమిత్తం లేకుండా అమెరికా, ఇతర దేశాలు విధించినవి మరికొన్ని. అణు కార్యమం నిలిపివేతకు అంగీకరించిన ఇరాన్‌తో దానికి ప్రతిగా స్పందించాల్సిన అమెరికా ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగింది. తమ భద్రతకు ముప్పుతెచ్చే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవద్దన్న రష్యా వినతిని ఖాతరు చేయకుండా ముందుకు పోతుండటంతో తప్పనిసరై సైనిక చర్యకు దిగిన పుతిన్‌పై ఆంక్షలు విధించి దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసి జనాన్ని వీధుల్లోకి తెచ్చి పుతిన్‌ సర్కార్‌ను గద్దె దింపాలని అమెరికా చూసింది. వాణిజ్య పోరు పేరుతో చైనాను తన దారికి తెచ్చేందుకు అంతకు ముందే పూనుకుంది. వివిధ సందర్భాలలో మనతో సహా అనేక దేశాలను బెదిరించటం చూస్తున్నదే.
          ఉక్రెయిన్‌ మీద మిలిటరీ దాడులు జరుపుతున్నదనే కారణంతో రష్యాకు చెందిన సంస్థలు, వ్యక్తుల మీద ఆంక్షలు విధించారు. రష్యా ఐటి, ఇంజనీరింగ్‌ వంటి రంగాలకు అవసరమైన వస్తువులు, సేవల ఎగుమతుల మీద బ్రిటన్‌ నిషేధం విధించింది, 70 శాతం సెమీ కండక్టర్ల ఎగుమతులు నిలిచాయి. అమెరికా, ఇతర నాటో దేశాల చమురు, గ్యాస్‌ ఎగుమతుల నిషేధం, చమురు ధరలపై ఆంక్షల గురించి తెలిసిందే. దేశాల వారీ చూస్తే అమెరికా 374, కెనడా 156, బ్రిటన్‌ 95, ఐరోపా సమాఖ్య 44, స్విడ్జర్లాండ్‌ 42, ఆస్ట్రేలియా 28 చొప్పున కొత్త ఆంక్షలు విధించాయి. ఇరాన్‌ మీద కొత్తగా 115 ఆంక్షలు ఈ దేశాలు విధించాయి. హిరోషిమాలో ఇటీవల జరిగిన జి7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందు పలు ఆంక్షలకు తెరతీశారు. వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే అమలు జరుపుతున్న ఆంక్షల వలన రష్యా ప్రభావితం అవుతున్నది. చమురును ఆరవై డాలర్లకు మించి కొనకూడదన్న ఆంక్ష వలన గానీ రాయితీ ధరలకు వివిధ దేశాలకు అమ్ముతున్న కారణం కావచ్చు. ప్రస్తుత రష్యా చమురు సగటు ధర 58.62 డాలర్లు ఉంది. ఆర్మీనియా నుంచి అది దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ 3,700 శాతం పెరిగాయి. వివిధ దేశాల మీద 2023 ఫిబ్రవరి 22 నాటికి విధించిన ఆంక్షల సంఖ్య గురించి స్టాటిస్టా సమాచారం ఇలా (పట్టిక) ఉంది.
          చైనా మార్కెట్‌లో మరింతగా తన వస్తువులను అమ్ముకొనేందుకు, దిగుమతులను అడ్డుకొనేందుకు, చైనాకు అధునాత సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు అమెరికా ఆంక్షలను అమలు జరుపుతోంది. 2008లో రెండు కొత్త ఆంక్షలను విధించగా తరువాత 2018 నాటికి వాటిని 59కి పెంచింది. తరువాత నాలుగు సంవత్సరాలలో 29,300,89,36 కొత్తగా విధించింది. వీటిలో ఇటీవలి కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల ఎగుమతుల మీద విధించిన ఆంక్షలు తీవ్రమైనవి. తద్వారా చైనా ఆర్థిక రంగాన్ని కుదేలు కావించాలని చూస్తున్నది. 2023 తొలి మూడు మాసాలలో విధించిన ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటే పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల సంఖ్య 36,500 దాటింది. తాము విధించిన వాటితో పాటు ప్రతిగా తమ మీద విధించిన ఆంక్షలతో పశ్చిమ దేశాలు కూడా కొంత మేరకు ప్రభావితం అవుతాయి. వాటి తీవ్రత పెరిగి తమ లాభాలు, అసలుకే ముప్పు వచ్చేంత వరకు కార్పొరేట్‌ సంస్థలు రంగంలోకి రావు. డాలరు పెత్తనం తగ్గుతుందని అనేక మంది చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అది అంత తేలిక కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ దేశాల రిజర్వు బ్యాంకుల్లో డాలరు నిల్వలు 2021 డిసెంబరులో 7,085.92 బిలియన్‌ డాలర్లుంటే 2022 ఆగస్టులో 6,652.32 బి.డాలర్లకు మాత్రమే తగ్గాయి. ఇదే కాలంలో మొత్తం రిజర్వు బ్యాంకుల ఆస్తుల్లో చైనా యువాన్‌ నిల్వలు నామమాత్రం నుంచి 6.2 శాతానికి పెరిగాయి. అందువల్లనే అమెరికా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. సామ్రాజ్యవాదులు, దానితో చేతులు కలుపుతున్న శక్తుల తీరు తెన్నులను చూస్తే తమకు లొంగని దేశాల మీద ఆంక్షలను రోజు రోజుకు పెంచటాన్ని గమనించాము. రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే ఆయుధ యుద్ధాలకు బదులు ఆంక్షల దాడులతో జనాలకు ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఐరాస వీటిని నిరోధించలేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన యుద్ధాలనే కాదు ఆంక్షలనూ వద్దంటూ జనం వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది.

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు