Sep 12,2023 06:56

సనాతన ధర్మంలో స్త్రీపురుషుల ధర్మాలు సమానమేనా? ధర్మార్థ కామ మోక్షాలు పురుష ధర్మాలా? ఇంటి పని, బిడ్డల పెంపకం స్త్రీలది మాత్రమేనా? కులాంతర వివాహాలు చేసుకున్న కూతుళ్ళను చంపడమే సనాతన ధర్మమా? భర్త చనిపోయిన స్త్రీలకు పసుపు, కుంకుమ, పూలు, శుభకార్యాలు నిషిద్ధమా ? ఇదే సనాతన ధర్మం అయితే దీనిని నిర్మూలించవద్దా? బ్రాహ్మణ కులంలో పుడితే ఉత్తమ జన్మా? శూద్రుడు అయితే హీనమా? దళితులుగా పుడితే మనుషులుగానే లెక్కించరా? ఇలాంటి సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెళ్ళగించవద్దా?

            సనాతన ధర్మం అంటే సమతా ధర్మమేనా? సమతా ధర్మం అయితే అసమానతలకు, అణిచివేతకు గురైన వారందరూ సంతోషంగా ఆమోదిస్తారు! కానీ వర్ణాశ్రమ ధర్మంతో కూడుకున్న సనాతన ధర్మం, స్వధర్మంతో కూడుకున్న సనాతన ధర్మం ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, కరోనా వైరస్‌ లాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలతో బిజెపి సవారీ చేయాలనుకుంటున్న సనాతన ధర్మాన్ని బోనులో నిలబెట్టినట్లు అయింది. మన రాష్ట్రంలో గత నెలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పాఠశాలల్లో సనాతన ధర్మం గురించి బోధించాలని సర్కులర్‌ జారీ చేయడాన్ని విజ్ఞులైనవారు చాలామంది ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని వమ్ము చేస్తున్న బిజెపి వారు...సమ ధర్మాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఏర్పడిన రాజ్యాంగాన్ని ఎందుకు తూట్లు పొడుస్తున్నారో? సనాతన ధర్మం పేరిట బ్రాహ్మణులు సంస్కారులంటూ వర్ణ వ్యవస్థను కాపాడేందుకు, హిందూ మత ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఎందుకు తహతహలాడుతున్నారో? ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి !
        సనాతన ధర్మమంటే ఏమిటి? హిందూ ధర్మాన్ని పాటించడమే సనాతన ధర్మం అని వికీపీడియా చెప్తుంది. శాశ్వత సత్యమని, చరిత్రకు అతీతమైందని చెప్పబడుతున్నది. సనాతన ధర్మం లక్ష్యం ఏమిటి? మోక్షం, మరో జన్మ నుంచి విముక్తి. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడం ద్వారా ఉత్తమ జన్మ ఎత్తుతావని, ఉత్తమ జన్మ ద్వారా మోక్షాన్ని పొందుతావని ప్రచారం జరుగుతోంది. వర్ణాశ్రమ ధర్మం ఈ సనాతన ధర్మంలో భాగం. హిందూ మతానికి వర్ణాలు-కులాలే బలమని, కుల సంకరం కారణంగానే హిందూ మతం భ్రష్టు పట్టిందని కాలం చెల్లిన కులాన్ని పంగల కర్రల మీద నిలబెట్టేందుకు సాధుసంతుల పేర సామాన్యుల బుర్రలను విషతుల్యం చేస్తున్నారు. మరోవైపు కుల, మత అంతరాలతో సమాజంలో ఏర్పడిన విభజనలను ఉపయోగించుకుని విద్వేషాలను రెచ్చగొట్టి తమ అధికారాన్ని శాశ్వతం చేసుకునే దుస్సాహసం చేస్తున్నాయి ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు. సనాతన ధర్మం అనే భావన వాస్తవానికి సనాతనమే కాదు గదా! వేద ప్రమాణాన్ని నిరాకరించి దు:ఖానికి కారణాన్ని నివారించాలని, సంఘ ధర్మాన్ని ప్రబోధించిన బుద్దుడి నుండి స్వీకరించిన భావం. అందుకే భగవద్గీత క్షమా గుణం, ఓర్పు, నిజాయితీ, దయ, ఇతరులకు హాని కలిగించకుండా ఉండటం వంటి కార్యాచరణ గురించి చెప్పింది. మరి యుద్ధం చేయడం ఏమిటి? అంటే అది స్వధర్మం అని బుజ్జగించింది.
స్వధర్మం పేరిట గాంధీని, గౌరీ లంకేష్‌ లాంటి మహోన్నతులను హత్య చేయడం మాత్రమే కాదు, మత మారణకాండలను సృష్టించి దేశాన్ని వల్లకాడుగా మార్చేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు పూనుకున్నాయి.
           ఈ సనాతన ధర్మం స్త్రీ ధర్మాలను కూడా ప్రబోధిస్తుంది. భర్త పట్ల భక్తి కలిగివుండడం స్త్రీ ధర్మం అంటున్నారు. భర్తను సుఖపెట్టడమే లక్ష్యంగా దాసిలా సేవ చేయాలి! మరి సమ ధర్మం అంటే భార్య పట్ల కూడా భక్తిని ప్రబోధించాలి కదా! రాజ్యాంగ విరుద్ధమైన వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మాలు సనాతన ధర్మం పేరిట దళితులను మహిళలను, ముస్లింలను హత్యలు చేస్తూ, ప్రచారం చేస్తున్నవారిని ఎన్ని సార్లు శిక్షించాలి? వారిని సమర్ధించేవారికి ఎంతటి శిక్ష వెయ్యాలి? ఉదయనిధి వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్నాయని హిందువులను రెచ్చగొట్టే అమిత్‌ షా అండ్‌ కో వీటికి సమాధానం చెప్పాలి.
           మేము మహిళలం.. ప్రశ్నిస్తున్నాం..! సనాతన ధర్మంలో స్త్రీపురుషుల ధర్మాలు సమానమేనా? ధర్మార్థ కామ మోక్షాలు పురుష ధర్మాలా? ఇంటి పని, బిడ్డల పెంపకం స్త్రీలది మాత్రమేనా? కులాంతర వివాహాలు చేసుకున్న కూతుళ్ళను చంపడమే సనాతన ధర్మమా? భర్త చనిపోయిన స్త్రీలకు పసుపు, కుంకుమ, పూలు, శుభకార్యాలు నిషిద్ధమా? ఇదే సనాతన ధర్మం అయితే దీనిని నిర్మూలించవద్దా? బ్రాహ్మణ కులంలో పుడితే ఉత్తమ జన్మా? శూద్రుడు అయితే హీనమా? దళితులుగా పుడితే మనుషులుగానే లెక్కించరా? ఇలాంటి సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెళ్ళగించవద్దా ?
       చర్చ ప్రారంభమైంది కదా చర్చిద్దాం. ఒక్కరు ఆకలిగా ఉన్నా సహించలేనన్న వివేకానందుడు చెప్పిన ధర్మమా? మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగునన్న గురజాడ బోధించిన ధర్మమా? అన్ని మతాలు, వ్యవస్థలు బోధించిన సమభావన లక్ష్య సాధనగా రూపొందించుకున్న రాజ్యాంగ ధర్మమా? ఏది సమ ధర్మం? ఏ సనాతన ధర్మం కూడా శాశ్వతమైనది కాదు. మార్పులకు అతీతమైనది కాదు. ఇది హిందూ మతం మీద దాడి అంటూ బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వివాదం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మం పేరిట హిందూ మతంలో కుల అంతరాల దొంతరలను నిర్మూలించవద్దా? స్త్రీలపై ఉన్న ఆంక్షలు నిర్మూలించవద్దా? సాధారణ హిందూ మతస్తులు ఆచరణలో వీటిని మార్చుకునేందుకు, సంస్కరించుకునేందుకు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. హిందూముస్లింలు తమ సమస్యలు అధిగమించడానికి, కోర్కెలు నెరవేర్చుకోవడానికి రొట్టెల పండుగలో భాగమవుతారు. ఎన్నో సాంప్రదాయాలలో ఎన్నో మార్పులు మానవ హితం కోసం సాగుతున్నాయి. ఈ మార్పులకు అడ్డం పడుతున్నది ఆర్‌ఎస్‌ఎస్‌. కుహనా ధర్మాలను బోధించి, విద్వేషాలను సృష్టించి దేశాన్ని, దేశ ప్రజలను దోపిడీదారులుకు బలిచేస్తున్నది బిజెపి. సామాన్యుల జీవితాలను కష్టాలమయం చేస్తున్నది బిజెపి. సనాతన ధర్మం పేరిట సాగుతున్న హిందూత్వ (రాజకీయాలు) పైనే నా విమర్శ అన్నాడు ఉదయనిధి. మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించి, అత్యాచారాలు చేసిన వారికి మద్దతిస్తున్న వారికి ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? బ్రాహ్మణులు సంస్కారులంటూ అత్యాచార నిందితులను వదిలేసిన వారు ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదం కదా? ఆ దుర్మార్గాలను సమర్ధించే, ప్రోత్సహించే హిందూత్వను నిర్మూలిస్తేనే ప్రజలకు కావాల్సిన ధర్మ స్థాపన!

/ వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి /
డి. రమాదేవి

డి. రమాదేవి