సాంప్రదాయాల సాలీడు
విషగూటిలో చిక్కుకుని నువ్వు
బాధ్యతల భవబంధాల్లో బందీయై
నేను ప్రతిక్షణం విలవిల్లాడుతున్నా..
దాన్ని ఛేదించుకుని
నువ్వు బైటికి రావాలనుకున్న
ప్రతిసారీ నీ కాళ్లకు అది
అడ్డం పడుతోంది..
నేను బాధ్యతల్లో కొన్నింటిని
నిర్వర్తించుకుని
మరికొన్నింటిని తప్పించుకొని
రాగల్గినా.. నువ్వు రావడం
గగనమే..
వర్తమాన కష్టాల కడలిని
ఈదడం కంటే
భూతకాలపు జ్ఞాపకాల దుంగతో
వెనక్కి పయనించడమే సులువేమో..
వాస్తవాన్ని జీర్ణించుకోవడం
కష్టమే కావొచ్చు కానీ
దాన్ని అంగీకరించడంలోనే
అర్థం చేసుకోవడంలోనే
జీవన పరిపక్వత దాగి వుంది..
జీవన పయనంలో ఇలా
సంశయాల చౌరస్తాలో,
నింగివైపు చూస్తూ ఉండిపోయాను
నిరాశ నిస్పృహల శూన్యదృక్కులతో..
మళ్లీ రేపు నేను గెలుస్తాననే
నమ్మకం లేదు
ఇలాగే ఆశల చిగురుతో
నిలుస్తాననే ఆశ లేదు..
సర్ఫరాజ్ అన్వర్
94409 81198