Oct 02,2022 09:19

దశాబ్దాలుగా పేర్చుకున్న
రంగురంగుల జీవితాలు
పేక మేడలా కూలుతున్నాయి!
పర్వత శిఖరం మీద
అడుగుపెట్టిన తరువాత
పాదాల క్రింద
శూన్యం విస్తరించింది!
పెంచుకున్న మహా కాయం
రక్త మాంస రహితం అయ్యింది!
ఎందుకంటావా?
ఇది, నిన్ను నిన్నుగా ఉండనీయని
వైరుధ్యాల సమాజం!
అయినా ఇది, చిట్లిన అక్షరాలు
కూడుకుంటున్న కాలం!
ఇది, ఇంకిన పదాల నదులు
పునర్జన్మనెత్తుతున్న కాలం!
ఇది, బీడుపడిన పోరు భూమిలో
ఆయుధాలు మొలకెత్తుతున్న కాలం!
ఇది, ఇజాల తొక్కిసలాటల మధ్య
నిజాలు నిరూపితం అవుతున్న కాలం!
అదును ఇదే, పదును ఇదే,
సాధ్యమయ్యే సమయమిదే,
కరిగిపోతున్న చైతన్యాన్ని
పెనవేయకపోతే
ఎదురుచూస్తున్న శిఖరం
ఎప్పటికీ అందదు!
ఒరిగిపోతున్న జీవితం
విరిగిపోక ముందే
శకలాలుగా రాలుతున్న ఆశల్ని
శస్త్రాలుగా మార్చి సంధించకపోతే
నీ బాహువులు
ఎప్పటికీ పరాధీనంగానే ఉంటాయి!


తాండ్ర రమణ
94923 19365