
టపటపా మోతలతో తాటాకు టపాకాయలు.. జుయ్యి జుయ్యిమంటూ ఆకాశాన్ని తాకాలని తాపత్రయపడే అవారు సువారులు.. చిమ్మ చీకటిని చీల్చుకుంటూ వెలుగులను విరజిమ్మే మట్టికుండల చిచ్చుబుడ్డులూ.. చిటపట మోతలతో.. ఇటూ అటూ తిరిగి నాట్యమాడించే సీమ టపాకాయలు.. కరకర శబ్దంతో ఉలికిపడేలా చేసినా.. చిన్నాపెద్దా అందరూ నిర్భయంగా వెలిగించే కాకర పువ్వొత్తులూ.. నేలపైన గిరగిర తిరుగుతూ గుండ్రంగా వెలుగు రవ్వలు వెదజల్లే భూచక్రాలు.. సన్నని సువ్వకు గుచ్చి వెలిగిస్తే రివ్వున తిరుగుతూ వెలుగులు చిమ్మే విష్ణుచక్రాలు.. తెలతెల్లని కాంతులు వెదజల్లుతూ.. మతాబులూ, వెన్నముద్దలూ.. పాముబిళ్ళలూ, అగ్గిపుల్లలూ, పెన్సిళ్ళూ-తాళ్ళ వెలుగుల మెరుపు తుంపరలు.. ఒకటేమిటి ఎన్నెన్ని వెలుగులో.. జన జాగృతికి కంకణం కట్టాలనుకునే ఎన్నెన్ని కాంతులో.. ఇవి చాలవన్నట్లు ప్రతి ఇంటి ముంగిట్లో దేదీప్యమానంగా అలరిస్తూ వెలిగే ప్రమిదల వరుసలు.. మరి మరిచిపోమా.. అమావాస్యనేది ఒకటుందని! ఈ శోభాయమాన దీపావళి అందరిదీ.. సర్వజన సమ్మేళన సంతోషాల దీపావళి.. సామరస్యతకు ప్రతీక ఈ వెలుగుల దీపావళి. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. సహజంగానే పండుగ అనగానే ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పిండి వంటలు తయారుచేసుకోవటం ఆనవాయితీ. దీపావళికి టపాసుల ఆనందాలు తోడవుతాయి. వారం పదిరోజుల ముందుగానే ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు, టపాసులు తీసుకొని అమితానందంతో దీపావళిని ఆహ్వానిస్తారు. పిల్లలైతే ఇక సరేసరి. దీపావళి టపాసులు ఎండబెట్టుకోవడం.. వాటిని భద్రపరచడం.. చాటుగా ఇదొక్కటి కాల్చి చూద్దామని ప్రయత్నించడం.. అవి తుస్సుమంటే పెద్దవాళ్ళు బాగా ఎండనివ్వమని గదమటం.. ఇలాంటి సరదాలెన్నో.. ఎన్నెన్నో ప్రతి ఇంటిలోనూ ఎదురుచూసిన పండుగ రానేవచ్చిందని, ఆ రోజు అన్నింటా తామై.. అంతా తమదే అన్నట్లు అంబరాన్ని తాకే సంబరం పిల్లలకు. అలా అని పెద్దలు ఏమాత్రం తగ్గకుండా.. సాయంత్రమయ్యేటప్పటికి చిన్నపిల్లలైపోతారు. టపాసులు కాల్చడానికి, పిల్లలతో కాల్పించడానికి రెడీ అయిపోతారు. ప్రతి ఇంటా దీపపు కాంతుల శోభ, ఆనంద కోలాహలంతో వెల్లివిరుస్తోంది.
మార్పులు.. చేర్పులు..
కాలానుగుణంగా వచ్చిన మార్పుతో ప్రమిదల స్థానే రకరకాల కొవ్వొత్తులు వచ్చాయి. స్విచ్ వేస్తే చాలు రంగురంగుల చిన్నిచిన్ని శ్రేణీ బల్బుల కాంతులు ఆకర్షిస్తున్నాయి. ఢాంఢాం..అంటూ మోగే శబ్దాలకు గోడలు అదిరే, వాడలు బెదిరే నిజమైన బాంబులను తలపించేలా టపాకాయలు తయారవుతున్నాయి. వెలుగులను మాత్రమే విరజిమ్మే అవారుసువారులు, చిచ్చుబుడ్డులు తదితరాలలోనూ రకరకాల రంగులు వెదజల్లుతూ చివరిలో అవి పేలేలా ప్రమాదకరమైన రసాయనాలు కలిపి తయారుచేస్తున్నారు. రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అయినా ఖర్చయితే అయ్యింది తగ్గేదేలే.. అని డాంబికాలు పోతున్నారు కొందరు. ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టి టపాసులు కాల్చారో వారే గొప్ప మరిప్పుడు. అయితే కొందరు దీపావళిని సరదాల పండగ అని భావిస్తే, మరికొందరు కాసుల దండగ అనుకొంటున్నారు.

పర్యావరణ సహితంగా..
ఒకప్పుడు దీపావళి పూర్తిగా పర్యావరణహితంగా జరిగేది. మట్టి ప్రమిదల్లో నువ్వులనూనో, ఆవనూనో పోసి వెలిగించేవారు. టపాసులు కూడా ప్రమిదలతోనే వెలిగించుకునేవారు. అవసరమైతే గోగు పుల్లలను ఉపయోగించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకోవడమే కాక, సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ.. 'దిబ్బి దిబ్బి దీపావళి..మళ్ళీ వచ్చే నాగులచవితి.. పుట్ట మీద జొన్నకర్ర.. పుటుక్కు దెబ్బ!' అని పాడుకుంటారు. దాదాపు నెలరోజుల ముందు నుంచే పిల్లల చేతుల్లో దీపావళి తుపాకులు, దాంతో పేల్చే మందు బిళ్ళలు, నేల మీద కొట్టి పేల్చే ఉల్లిపాయ టపాకాయలు దీపావళి రాకను గుర్తుచేసేవి. కుర్రకారంతా తాటి ఆకులు, తాటి గులకలు సేకరించి, ఎండబెట్టి టపాసుల తయారీకి అనుగుణంగా వాటిని సిద్ధం చేసుకునేవారు. తాటి గులకలను కాల్చి పొడి చేసి, దానికి రంపపు పొట్టు, ఉప్పు, ఆవు పేడ కలిపి బాగా ఎండబెట్టి పొడి చేస్తారు. దాన్ని తాటి ఆకులో పెట్టి, పొట్లంలా కడతారు. లేదా కొబ్బరిపీచును పేడతో షీట్‌లా తయారుచేసి, దానిలో పెట్టి పొట్లంలా కడతారు. ఈ పొట్లాన్ని తాటి మట్టను మధ్యకు చీల్చి దానిలో పెట్టి, చివరిభాగాన ఒక తాడు కట్టి, పూల పట్టాలు తయారుచేస్తారు. వాటిని రాత్రిపూట వెలిగించి తిప్పుతుంటే నిప్పురవ్వలను వెదజల్లుతూ కనువిందు చేసేవి.
అలాగే తాటి గులకలకు బొగ్గుపొడి, కొద్ది మోతాదులో గంధకం, సూరేకారం (పొటాషియం నైట్రేటు) కలిపి తాటాకు టపాకాయలు తయారుచేసేవారు. అలాగే అవారు సువారులూ తయారుచేసేవారు. ఎవరి టపాసులు బాగా శబ్దం వస్తే వారు గొప్ప. ఎవరి అవారు సువారులు బాగా ఎత్తుగా వెళితే వారు సూపర్. అలా ఎవరికి వారే ఖర్చు లేకుండా, సహజంగా లభించే వస్తువులతోనే ఇవన్నీ తయారు చేసుకునేవారు. దీని వలన ఆర్ధికంగా, పర్యావరణపరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. అంతేకాదు స్వయంగా తయారుచేసిన ఆనందం అద్వితీయమే కదా!
సంస్కృతికి.. సందెవేళ..
భారతీయ సంస్కృతిలో పండుగలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా.. పంటలు బాగా పండి ధాన్యం చేతికొచ్చిన ఆనందం.. ప్రజల జీవన విధానం యాంత్రికంగా కాక అప్పుడప్పుడు ఎక్కడెక్కడో ఉన్న తమ వారందరితో కలసి సంతోషంగా గడపటమనే ప్రక్రియలోనే ఎన్నెన్నో అనుబంధాలు దాగి ఉన్నాయి. 'దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్..రివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్, దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిల్లంగను నల్దిశలున్, నవ్వుల పువ్వులు, తియ్యని బువ్వలు నల్వురు మెచ్చగ రమ్యముగన్..' అన్నారు కవి మిస్సన్న. కానీ రానురాను అవన్నీ మృగ్యమైపోతున్నాయి. మెరుపులీనే కాంతులు మండిపోయే ధరల రూపంలో మసిబారుతున్నాయి.
తొలినాళ్ళలో పిండివంటలు, కొత్తబట్టలు, బంధుమిత్రులు అందరూ కలవటంతో పాటు దీపాలు వెలిగించి, ఆనందించేవారు. క్రమేపీ ఆర్థిక పరిమితుల మధ్య.. సామాజిక అంతరాలు పెరగడంతో.. పండుగల మూలాల ప్రాతినిధ్యంలోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి.

పౌరాణిక గాథలు..
దీపావళి పండుగ వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం.. నరకాసురుడు అనే రాక్షసుడు ఏ పురుషుడి చేతిలోనూ తనకు చావు రాకూడదని వరం పొందుతాడు. ఆ వర గర్వంతో దేవతలను హింసించేవాడు. చివరికి సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారు. ఆ రోజు అమావాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజలు తోరణాలు కట్టి, దీపాలు వెలిగించి, బాణాసంచా కాలుస్తూ వేడుక చేసుకుంటారు. మరో పురాణగాథలో.. రాముడు వనవాసం తర్వాత, సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చింది ఇదే రోజు అని ప్రచారంలో ఉంది. ఆ సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి, సంబరాలు చేసుకున్నారని ప్రతీతి.
పురాణాలెన్ని చెప్పినా సైన్సు అభివృద్ధి చెందింది. టెక్నాలజీ పెరిగింది. మనిషి పుట్టుక, పరిణామక్రమం ఆధారాలతో సహా తెలిసిన తరువాత వివేకంతో ఆలోచిద్దాం. మూఢనమ్మకాల నుంచి బయటపడదాం. పండుగలన్నీ ఆనందంగా గడుపుదాం.

సౌధ కాంతులు.. పేద బతుకులు..
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే ఏకైక పండుగ దీపావళి. చెప్పుకోడానికి బాగానే ఉంటుంది కానీ మిరుమిట్లు గొలిపే అంబానీ, ఆదానీల సౌధ కాంతులెక్కడ..? మినుకు మినుకుమనే గుడిసెవాసుల దీపకాంతులెక్కడ..? అందుకే కాళోజీ.. 'ఊరి వెలుపలనున్న పూరి గుడిసెల దూరి.. లోని చీకటి బాపలేని దీపాలు.. దోచి దాచినదెంతో దౌర్భాగ్యులకు జూప.. ధన పూజ చేయించు ధర్మ దీపాలు' అంటూ సామాన్యుల బాధలు, దోపిడీదారుల పీడనలను కళ్ళముందుంచుతాడు.
'దీపం జ్ఞాన దీపమై చీకటి దూరమౌట సుఖజీవన సారమటంచు ఎరుంగరే' అన్న కవి కోణంలో పయనిద్దాం. 'చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి.. అందాల ప్రమిదల.. ఆనందజ్యోతుల.. ఆశలు వెలిగించు దీపాల వెల్లి'.. అని ఆత్రేయ ఏనాడో దీపావళిని మనిషి జీవితానికి అన్వయించి చెప్పారు.
ప్రమిదల్లో తైలాన్ని నింపి వెలిగించడమే దీపావళి కాదు. 'ఈ దీపావళి దివ్వెలతోట.. ముద్దులు చిందే పువ్వులకోట.. కావాలి ప్రతి ఇంటా'.. అన్నారు దాశరథిó. ఎండ్లూరి సుధాకర్ చెప్పినట్లు 'ఆకలితో నకనకలాడే చిన్నారుల కడుపు నిండా తిండి దొరికినప్పుడు, కడుపు కాల్చుకుంటూ కట్టెల్లా మట్టి తట్టలెత్తుతూ దీనుల కళ్ళల్లో వెలుగులు చూసినప్పుడూ, చీకటి బతుకుల్లో కాంతి రేఖలు రవళించినప్పుడు, సామాన్యుడు కడుపునిండా తిని, అంతా ఒక్కటని ఒక్కచోట కూడి.. అంతరాలు సమాంతరాలైనప్పుడు అప్పుడొస్తుంది నిజమైన దీపావళి. జానెడు పొట్ట నింపుకోడానికి చీకటిలో మగ్గుతున్న జీవితాలకు ఏ మతాబులు, ఏ చిచ్చుబుడ్డులు వెలుగునిస్తాయి!'
ఎవరెన్ని చెప్పినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పండుగైనా మొక్కుబడిగానో, తూతూమంత్రంగానో జరుపుకునేలా ఉన్నాయి. పండుగ వస్తుందనే ఆనందం, సంతోషం ఏ ఒక్కరి మొహంలోనూ, మదిలోనూ కనిపించే పరిస్థితులు లేవు. 'నరకుడనువాడు ఎక్కడో నక్కిలేడు.. మనసులో చిమ్మ చీకటి మసలు చోట వానికున్నది ఉనికి' అన్నట్లు ఈ అభినవ నరకాసురులు గోముఖ వ్యాఘ్రాలుగా మన మధ్యనే తిరుగుతూ సందట్లో సడేమియాలా, చాపకింద నీరులా కబళిస్తుంటారు.
దీపావళి స్త్రీ శక్తి సామర్థ్యానికి, నారీ విజయానికీ ప్రతిరూపమంటారు. నేడు 'అత్యాచార చీకటిభారతిలో వెలుగులు కోరుతూ స్త్రీలోకం నినదిస్తుంది. మమ్మల్ని బతకనివ్వండి.. ఎదగనివ్వండి.. అంటుంటే.. మరోవైపు నెలల తరబడి జరిగిన రైతాంగ మహోద్యమాలు, కొనసాగుతున్న విశాఖ కార్మికులు చేసే ఉక్కు ఉద్యమం, నిరుద్యోగంపై యువత కదంతొక్కుతున్న వైనం.. ఇవన్నీ కారుచీకట్లని పారదోలాలని పోరాడే వెలుగురేఖలే. ఈ ఉద్యమాల్లోనూ స్త్రీ శక్తి ఎలుగెత్తింది. కానీ ముక్తి లేని నిరాశే ఎదురయ్యింది. దేశంలో కమ్ముకున్న కారుచీకట్లను చీల్చుకుంటూ వెలుగు రేఖలు ప్రసరించినప్పుడే మనకు నిజమైన దీపావళి.

పర్యావరణానికి 'సుప్రీం' అభయం..
దేశవ్యాప్తంగా ఒక్క దీపావళి రోజున కాల్చే బాణాసంచా విలువ వందల కోట్లని తేలింది. కార్పొరేట్ కంపెనీలు పండుగల ఆఫర్ల ప్రకటనలు, కామర్స్ వెబ్‌సైట్లు జనాన్ని వెర్రి పుంతలు తొక్కిస్తున్నాయి. గత రెండేళ్లలో కరోనాతో ప్రపంచమంతా ఎలా అల్లాడిపోయిందో మనందరికీ అనుభవమే.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం బాణసంచా కాల్చినా, కొన్నా జరిమానా, జైలుశిక్ష విధిస్తామని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కొంతమంది బాణసంచా విక్రయదారులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసి, వెంటనే విచారణ చేయవలసిందని కోరారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీం సానుకూలంగా ప్రతిస్పందించి, సదరు పిటిషన్‌ను తిరస్కరించింది. 'ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోనీయండి. బాణసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోనివ్వండి' అని వ్యాఖ్యానించింది. దీనిని పాటించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
గతంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే టపాసుల తయారీదారులకు ఇబ్బంది లేకుండా సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 'పర్యావరణానికి నష్టం కలిగించే టపాసులను నిషేధిస్తూ.. తక్కువ కాలుష్యం కలిగించేవాటిని మాత్రమే తయారుచేయాలి. టపాసుల తయారీలో బేరియం సాల్ట్, లిథియం, ఆర్సెనిక్, యాంటిమొనీ, లెడ్, మెర్క్యురీల వినియోగాన్ని, వాయు కాలుష్యానికి కారణమయ్యే థౌజండ్‌వాలాలు, లడీల వంటి టపాసులను పూర్తిగా నిషేధించాలి. పరిమితులకు లోబడి టపాసుల తయారీకే అనుమతులుంటాయి' అంటూ షరతులు జారీ చేసింది.
మనిషి పరిణామ క్రమంలో తనకు ప్రాణాధారమైన ప్రకృతికి, దైవత్వాన్ని అన్వయించి పూజించడం ద్వారా తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు. దీనికి మూఢత్వాన్ని జోడించి స్వప్రయోజనాలు పొందుతున్నారు కొందరు. మూఢనమ్మకాలకు మత తత్వాన్ని జోడించి మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తున్నారు మరికొందరు.
పురాణాలలో ఒక్కొక్క పండుగకు ఒక్కో కథ ఉన్నప్పటికీ అన్ని కథలూ, పండుగలూ చెడును, దుష్టత్వాన్ని రూపుమాపాలని, ప్రజలను చైతన్య పరచాలని, స్త్రీలకి గౌరమివ్వాలన్న సందేశాలనే ఇస్తాయి. మత మౌఢ్యంతోకాక సమభావంతో చూస్తే పండగల్లోని సమిష్టితత్వం, సౌభ్రాతృత్వం మనకు అర్థమవుతాయి. దీపావళి పండుగ నాడు అలాంటి సమైక్యతే కనిపించాలి ప్రజల్లో. స్నేహపూరిత, పర్యావరణ సహిత పండుగగా దీపావళిని జరుపుకుందాం.

మతసామరస్య కేళి..
దీపావళి అనగానే అదేదో ఒక మతానికి మాత్రమే చెందిన పండుగ కాదు. మతాలకు అతీతంగా సర్వజనులూ కుటుంబాలతో కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునే సామరస్య కేళి. దీపావళి సందర్భంగా ఇరుగుపొరుగు వారితో, స్నేహితులతో పెద్దలు, పిల్లలు కలిసి ఆనందంగా జరుపుకోవటం ఆనవాయితీ. దీపావళి వేళ అన్ని మతాలకు చెందిన పిల్లలూ, పెద్దలూ కలిసి టపాసులు కాల్చడం, మిఠాయిలు పంచుకోవడం ఇప్పటికీ మన చుట్టూ జరుగుతున్న వాస్తవం. ఇకముందు కూడా ఇలాగే అందరూ స్నేహంగా ఉండాలని కోరుకుందాం. ఇదే కదా అసలైన దీపావళి.

కాలుష్యాలు.. ప్రమాదాలు..
బాణాసంచా కాల్చినప్పుడు వెలువడే పొగలో సీసం, రాగి, మెగ్నీషియం, జింక్, మాంగనీసు, సోడియం, పొటాషియం, బేరియం, అల్యూమినియం, కాడ్మియం, ఫాస్ఫరస్ మూలకాలు గాస్ రూపంలో వాతావరణంలో కలుస్తాయి. ఇవి జ్వరం, వణుకు, కండరాల బలహీనత, నీరసం, దురదలు, ఎముకలు పెళుసు బారటం, గుండె, మెదడు, లివర్, కిడ్నీలకు హాని కలిగించడమే కాక పక్షవాతం వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
భారీ శబ్దాలు చేసే బాణాసంచా పేలుళ్ళ వలన గుండె దడ, నిద్ర లేమి, మానసిక ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.పెంపుడు జంతువులు ఆందోళన చెంది, అస్తిమితంగా ఉండటం, వీధుల్లో సంచరించే పశు పక్ష్యాదులు ప్రమాదాలు జరిగి, మరణించడం జరుగుతోంది.
బాణా సంచా తయారీలో ఉపయోగించే పొటాషియం పెర్క్లోరేట్ రసాయనాలు నీళ్ళలో కరిగి, నదులు, కాలువలు, సరస్సులు తదితన జలాశయాలన్నీ కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. తాగు, సాగు నీరు రెండూ కలుషితమవుతున్నాయి. దీపావళి బాణాసంచా కాల్చడం వలన వర్షాకాలం తరువాత పెరిగే క్రిమి కీటకాలు నశిస్తాయని కొన్ని శతాబ్దాలుగా అనుకుంటున్నాము. కానీ చివరకు అది జీవకోటి అంతటికీ ప్రమాద హేతువుగా మారుతోందన్నది గమనించాలి.
టి. టాన్యా 7095858888