Jan 15,2023 07:46

            సైనికుడనే పదం వినగానే ఒళ్లు పులకరిస్తుంది. సైనికుడి యూనిఫాం మనసులో ఒకరకమైన ఉద్వేగాన్ని రగిలిస్తుంది. యుద్ధరంగంలో, మంచుకొండల్లో...ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ... దేశానికి కంటికిరెప్పలా కాపలా కాయడం, అవసరమైతే... గుండు కెదురు గుండె నిలపడం పవిత్ర కర్తవ్యంగా భావిస్తాడు సైనికుడు. ఆ తపనతోనే చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని తహతహ లాడాడు. తన లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులకు చెప్పకుండానే ప్రయత్నం చేశాడు. చివరకు అందరినీ ఒప్పించి దేశ సేవకు బయల్దేరాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందాడు. దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన యువకుడు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహేష్‌. దేశ సేవలో తరించాలని, శత్రుసేనలతో తలపడాలని, తుదిశ్వాసను సరిహద్దుల్లోనే విడవాలని తపించే... తపనపడే మహేష్‌ లాంటి యువకులు అనేకమంది వున్నారు. 'జననీ జన్మ భూమిశ్చ... స్వర్గాదపీ గరీయసి, స్వర్గాదపీ గరీయసి/ నీ తల్లి మోసేది... నవమాసాలేరా/ ఈ తల్లి మోయాలి... కడవరకురా, కట్టే కాలే వరకురా/ ఆ ఋణం.. తలకొరివితో తీరేనురా/ ఈ ఋణం... ఏ రూపాన తీరేదిరా/ ఆ రూపమే ఈ జవానురా... త్యాగానికి మరో రూపు నువ్వురా' అంటాడో కవి. జవాన్‌ అంటే రియల్‌ హీరో... జవాన్‌ అంటేనే త్యాగానికి మారు పేరు. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే, దేశాన్ని కాపాడేది సైనికుడు. అందుకే అన్నారు- జై జవాన్‌... జై కిసాన్‌ అని.
            'పైన ఎరోప్లేను, చేతిలో స్టెన్‌గన్‌/ కీ యిస్తే తిరిగే అట్టముక్క సైనికులం/ మార్చ్‌/ వన్‌ టూ త్రీ ఘాట్‌ డెడ్‌ ఎవడ్‌' అంటూ వణికించే చలిలో, అరణ్యాలలో, మంచులో ఏ విధంగా నరక యాతన పడతారో, ఇంటి దగ్గర ఉన్న ఆత్మీయులు దూరమై ఎంతగా తల్లడిల్లిపోతారో ఆ ఆవేదననంతా 'సైనికుడి ఉత్తరం' కవితలో చెబుతాడు తిలక్‌. దేశమంటే భక్తితో... దేశ సేవను మించినది వేరేది లేదని... దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడతారు సైనికులు. 'నేను సైతం/ ప్రపంచాగ్నికి/ సమిధనొక్కటి/ ఆహుతిచ్చాను/ నేనుసైతం/ ప్రపంచాబ్జపు/ తెల్లరేకై పల్లవిస్తాను' అంటాడు శ్రీశ్రీ. అటువంటి త్యాగధనులను, పోరాట వీరులను కాంట్రాక్ట్‌ కార్మికులుగా మార్చారు. 'అగ్నిపథ్‌' పేరుతో పార్టీ ఆఫీస్‌లకు, కార్పొరేట్‌ కంపెనీలకు వాచ్‌మెన్‌లు, గార్డులుగా, సెలబ్రిటీలకు బౌన్సర్లుగా ఒక కొత్త వ్యవస్థను సృష్టించింది బిజెపి. ఇలాంటి చర్యలు దేశం కోసం... దేశ సేవ కోసం సైన్యంలో చేరాలని తపన పడే యువత కలలను, ఆశలను, ఆకాంక్షలను నిర్దాక్షిణ్యంగా నలిపివేయడమే. సైన్యంలో చేరడం అంటే మామూలు ఉద్యోగం కాదు. దేశసేవకు అంకితమవడం. సైన్యంలో చేరాలనే యువత కలలపై కేంద్రం నీళ్లు చల్లింది. రకరకాల కారణాలతో సైనిక రిక్రూట్‌మెంట్‌ను వాయిదా వేస్తూ వచ్చిన కేంద్రప్రభుత్వం... చివరకు అగ్నిపథ్‌ అనే కుంపటిని యువత నెత్తిన రుద్దింది. తాను బతికితే... సైనికుడిగానే- అనుకునే యువతకు నాలుగేళ్ల సైనిక ఉద్యోగాలనిచ్చి షాక్‌ ఇచ్చింది.
                దేశభక్తిని, దేశ భద్రతను, దేశ వనరులను అంబానీ, అదానీలకు అప్పగించి... రైతులు, సైనికులను వారి సేవకు వినియోగించే కుట్ర ఇది. 'సరిహద్దులు కాపాడే /యోధులు మీరు/ ప్రాణాలను త్యజిస్తున్న /త్యాగ మూర్తులు మీరు/ ఆకలిని తట్టుకొని / రక్షించే ధీరులు మీరు' అని సైనికుల త్యాగాలను గుర్తుచేస్తారొక కవయిత్రి. ప్రజలంతా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటోంటే... పాలకులు మాత్రం వారి త్యాగాలతో రాజకీయం చేస్తున్నారు. భావోద్వేగాలను తమ గెలుపునకు వనరుగా మార్చుకుంటున్నారు. ఈ ఒరవడి మారాలి. భారత సైన్యం ఒక పటిష్టమైన వ్యవస్థ. బంగారానికి కిలుము పట్టదు. నిప్పుకు చెదలు పట్టదు. 'దేహంతో వెళ్లిపోదీ కథ/ దేశంలా మిగిలుంటుందిగా/ సమరం ఒడిలో నీ మరణం/ సమయం తలచే సంస్మరణం/ చరితగా చదివే తరములకు/ నువ్వో స్ఫూర్తి సంతకం' అంటాడో కవి. ప్రతియేటా జనవరి 15ను 'జాతీయ సైనిక దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. అమరవీరుల త్యాగాలను స్మరించుకునే దినం ఇది. మన సైనికులకు సెల్యూట్‌ !!