Jun 26,2022 11:11

పురుషోత్తమరావు దంపతులు పట్టణ పొలిమేరల్లో కొత్త ఇల్లు కట్టారు. మంచి లగం చూసి, మేళతాళాలతో గృహప్రవేశం చేశారు. కొత్త ఇంటి దగ్గరే కంప్యూటర్‌ సెంటర్‌ ఉండడంతో కొడుకు రవికుమార్‌ని బేసిక్స్‌ నేర్చుకోమని అందులో చేర్పించారు. రెండు రోజులు ఉత్సాహంగా వెళ్లిన రవికుమార్‌ మూడో రోజు నుంచీ కంప్యూటర్‌ నేర్చుకోడానికి వెళ్లనని మొరాయించాడు. కారణమేమిటని నాన్న అడిగాడు.
కంప్యూటర్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ తనను చీటికీ మాటికి తిడుతున్నాడని ఆరోపించాడు. తను కంప్యూటర్‌లో ఏమి చేసినా అది తప్పు, ఇది తప్పు, అలా చేయాలి, ఇలా చేయాలని అరుస్తున్నాడని వాపోయాడు.
కొడుకు కంప్యూటర్‌ ట్రైనింగ్‌, మూన్నాళ్ల ముచ్చట కావడం నాన్నని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. ఎలాగూ బడికి సెలవులు కావడంతో ఇంటిపని చేస్తున్న పెయింటర్లకు సహకరించమని కోరాడు.
వారు కిటికీ కొయ్యలను ఉప్పు కాగితంతో గీకుతున్నారు. వారు చేస్తున్న పనిని గమనిస్తూ వారితో పాటు పనిచేయడం ప్రారంభించాడు రవికుమార్‌. ఉప్పు కాగితంతో కొయ్యని గీకే కొద్దీ అది నునుపుగా తయారై, అందంగా మెరవడం ప్రారంభమయ్యింది. ఆశ్చర్యపోయిన అతడు కొయ్యలను తీసుకెళ్లి, నాన్నకు చూపించాడు.
నాన్న నవ్వుతూ 'ఉప్పు కాగితంతో గీకబడితే కానీ కొయ్యలో మెరుపు రాలేదు. దాని పైన మురికి పోలేదు. అయ్యో, ఉప్పు కాగితంతో గీకేదెట్లా? అని మనం గమ్మున ఉంటే మెరుగైన కొయ్యలు తయారయ్యేవి కావు. వాటిని గీకడం ద్వారానే కొయ్య లోపలి నాణ్యత బయటికొచ్చింది. అలాగే నీ మంచి కోసం ప్రిన్సిపాల్‌ నీలోని తప్పుఒప్పులు చెప్పారు. నీవు వాటిని వ్యతిరేకంగా అర్థంచేసుకుని, సెంటర్‌కి వెళ్లడమే మానుకున్నావు. అలా కాకుండా వాటిని సవరించుకుని, సాధన చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.
'ఒక్కటి గుర్తుంచుకో.. నీ బాగు కోసమే ఆయన నిన్ను తిట్టాడు. నీలోని అంతర్గత శక్తులను బయటికి తీయడానికే ఆయన కొంచెం కఠినంగా వ్యవహరించి ఉంటాడు' అని వివరించాడు.
'నిజమే నాన్నా, కంప్యూటర్‌ నేర్చుకోకపోతే కిటికీలు లేని ఇంటిలో కూర్చోవడమేనని నా మిత్రులు చెప్పారు. రేపటి నుంచీ వెళ్తాను' అని బదులిచ్చాడు.
పక్కనే ఉండి అన్నీ వింటున్న అమ్మ 'బాబూ, ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. గీకేటప్పుడు మంటకి కొయ్య బాధపడి ఉండవచ్చు. అయితే కొద్దిసేపు ఆ మంటను, నొప్పిని భరించడం వల్లనే దానికి గుర్తింపు వచ్చింది. ఇక్కడ లాభం పూర్తిగా కొయ్యకే కానీ, ఉప్పు కాగితానికి ఏమీ లేదు. అలాగే విద్య విషయంలో కూడా అంతే. భవిష్యత్తు ఫలాలను అనుభవించేది విద్యార్థి మాత్రమే, కొట్టి, తిట్టి విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు కాదు' అని చెప్పింది. అమ్మ మాటలు పూర్తి కాకుండానే రవికుమార్‌ సైకిల్‌ తీసుకుని, సర్రున కంప్యూటర్‌ సెంటర్‌ వద్దకి బయలుదేరాడు.
 

ఆర్‌ సి కృష్ణస్వామిరాజు
93936 62821