Jul 10,2022 12:47

ఆదివారం ఉదయం టీవీలో కార్టూన్‌ షో చూస్తూ కూర్చున్నాడు కౌశల్‌. వాళ్ల నాన్నమ్మ రెండుసార్లు పిలిచినా, కౌశల్‌కు వినిపించడం లేదు. ఏడో తరగతి చదువుతున్న కౌశల్‌ టీవీకి అతుక్కుపోవడం ఆమెకు నచ్చలేదు. 'టీవీ ఆపేసేదా?' అన్నది, చివరికి. 'వద్దు.. వద్దు' కంగారుగా అన్నాడు కౌశల్‌.
'ఒక్కకౌశల్‌ మాత్రమే కాదు. ఇప్పుడు పిల్లలంతా ఇలాగే ఉన్నారు.' అని నిట్టూర్చి, 'టీవీని చూడడం తగ్గించమని ఏ రకంగా చెప్తే కౌశల్‌ వింటాడూ?'.. అని ఆలోచిస్తూ ఉండిపోయిందామె. కౌశల్‌ చదువులోనూ ఆటల్లోనూ ఫస్టే.. దాదాపు, నలభై ప్రైజులు వ్యాసరచన పోటీల్లోనూ, చిత్రలేఖనంలోనూ, ఎస్సే రైటింగ్‌లోనూ వచ్చాయి.
ఆ రోజు సాయంకాలం, కౌశల్‌ వాళ్ల నాన్నమ్మ కౌశల్‌ను గ్రంథాలయానికి తీసుకెళ్లింది. అక్కడ హాల్లో చుట్టూరా చాలా పుస్తకాలున్నాయి. మధ్యలో టేబుల్స్‌ ముందు చాలా మంది కుర్చీల్లో కూర్చొని, చదువుకుంటూ ఉన్నారు. అక్కడ పుస్తకాలన్నీ చూసి 'ఇన్ని పుస్తకాలు కష్టపడి ఇక్కడికొచ్చి చదవడం ఎందుకు నాన్నమ్మా? హాయిగా ఇంట్లో కూర్చొని మన 'లాప్‌ టాప్‌' ఓపెన్‌ చేస్తే 'గూగుల్‌'లో కావాల్సినన్ని పుస్తకాలుంటాయి కదా!' అన్నాడు కౌశల్‌ చిన్నగా నాన్నమ్మతో.
'ఉంటాయి కానీ, టీవీ, లాప్‌టాప్‌, మొబైల్‌ ఏదైనా ఎక్కువసేపు చూస్తే, ఆ కిరణాల వల్ల కళ్లకు ఎక్కువగా శ్రమ కలిగి, త్వరగా కళ్లద్దాలు వేసుకోవాల్సి వస్తుంది. అదే పుస్తకం చదివితే మనం కళ్లు కొద్దిసేపు పక్కకు తిప్పినా, మళ్లీ మనం పుస్తకంలో ఆ విషయాన్ని వెతికి, పూర్తిగా చదవడానికి శ్రమ అనిపించదు. కనుక కళ్లు ప్రశాంతంగా ఉంటాయి. అందుకని ఎక్కువగా పుస్తకాలే చదవాలి!' అని వివరించిందామె.
'పుస్తకాలు చదవడం వల్ల ఇంకా విజ్ఞానం పెరుగుతుంది. రాసే నైపుణ్యం, ఆలోచనా శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు వస్తుంది. పిల్లలు చందమామ, బాలమిత్ర, బాలభారతం, పంచతంత్ర లాంటి పుస్తకాలల్లో కథలు చదవడానికి ఆసక్తిని కలిగిస్తూ, అ కథల్లోని నీతిని కూడా తెలియజేస్తాయి. పెద్దలను గౌరవించడం, క్రమశిక్షణ కూడా అలవాటవుతాయి' అంది.
'కానీ, మనం చూసిందే బాగా గుర్తుంటుందట కదా ? మా టీచర్‌ చెప్పారు,' అన్నాడు కౌశల్‌.
'నిజమేకానీ, ఆ చూసేదానికి కూడా మితం ఉంటుంది కదా?' అంటూ వాళ్ల నాన్నమ్మ 'ఇతర భాషల పుస్తకాలు కూడా చదవడం వల్ల వారి సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి,' అని చెప్తూ.. ప్రత్యేకంగా పిల్లల కోసం ఉంచిన పుస్తకాల దగ్గరకు తీసుకెళ్లింది.
కౌశల్‌ అక్కడ ఆంగ్లంలో, తెలుగులో ఉన్న చిన్నచిన్న కథల పుస్తకాలు రంగు రంగుల బొమ్మలతో ఉండటం చూసి ఉత్సాహంగా, 'ఇవన్నీ మనం తీసుకొని, చదువుకోవచ్చా.. అన్నాడు నెమ్మదిగా. 'చక్కగా చదువుకోవచ్చు' అని, వాళ్ల నాన్నమ్మ ఒక చిన్న పుస్తకం తీసి కౌశల్‌కు ఇచ్చి, 'ఇది తీసుకుందామా' అంది. సంతోషంగా తల ఊపాడు, కౌశల్‌.
'ఇక నుంచి టీవీ చూడటం కన్నా పుస్తకాలు చదవడం ఎంతో మేలు.. అని కౌశల్‌ నెమ్మదిగా తెలుసుకుంటాడు' అని ఆమెకు నమ్మకం కుదిరింది.
 

శైలజ కరణం
lakshmisailaja4643@gmail.com