ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉండి. తాజాగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొత్త నిబంధన పెట్టారు. డ్యూటీ సర్టిఫికెట్ ఉంటేనే జీతం ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో విడుదలైన ఈ ఉత్తర్వులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీంతో వార్డు సచివాల ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా... ఇతర శాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికెట్ నియమాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని మొత్తం ఉద్యోగులందరికీ వర్తింపజేయడంపై వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 133 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 1,100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారికి ఇప్పటికే బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకుంటున్నారు. అయితే, డ్యూటీ సర్టిఫికెట్ ఉన్న వారికే వేతనాలు ఉంటాయని అడిషనల్ కమిషనర్ పేరుతో గత నెల 21న సర్క్యులర్ జారీ అయింది. ప్రత్యేకాధికారులు ప్రతి నెలా 21, 22 తేదీల్లో సచివాలయ సిబ్బందికి డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తనిఖీల సందర్భంలో కొందరు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఆసరాగా తీసుకుని కొందరు ప్రత్యేకాధికా రులు సచివాలయ సిబ్బందిని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విధులు సక్రమంగా నిర్వహించేందుకే : పివి.రామలింగేశ్వర్, అడిషనల్ కమిషనర్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్
వార్డు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేసినా అధికారుల తనిఖీల సందర్భాల్లో సచి వాలయంలో ఉండడం లేదు. దీంతో, కొందరికి మెమోలు ఇచ్చాం. ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించేం దుకే డ్యూటీ సర్టిఫికెట్ నిబంధన పెట్టాం. ఆ బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించాం. ఎవరైనా ప్రత్యేకాధికారులు బెదిరింపులకు పాల్పడుతుంటే ఆ సమాచారాన్ని మాకు ఇస్తే చర్యలు తీసుకుంటాం. ఈ విధానం 60 రోజుల నుంచి అమలవుతోంది. కొందరు కావాలనే ఇప్పుడు దీన్ని వైరల్ చేస్తున్నారు.
తక్షణమే ఉపసంహరించుకోవాలి : సిఐటియు
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తోన్న వార్డు సచివాలయ ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తేనే జీతాలు వేస్తామని జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్య క్షులు డి.గౌస్ దేశారు, జిల్లా అధ్యక్షులు పిఎస్.రాధా కృష్ణ, జిల్లా నాయకులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మిక కర్షక భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తేనే జీతాలు ఇస్తామని సర్కులర్ ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగు లను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి మున్సిపల్ అధికారులు తీసుకున్న చర్యని విమర్శించారు. ఏ ఉద్యోగి అయినా ఆన్ డ్యూటీలో డ్యూటీ ప్లేస్‌లో లేకపోతే అలాంటి వారికి మెమోలు జారీ చేయవచ్చు, లేదంటే సస్పెండ్ చేయవచ్చని. అలాకాకుండా అందరినీ కలిపి ఒకే గాటన కట్టేసి ఈ రకంగా సర్కులర్ ఇవ్వడం తగదన్నారు.










