May 16,2023 13:21

విజయవాడ రూరల్‌ : విజయవాడ రూరల్‌ మండలం పాతపాడు, నున్న, మంగళాపురం గ్రామాలలో ఉపాధి హామీ సమస్యలు అధ్యయనం కోసం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వరరావు పని ప్రదేశాలు వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. మంగళవారం కూలీలు మాట్లాడుతూ ... ఎర్రటి ఎండలో ఉదయం ఆరు గంటల నుండి పనిచేస్తున్నప్పటికీ రెండు పూటలా ఫోటో అప్డేట్‌ పేరుతో 12 గంటల వరకు ఎలాంటి సౌకర్యాలు లేకుండానే ఎండలో గడపవలసి వస్తుందని వాపోయారు. వేతన బకాయిలు చాలామందికి రావాలని, జనవరి నుండి మే నెల 13 వ తారీఖు వరకు దాదాపుగా 14 వారాలు బకాయిలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఒకవారం మార్చిలో ఒకవారం ఏప్రిల్‌ లో ఒక వారం మాత్రమే కూలీ డబ్బులు ఎకౌంట్లో పడ్డాయని, మిగతా చేసిన పనికి నేటికీ డబ్బులు పడలేదని అధికారులను అడుగుతుంటే మీ బ్యాంకు ఎకౌంట్లు చెక్‌ చేసుకోండి మీకు రెండు ఎకౌంట్లో ఉన్నాయి ఏ అకౌంట్‌ లో పడ్డాయో తెలుసుకోండని అంటున్నారనీ చెప్పారు. బ్యాంకు స్టేట్‌ మెంటు కోసం, బ్యాంకులు చుట్టూ తిప్పుతున్నారని సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారనీ. ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కంటతడిపెట్టారు. అంతేకాకుండా చేసిన పనికి ఫే స్లిప్‌ ఇస్తే ఏ వారం ఎంత పడినదో తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందని, ఆటోల మీద 10 - 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నామని ఆటోకి రానుబోను సుమారు 40 రూపాయలు చార్జీ అవుతున్నదని, తమకు వచ్చే డబ్బుల్లో వారానికి రూ.800 నుండి రూ.1200 లోపు మాత్రమే పడుతుందని, ప్రభుత్వం ప్రకటించిన రూ.272లు , సమ్మర్‌ అలవెన్సులు, ఇతర అలవెన్సులు కలుపుకుని రూ.300 రావాల్సి ఉండగా, కేవలం రూ.200లు లోపు వస్తున్నాయని కొందరు తెలియజేశారు. అధికారులు వెంటనే స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, మెట్లు ఆరేపల్లి రంగమ్మ, విజయలక్ష్మి, ఏసుమ్మ, దుర్గా, భారతి ,రెడ్డి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు