
ప్రపంచవ్యాప్తంగా 'పెట్టుబడి' రాకాసికి తలొగ్గి పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న పాలకులకు పూర్తి భిన్నమైన మార్గంలో బ్రెజిల్ అధ్యక్షులు, వర్కర్స్ పార్టీ నేత లూలా డ సిల్వా నడుస్తున్నారు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రత్యేకించి అమాయకులైన ఆదివాసీల సంక్షేమం విషయంలో మడమ తిప్పని నేతగా లూలా ప్రఖ్యాతినొందారు. ప్రపంచ ఊపిరితిత్తులుగా భావించే అమెజాన్ అడవుల్లో అక్రమ ఖనిజ తవ్వకాలకు పాల్పడుతున్నవారిపై యుద్ధం ప్రకటించారాయన. ఇదేమీ చిన్న విషయం కాదు. అమెరికా కీలుబొమ్మ బోల్సోనారో నేతృత్వంలోని గత ప్రభుత్వం అమెజాన్ అడవుల్లో అక్రమ బంగారం తవ్వకాలకు లాకులెత్తి అక్కడి మూలవాసులైన యనోమామి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. అక్రమ ఖనిజ తవ్వకాలను అడ్డుకునేందుకు యత్నించిన యనోమామి ప్రజలపై మైనింగ్ మాఫియా క్రూరమైన దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో అమెజాన్ అడవుల విధ్వసమూ జరిగిపోయింది. పరిసర ప్రాంతాల్లోని యురారికో ఎరా వంటి నదీ జలాలన్నీ ఖనిజ వ్యర్థాలతో కాలకూట విషంగా మారిపోయాయి. యనోమామి ప్రజలు అంతుచిక్కని వ్యాధుల బారినపడ్డారు. పోషకాహారలేమితో, నయం కాని రుగ్మతలతో ఆ ప్రాంతం నిస్తేజంగా మారింది. ఇంతటి విధ్వంసం యథేశ్ఛగా సాగిపోవాడానికి అక్రమ మైనర్లకు అండగా నిలిచిన అప్పటి బోల్సోనారో ప్రభుత్వమే ప్రధాన కారణం. అక్రమ మైనింగ్ కారణంగా అమెజాన్ అడవుల్లో మానవ హననం జరిగిపోతోందంటూ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంతో సహా అనేక పర్యావరణ, పౌర హక్కుల ఏజెన్సీలు నెత్తినోరూ మొత్తుకున్నా.. దున్నపోతుపై వర్షం పడిన చందంగా బోల్సోనారో వ్యవహరించారు.
పోర్చుగీసులో గ్యారిపేయిరస్‌గా పిలుచుకునే అక్రమ బంగారు ఖనిజ తవ్వకందార్లు 1970, 80లలోనే యనోమామి భూముల్లోకి చొరబడి ఖనిజ తవ్వకాలను యథేచ్ఛగా సాగించారు. ఆ తర్వాత 1990లలో యనోమామి ప్రజల భూభాగాన్ని 96 లక్షల హెక్టార్లకు కుదించి మైనింగ్ నుంచి ఆ ప్రాంతాన్ని మినహాయించారు. లక్షలాది మంది అక్రమ ఖనిజ తవ్వకం దార్లను యనోమామి భూభాగం నుంచి వెళ్లగొట్టారు. 2018 ఎన్నికల్లో పచ్చి మితవాద నాయకుడు బోల్సోనారో అధ్యక్షుడవ్వడంతో అక్రమార్కులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. కుదించిన యనోమామి భూభాగంలోనూ ఖనిజ తవ్వకాలు యధేచ్ఛగా సాగిపోయాయి. అత్యంత విలువైన ఖనిజ సంపదను మూలవాసులకు ఎలా వదిలేస్తామంటూ? బోల్సోనారో నిర్లజ్జగా ప్రకటించారు. దీంతో అమెజాన్ అడవుల్లో మారణహోమం సాగింది. 'ఆదివాసీల నెత్తుటి రుచి మరిగిన ప్రభుత్వం'గా యనోమామి ప్రజలు బోల్సోనారో సర్కార్‌పై పోరు సల్ఫారు. వారికి లూలా డ సిల్వా అండగా నిలిచారు. పాశ్చాత్య దేశాల కుట్రలతో అక్రమ కేసుల్లో జైలు పాలైన లూలా గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. ఈ ఏడాది జనవరి 1న బాధ్యతలు చేపట్టినదే తడవుగా ప్రజా సంక్షేమాలు ఒక వైపు కొనసాగిస్తూనే సహజ వనరులను, పరిశ్రమలను జాతీయం చేస్తూ సాహోరే బ్రెజిల్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. బోల్సోనారో వినాశకర విధానాలన్నిటినీ క్రమంగా రద్దు చేసి ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నారు. పెట్టుబడి మత్తులో జోగుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భజన చేస్తున్న కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలకు వామపక్ష ప్రత్యామ్నాయ దీపస్తంభంగా నిలుస్తున్నారు. 'అక్రమ మైనింగ్ పరిసమాప్తి అయ్యేదాక విశ్రమించ'బోమన్న నినాదంతో సమరభేరీ మోగించి పర్యావరణ పరిరక్షణ పట్ల, ఆదివాసీ ప్రజల పట్ల వామపక్షాలకున్న నిబద్ధతను చాటి చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ గురించి ప్రపంచ మానవాళికి ఒకవైపు నీతులు చెబుతూ ఇంకోవైపు నుంచి గోతులు తవ్వుతున్న అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు బ్రెజిల్ చేపట్టిన ఆపరేషన్ ఒక గుణపాఠం. హిండెన్‌బర్గ్ నివేదికతో కలుగులోపడిన ఎలుకలా గిలగిలకొట్టుకుంటున్న గౌతమ్ అదానీ లాంటి కార్పొరేట్ పెద్దలకు కోస్తా తీరాన్ని, ఏజెన్సీ ప్రాంతాన్ని ఇంధన, ఖనిజ తవ్వకాల కోసం కారుచౌకగా దోచిపెడుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్ కానీ, ఇటు వేలాది ఎకరాలను అప్పనంగా కట్టబెడుతున్న రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కానీ బ్రెజిల్ వామపక్ష ప్రభుత్వ సాహసోపేత చర్యల నుంచి నేర్వాల్సిన పాఠాలు చాలానే వున్నాయి. పర్యావరణహితం కోసం, ఆదివాసీల మనుగడ కోసం బ్రెజిల్ సాగిస్తున్న పోరాటాన్ని మనసారా అభినందిద్దాం.