Jul 06,2023 15:28

ప్రజాశక్తి - రాంబిల్లి(అనకాపల్లి జిల్లా) :అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని సాహితి ఫార్మాలో గత నెల 30న జరిగిన భారీ పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు గురువారం కెజిహెచ్‌లో మృతి చెందారు. దీంతో ప్రమాద మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుడు సంభవించిన కొద్దిసేపటికే గత శుక్రవారం ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన సమ్మంగి అప్పారావు, సోమవారం ఒడిశాకు చెందిన రామేశ్వర్‌ ప్రయివేటు ఆస్పత్రుల్లో మృతి చెందారు. గురువారం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి సింగంశెట్టి నూకినాయుడు, నక్కపల్లి మండలం రేబాకకు చెందిన ఎస్‌ రాజబాబు చనిపోయారు. వీరికి మృతికి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది.
పరిహారం కోసం ఒప్పందం
నూకినాయుడు కుటుంబానికి సాహితీ ఫార్మా యాజమాన్యం గురువారం రూ.లక్ష పరిహారం అందజేసింది. ఈ నెల 12న రూ.8 లక్షలు, ఆగస్టు 10న రూ.25 లక్షలు ఇచ్చేందుకు రాతపూర్వకంగా అంగీకరించింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము, మండల నాయకులు రామకృష్ణ, రాంబిల్లి వైస్‌ ఎంపిపి కసిరెడ్డి నర్సింగరావు, లాలం రాజు, కాంట్రాక్టర్‌ రమేష్‌, మురళీకృష్ణ, మృతుని భార్య లలిత, కుమారుడు కార్తీక్‌, యాజమాన్యం తరుఫున ఎస్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.