ఒక ఊరిలో పెద్ద వేపచెట్టు ఉండేది. ఎల్లప్పుడూ పెద్ద పెద్ద కొమ్మలతో, పచ్చని ఆకులతో చక్కగా గాలికి ఆనందంగా ఊగుతూ ఉండేది. అనేకానేక పక్షులు, కీటకాలు, చీమలకు ఆ చెట్టు ఆవాసం అయ్యింది. పక్షులన్నీ గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలను చేసేవి. తేనేటీగలు తేనెపట్టు కట్టేవి. చీమలు తొర్రలు చేసుకుని జీవించేవి. పిల్లలు ఊయల కట్టుకుని, ఊగేవారు. ఇలా ఆ వేపచెట్టు అందరికీ ఆవాసాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉండేది. ఆ చెట్టుపైన, కింద ఉన్న జీవులన్నీ కలసిమెలసి జీవిస్తూ ఐకమత్యంగా ఉండసాగాయి.
ఒకరోజు ఆ వేపచెట్టుకు ఒక దుర్బుద్ధి కలిగింది. తన రెమ్మలు, కొమ్మలు కలిగి ఉండటం వల్లనే కదా ఇవన్నీ ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాయి అని ఈర్ష్య పెంచుకుంది. ఎలాగైనా వీటినన్నింటినీ తరిమేయాలని పథకం వేసింది. అటుగా గొడ్డలి పట్టుకు వెళుతున్న వీరయ్యను పిలిచి 'నీకు వంటకు కట్టెలు కావాలన్నావు కదా! నా కొమ్మలన్నింటినీ నరుక్కుని పో' అని చెప్పింది. అసలే కరువు కాలం కావడంతో వీరయ్య తన పంట పండిందని మురిసిపోతూ గొడ్డలితో కొమ్మలన్నీ నరుక్కుని వెళ్ళాడు.
చెట్టు బోసిగా అవడంతో జీవులన్నీ రావడం మానుకున్నాయి. దాంతో చెట్టు ఆనందపడింది. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. మోడుగా ఉన్న చెట్టును చూసి వీరయ్యకు అత్యాశ కలిగింది. చెట్టు మొత్తాన్ని కొట్టేస్తే తను కొత్తగా కడుతున్న ఇంటికి కలపగా ఉపయోగపడతుందని గొడ్డలితో వచ్చాడు. అది చూసి చెట్టు కలవరపడింది. తనని చంపొద్దని ప్రాథేేయపడింది. అయినా వీరయ్య జాలి చూపలేదు. చెట్టు ప్రాథేయ పడటం విని, అటుగా వెళుతున్న తేనెటీగలు ఇన్నాళ్ళు మనకు ఆవాసాన్ని ఇచ్చిన చెట్టు అపాయంలో ఉందని గ్రహించి, వెంటనే వీరయ్యపై దాడి చేసి.. తరిమేసాయి.
జీవులన్నింటిపై తను అసూయపడినప్ప టికీ అవి తనపై చూపిన వాత్సల్యానికి చెట్టు సిగ్గుపడింది. వాటిని తరిమేయడం వలనే తనకీ దుస్థితి కల్గిందని పశ్చాత్తాపపడింది.
వర్షాకాలం రాగానే చెట్టు చిగురించింది. మళ్లీ కొమ్మలు వచ్చాయి. వెంటనే చెట్టు జీవులన్నింటికీ క్షమించమని కోరింది. ఇక నుంచి తనతోనే ఉండమని కోరింది. అందరం కలసి సహజీవనం సాగిద్దామని వేడుకుంది.
జీవులన్నీ సంతోషంగా యథావిధిగా గూళ్ళు కట్టుకున్నాయి. తేనెటీగలు తేనెపట్టు, చీమలు పుట్టలు పెట్టుకున్నాయి. అందరూ కలసి హాయిగా సహజీవనం సాగించారు.
కలసి ఉంటే కలదు సుఖం అని నిరూపించాయి.
కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791239