Aug 13,2023 15:06

గండకీ నదీ తీరాన ఉన్న గురుకులంలో గురువైన ఏనుగు ఒకరోజు తన శిష్యుడు యువసింహాన్ని పిలిపించింది. 'నాయనా! నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది. కాబోయే రాజుకి కావలసిన సకల విద్యలూ నేర్పించాను. మంచి విద్యార్థిగా ప్రశంసలు అందుకున్నావు. ఇక ప్రజారంజకుడైన పాలకుడిగా మన్ననలు పొందాలని దీవిస్తున్నాను' అంది వాత్సల్యపూరితంగా.
యువ సింహం గురువు పాదాలంటి 'మీ అభీష్టం మేరకు వర్తిస్తాను. సెలవు గురుదేవా!' అంది.
ఏనుగు కొన్ని క్షణాలు ఆలోచించి 'ఒక్క క్షణం ఆగు నాయనా!' అంది.
యువసింహం సందిగ్ధంగా చూసింది.
ఏనుగు దీర్ఘంగా నిశ్వసించి 'ఒక్క పాఠం మాత్రం మిగిలిపోయింది. అది కూడా నేర్చుకుంటే నీ విద్య సంపూర్ణమవుతుంది' అంది.
యువసింహం జిజ్ఞాసతో 'అది కూడా బోధించండి గురుదేవా! వెంటనే వంటబట్టించు కుంటాను' అడిగింది.
ఏనుగు తొండం అడ్డంగా ఊపి 'ఈ సృష్టిలో ప్రతిప్రాణి దగ్గరా మనం అభ్యసించదగిన ఏదొక విద్య ఉంటుంది. కుశాగ్రబుద్ధితో దాన్ని గ్రహించగలగాలి. నువ్వు తక్షణమే చీమను కలుసుకో' అని పంపించింది.
గురువాజ్ఞ ప్రకారం యువసింహం ముందుకు సాగింది. ఒకచోట చీమల పుట్ట కనిపించింది. సంతోషంగా ఒక చీమని సమీపించి, నమస్కరించింది. 'మా గురుదేవులు మీ దగ్గర విద్యాభ్యాసం చేయమని ఆజ్ఞాపించారు. మీ వద్ద ఏదో ప్రత్యేకమైన విద్య ఉందట. దయతో నన్ను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్ధిస్తున్నాను' అని వేడుకొంది.
చీమ ఒక్క క్షణం ఎగాదిగా చూసి, 'భూమ్మీద అతి చిన్న ప్రాణిని నేను. గొప్ప విద్యలేవో నాకు తెలుసని భ్రమపడకు వెళ్ళు' అంటూ కదిలింది. ఆ మాటలకు యువసింహం మనసు చివుక్కుమన్నా వెంటనే తేరుకుంది. ఏమీ లేకపోతే గురువుగారు పంపరని సమాధాన పడింది. విద్య నేర్చుకునే వరకూ వదలకూడదని తీర్మానించుకుని, చీమ వెంటపడింది.
పిపీలికం విసుక్కున్నా నొచ్చుకోక అనుసరించింది. చాలాసేపటి తర్వాత యువ సింహానికి చీమ దగ్గరున్న విద్య అవగతమైంది. చేతులు జోడించి 'గురుదేవా! మీ విద్య నాకు అబ్బింది. నాకు సెలవిప్పించండి' అని ప్రార్థించింది.
చీమ 'ఏమి తెలుసుకున్నావు నాయనా?' అంది చిరునవ్వుతో.
యువ సింహం వినయంగా 'మొదటిది క్రమశిక్షణ. మీరు వరుస క్రమంలో వెళ్ళే విధానం అద్భుతంగా ఉంది. ఐక్యత అపురూపం. పరస్పర సహకారం అనితరసాధ్యం. రెండు మీరు కాలాన్ని వృథా చేయటం లేదు. నాతో మాట్లాడేటప్పుడు సమయం వృథా అవుతోందని మీరు భావించటం నేను గుర్తించాను. మూడు నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. 'కష్టేఫలి'ని చూపించారు. నాలుగు ముందుచూపు. రేపటికోసం మీరు కూడబెట్టే విధానం శిరోధార్యం. ఇంకా..' అంటుంటే చీమ ఆపింది.
'ఉత్తమ విద్యార్థివి నాయనా!' అని మెచ్చుకుంది. 'నీకిక తిరుగులేదు. బయలుదేరు' అంది.
'గురుదక్షిణగా స్వీకరించండి' అని యువసింహం తన ఆహారంలో కొంతభాగం అందించింది.
చీమ దాన్ని తిరస్కరించి, 'స్వశక్తితో సంపాదించాలి. ఆయాచితాలకి ఆశ పడకూడదు' అంది.
'అద్భుతం గురుదేవా! ఇదే నా చివరి పాఠం!' అంది పులకరిస్తూ.
'లేదు నాయనా! మరణించే వరకూ జీవితం ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది. మనం నిత్య విద్యార్థిగా ఉండాలి. గురు ముఖతః ఆఖరి పాఠం ఏమిటంటే 'అభ్యసించిన దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆ విద్యకి సార్ధకత' అంది.
యువసింహం గురువులకు అంజలి ఘటించి, ఉజ్వల భవిష్యత్తును ఊహిస్తూ, సంతోషంగా ఇంటి దారి పట్టింది.

కౌలూరి ప్రసాదరావు
9346700089