ఆదాము డొక్కలో ఎముక ముక్కతీసి చేసినా
నువ్వోసగం నేనోసగం అని ఎంతచెప్పినా
అర్ధనారీశ్వరులుగా అర్థాలు చెప్పినా
ఆలుమగలుగా ఆదర్శాలు చెప్పుకున్నా
ఆడ-మగలేగా ప్రాతిపదిక
భూమ్యాకాశాలేగా పోలిక
అన్నీ అలల మీద రాతలేగా
అనాదిగా జరుగుతున్న ద్రోహమే కదా
ఆరోపణలు, అభియోగాలు
ఇంకాస్త ముందుకెళ్లి నిస్సిగ్గు వ్యవహారాలు
నీలాపనిందలు ఆడవాళ్ల పైనేగా
ఇక మంతనాలు వద్దు
మధ్యస్థాలు వద్దు
నంగి మాటలు వద్దు
నర్మగర్భం తూటాలు వద్దు
ఆధిపత్యాలు వద్దు అభిజాత్యాలు వద్దు
బహిరంగ ప్రకటనలు వద్దు
అతిరహస్యాలు వద్దు
ఆరుతూ రగులుతూ వెలుగుతూ
చలికుంపటిలో
అప్పుడప్పుడు పోగేసుకున్న
చలిమంటలాంటి
నులివెచ్చని జ్ఞాపకాలు కూడా చెరిగిపోయి
ఇంకేమి మిగిలి ఉంది
శూన్యాకాశం కింద
కొలవలేని మైదానంలో
ఒంటరివై పరిగెడుతూ నువ్వు
లెక్కలేనంత విషాదం
మోస్తున్న స్మశానమై నేను..
-లోసారి సుధాకర్,
99499 46991