Sep 06,2022 06:48

నిజానికి, కార్మికుల వేతనాలకు, ద్రవ్యోల్బణానికి ఎంతమాత్రమూ సంబంధం లేదు. ప్రస్తుతం అమెరికాలో ఏర్పడిన ద్రవ్యోల్బణానికి కారణం అక్కడి పెట్టుబడిదారుల లాభాల వాటాలు ఆకాశాన్నంటేలా పెరగడమే. అయితే, ఆ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మాత్రం కార్మికుల వేతనాల వాటాను కుదించడమే పరిష్కారంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణంతో చాలా తీవ్రమైన మార్పులు కలుగుతున్నాయి. ఈ ద్రవ్యోల్బణం సకల కార్మికులనూ దెబ్బ తీస్తోంది. పర్మనెంటు కార్మికులు గాని, పాక్షికంగా ఉపాధి పొందుతున్నవారు కాని, పనులు దొరకకుండా ఉన్నవారు కాని, ఎవరికైనా ఈ ద్రవ్యోల్బణం దుర్భరమే. అటు తూర్పు నుండి ఇటు పడమర వరకూ...అన్ని దేశాలలో, అన్ని తరహాల కార్మికుల నడుమ ఉండిన వైరుధ్యం చప్పబడి, వారి మధ్య పోటీని తగ్గిస్తోంది. పెరుగుతున్న ధరల ఫలితంగా ఏర్పడుతున్న దుర్భర పరిస్థితుల వలన కార్మికులందరిలో సమరశీలత పెరుగుతోంది.

ద్రవ్యోల్బణం రెండు తరహాలు అని, ఒకటి డిమాండ్‌ అధికమైతే ఏర్పడేది, రెండవది ఉత్పత్తి ఖర్చులు పెంచినందువలన ఏర్పడేది అని ఆర్థికవేత్తలు వివరిస్తారు. ఒకటో, రెండో కీలకమైన రంగాల్లో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో సాగిస్తూ, ఆ రంగాల్లో ఇంక అదనంగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సరుకులకు అదనంగా డిమాండ్‌ ఏర్పడితే అప్పుడు మొదటి తరహా ద్రవ్యోల్బణం కలుగుతుంది. యుద్ధకాలంలో వచ్చిన ద్రవ్యోల్బణం ఇందుకు ఒక సరైన ఉదాహరణ. మన దేశంలో, నయా ఉదారవాద విధానాల అమలు చేపట్టక మునుపు కాలంలో, అంటే ప్రభుత్వ నియంత్రణతో, ప్రత్యక్ష జోక్యంతో ఆర్థిక వ్యవస్థ నడుస్తున్న కాలంలో తరచూ ద్రవ్యోల్బణం ఏర్పడేది. పంటల దిగుబడి తగ్గి, ప్రజలు కొనుగోలు చేయగలిగిన మేరకు కూడా వారికి ఆహారధాన్యాలు సరఫరా చేయలేని పరిస్థితులు ఏర్పడేవి. ప్రజల డిమాండ్‌ మేరకు సరఫరా లేనందువలన ఆ సరుకుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీసేది.
      ఇక రెండో తరహా: కీలక రంగాల్లో పూర్తి సామర్ధ్యం మేరకు ఉత్పత్తి జరగని సందర్భాలలో, అవసరమైన మేరకు ఉత్పత్తిని ఇంకా పెంచుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు సైతం ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఉత్పత్తి క్రమంలో ఉన్న కొన్ని వర్గాలు ఉత్పత్తిలో తమ వంతు వాటాకు ఎక్కువ ప్రతిఫలం రాబట్టడానికి ప్రయత్నించినప్పుడు, తక్కిన వర్గాలు తమ వంతు ప్రతిఫలాన్ని తగ్గించుకోడానికి సిద్ధంగా లేనప్పుడు ఆ రెండు వర్గాల మధ్యా జరిగే టగ్‌-ఆఫ్‌-వార్‌ ఫలితంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
      ఏ తరహాలో ద్రవ్యోల్బణం ఏర్పడినప్పటికీ, దానిని అదుపు చేయడానికి కార్మికవర్గాన్ని బలి చేయడం ఎప్పుడూ ఒక మార్గంగా ఉంటూనే వచ్చింది. పెట్టుబడిదారీ సమాజంలో అనివార్యంగా ద్రవ్యోల్బణ అదుపు కోసం కార్మిక వర్గాన్నే బలి చేస్తారు. డిమాండ్‌ అధికమైనందు వలన ద్రవ్యోల్బణం ఏర్పడిన సందర్భాలలో కార్మిక వర్గపు వేతనాలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచకుండా స్తంభింపజేసి, తద్వారా వారి వినిమయ శక్తిని తగ్గిస్తారు. అంటే, వారి డిమాండ్‌ తగ్గిపోతుంది. అప్పుడు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. ఇక రెండో తరహా ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు కార్మికవర్గం ఎక్కువ ప్రతిఫలాన్ని రాబట్టడానికి అవకాశం లేకుండా వారి బేరసారాల శక్తిని దెబ్బ తీస్తారు. అప్పుడు యజమానులతో జరిగే టగ్‌-ఆఫ్‌-వార్‌లో కార్మికులు బలహీనపడి ఓడిపోతారు. మొత్తం మీద ద్రవ్యోల్బణానికి కారణం ఏదైనప్పటికీ, పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలను పెరగనివ్వకుండా చేయడమే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే మందుగా పాలకవర్గాలు పరిగణిస్తారు.
     ఇదే తరహాలో ముడిసరుకుల ఉత్పత్తిదారులకు లభించే వాటాను తగ్గించడం ద్వారా తమ దేశాల్లో సంభవించే ద్రవ్యోల్బణాన్ని సంపన్న పశ్చిమ దేశాలు అదుపు చేయడానికి పూనుకుంటాయి. ముడి సరుకుల ఉత్పత్తిదారులు ప్రధానంగా మూడో ప్రపంచ దేశాల్లో ఉంటారు. అంటే, మూడో ప్రపంచ దేశాల ప్రజలను బలిపెట్టి సంపన్న పశ్చిమ దేశాలు తమ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాయి. ఐతే, ఈ పద్ధతిని విచ్చలవిడిగా అమలు చేసినందువలన ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ముడిసరుకుల ఉత్పత్తుల ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి (ఉత్పత్తిలో ఆ ముడిసరుకుల ప్రాధాన్యత తగ్గిపోయినందు వల్లనే ఈ విధంగా వాటి ధరలు పడిపోయాయి అని అనుకుందామా అంటే, ఆ ముడి సరుకుల ప్రాధాన్యత ఏమాత్రమూ తగ్గలేదు). అందుచేత వాటి ధరలను ఇంకా తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించడం సాధ్యం కావడం లేదు. అందుచేత ఏ మేరకు సాధ్యపడితే ఆ మేరకు ఇంకా ముడి సరుకుల ధరలను తగ్గించడానికి ప్రయత్నిస్తూనే, ప్రధానంగా కార్మిక వర్గపు వేతనాలను తగ్గించడం మీదనే కేంద్రీకరిస్తున్నారు.
    ఇలా కార్మికుల వేతనాలు తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి పూనుకుంటున్నారంటే, దానర్ధం కార్మికుల వల్లనే ఈ ద్రవ్యోల్బణం ఏర్పడుతోందని ఎంతమాత్రమూ భావించకూడదు. నిజానికి, కార్మికుల వేతనాలకు, ద్రవ్యోల్బణానికి ఎంతమాత్రమూ సంబంధం లేదు. ప్రస్తుతం అమెరికాలో ఏర్పడిన ద్రవ్యోల్బణానికి కారణం అక్కడి పెట్టుబడిదారుల లాభాల వాటాలు ఆకాశాన్నంటేలా పెరగడమే. ఐతే, ఆ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మాత్రం కార్మికుల వేతనాల వాటాను కుదించడమే పరిష్కారంగా భావిస్తున్నారు. అందుకోసంగాను, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచకుండా స్తంభింపజేస్తున్నారు. పెట్టుబడిదారుల లాభాల వాటా పెరిగిపోయినందువలన ఇప్పటికే కార్మికుల వాటా తగ్గిపోయింది. ఇప్పుడు వేతనాలను స్తంభింపజేయడం వలన అది మరింత తగ్గిపోతుంది. న్యాయంగా పెట్టుబడిదారుల లాభాల వాటాను తగ్గించాలి. కాని అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వు దగ్గర నుండి, ఉదార స్వభావులుగా పేరుపడ్డ ఆర్థికవేత్తల దాకా అందరూ కార్మికుల వేతనాలను మరింతగా కుదించడం ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం సాధ్యం అని భావిస్తున్నారు.
అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థలో ''ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే విధానం'' అంటే కార్మికుల వేతనాల వాటాను కుదించడమే అని అర్ధం. ఉదాహరణకు: వడ్డీ రేట్లను పెంచడం అనే చర్యను తీసుకోండి. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా బ్యాంకుల నుండి రుణాలను తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని అదుపు చేయడం వీలౌతుందని, తద్వారా డిమాండ్‌ పెరుగుదలను అదుపు చేసి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చునని చెప్తారు. కాని, బ్యాంకు రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తే ఆ ప్రభావం కేవలం విచ్చలవిడి ఖర్చును తగ్గించడానికే పరిమితం కాదు. పూర్తి స్థాయిలో పరిశ్రమల ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోకుండా నిరుత్సాహపరుస్తుంది. దాని పర్యవసానంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి.
     సరుకుల కొరత ఏర్పడిన కాలంలో సైతం వడ్డీ రేట్లను తగ్గించడం జరుగుతోంది. అందునా, ఈ కొరత అమెరికా, మిత్ర దేశాల స్వయంకృతం. రష్యా మీద ఆంక్షలు విధించినందువలన ఏర్పడిన కొరత ఇది (ఇటువంటి సందర్భాలలో సరుకుల కొరత తీర్చడానికి, ఉత్పత్తిని పెంచడానికి రుణాల లభ్యతను సరళతరం చేయాలి. అంటే వడ్డీ రేట్లను తగ్గించాలి. కాని దానికి బదులు వడ్డీ రేట్లు పెంచుతున్నారు). దీనివలన ద్రవ్యోల్బణం తగ్గవచ్చు. కాని నిరుద్యోగం పెరుగుతోంది. దాని ఫలితంగా కార్మికుల బేరసారాల శక్తి సన్నగిల్లుతోంది. సరుకుల కొరత లేని సమయాల్లో కూడా, పెట్టుబడిదారుల వాటాను పెంచుకున్నందువలన ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వడ్డీ రేట్లను పెంచి, నిరుద్యోగాన్ని, మాంద్యాన్ని పెంచుతున్నారు.
     ఐతే, ఇదేమంత తేలికగా జరిగే వ్యవహారం కాదు. నిరుద్యోగం పెరిగినంత మాత్రాన ఆటోమేటిక్‌గా కార్మికుల వేతనాలు తగ్గిపోతాయనుకోరాదు. నిరుద్యోగం వలన కార్మికుల బేరసారాల శక్తి బలహీనపడుతుందన్నమాట వాస్తవం. కాని, అటువంటి సందర్భాల్లో కూడా, తమ జీతభత్యాల తగ్గింపును కార్మికులు ఏ ప్రతిఘటనా లేకుండా అంగీకరిస్తారా? అందుచేతనే ద్రవ్యోల్బణం తీవ్రమౌతున్న కాలంలో కార్మికవర్గంలో సమరశీలత, ప్రతిఘటన, పోరాటాలు పెరుగుతాయి.
    ఇప్పుడు సంపన్న, పశ్చిమ దేశాల్లో, ముఖ్యంగా యూరప్‌ దేశాల్లో మనకు కానవచ్చేది ఇదే. ముఖ్యంగా, బ్రిటన్‌ ఇందుకు తగిన ఉదాహరణ. బ్రిటన్‌లో 2022 జులైలో గతేడాదితో పోల్చినప్పుడు ద్రవ్యోల్బణం 10.1 శాతం పెరిగింది. ఇది గత 40 సంవత్సరాలలోకెల్లా అత్యధికం. ప్రస్తుతం బ్రిటన్‌ లో రైల్వే కార్మికులు, పోస్టల్‌ కార్మికులు, రేవు కార్మికులు వరసగా సమ్మెల్లో దిగుతున్నారు. ద్రవ్యోల్బణం ఫలితంగా పడిపోయిన తమ కొనుగోలు శక్తిని నిలబెట్టేందుకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. లాయర్లు, ఉపాధ్యాయులు కూడా సమ్మెలకు సిద్ధమౌతున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా పెరిగి ఈ ఏడాది చివరికి ఏకంగా 13 శాతానికి చేరుకుంటుందన్న అంచనాలు మరింతమంది కార్మికులను, ఉద్యోగులను పోరాటాల వైపు నెడుతున్నాయి.
      స్పెయిన్‌, గ్రీస్‌, బెల్జియం దేశాల్లో కూడా కార్మికులు ఇదే విధంగా వేతనాల పెంపు డిమాండ్‌ చేస్తున్నారు. యూరో జోన్‌ లో ద్రవ్యోల్బణం ఈ జులై లో 8.9 శాతానికి చేరింది. గతంలో తక్కిన యూరోపియన్‌ దేశాలకన్నా తక్కువ మోతాదులో కార్మికుల సమ్మెలు జరిగిన జర్మనీలో కూడా ఇప్పుడు అధిక వేతనాల కోసం సమ్మెలు పెరుగుతున్నాయి. నెదర్లాండ్స్‌లో రైల్వే కార్మికులు, జర్మనీలో ఎయిర్‌లైన్స్‌ కార్మికులు సమ్మెల్లో ఉన్నారు. శీతాకాలం రాబోతోంది. దానికి తోడు రష్యా మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనివలన ఆ కాలంలో ఎక్కువగా అవసరమైన ఇంధనానికి-ముడిచమురుకు, సహజ వాయువుకు-డిమాండ్‌ మరింత పెరుగుతుంది. ఇంధనం ధరలు పెరిగితే, దాని ప్రభావం మరింత వినాశకరంగా ఉంటుంది.
     సమ్మెలు పెరిగితే, వివిధ రకాల సరుకుల సరఫరా, సేవలు దెబ్బ తింటాయి. దాంతో సరుకుల, సేవల కొరత పర్యవసానంగా కలిగే ప్రభావం ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుంది.
     ఇంతటి తీవ్ర స్థాయిలో సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో సమ్మెలు జరగడం గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేదు. నయా ఉదారవాద విధానాలు ప్రపంచవ్యాప్తంగా అమలు జరగడం వలన పెట్టుబడిదారుల ఆధిపత్యం చాలా బలంగా ఈ కాలంలో కనిపించింది. వేతనాల వాటా చాలా దేశాల్లో తగ్గిపోయినా, కార్మికుల నుండి ప్రతిఘటన ఆ మోతాదులో వ్యక్తం కాలేదు. ప్రపంచంలో ఎక్కడికైనా పెట్టుబడిని యథేచ్ఛగా తరలించుకుపోయే అవకాశం ఉండడంతో, కార్మికుల మధ్య పోటీ పెరిగింది. అందువలనే కార్మికులు గట్టి ప్రతిఘటన ఇవ్వలేకపోయారు. ఉదాహరణకు: యూరోపియన్‌ కార్మికులు గట్టిగా ప్రతిఘటిస్తే, అప్పుడు పెట్టుబడిని ఆసియా దేశాలకు తరలించుకుపోయే క్రమం వేగం పుంజుకుంటుంది. ఆసియా దేశాల్లో వేతనాల స్థాయి తక్కువ. అందువలన సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో వేతనాల పెంపు డిమాండ్‌ ఇన్నాళ్ళూ అంత బలంగా ముందుకు రాలేదు.
    2008 లో వచ్చిన ఆర్థిక సంక్షోభం తర్వాత కోలుకుని సాధారణ పరిస్థితికి యూరప్‌ దేశాలు రావడం ఇంకా జరగలేదు. అవి పాక్షికంగానే కోలుకున్నాయి. నిరుద్యోగం పెరిగింది. కార్మికుల సమరశీలత బలపడకపోడానికి అది కూడా ఒక కారణం. దానికి తోడు, తూర్పు యూరప్‌ దేశాలలో సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయాక, ఆ దేశాల నుండి వలసలు వచ్చిన కార్మికుల శ్రమను చౌకగా పశ్చిమ దేశాల పెట్టుబడిదారులు పొందగలిగారు. దీని వలన కార్మికుల నడుమ పోటీ మరింత పెరిగింది. ఇది కూడా యూరోపియన్‌ కార్మికుల వేతనాల స్థాయిని తగ్గించివుంచడానికి దోహదం చేసింది.
    ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణంతో చాలా తీవ్రమైన మార్పులు కలుగుతున్నాయి. ఈ ద్రవ్యోల్బణం సకల కార్మికులనూ దెబ్బ తీస్తోంది. పెర్మనెంటు కార్మికులు గాని, పాక్షికంగా ఉపాధి పొందుతున్నవారు కాని, పనులు దొరకకుండా ఉన్నవారు కాని, ఎవరికైనా ఈ ద్రవ్యోల్బణం దుర్భరమే. అటు తూర్పు నుండి ఇటు పడమర వరకూ, అన్ని దేశాలలో, అన్ని తరహాల కార్మికుల నడుమ ఉండిన వైరుధ్యం చప్పబడి, వారి మధ్య పోటీని తగ్గిస్తోంది. పెరుగుతున్న ధరల ఫలితంగా ఏర్పడుతున్న దుర్భర పరిస్థితుల వలన కార్మికులందరిలో సమరశీలత పెరుగుతోంది. దాని లక్షణాలు ఇప్పుడు యూరప్‌లో పైకి కనపడుతున్నాయి. అందుచేత కార్మికుల వేతనాలను తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి జరిగే ప్రయత్నాలు అంత తేలికగా ముందుకు సాగేట్టు లేదు.
    ఉక్రెయిన్‌-రష్యా నడుమ యుద్ధం రాక మునుపు కూడా ద్రవ్యోల్బణం వేగం పెరుగుతూ వుండేది. కాని ఆ యుద్ధంతో దాని వేగం బాగా పెరిగింది. గతేడాది ద్రవ్యోల్బణంతో పోల్చితే యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో ఈ ఏడాది బాగా పెరిగింది. ఆగస్టు 2021లో 3.2 శాతం ఉంటే అది జనవరి 2022 నాటికి 5.6 శాతానికి, జులై 2022 నాటికి 9.8 శాతానికి పెరిగింది. ఉక్రెయిన్‌ యుద్ధం కేవలం రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు. తన ఆధిపత్యం బలహీనపడుతున్న సమయంలో ఎలాగైనా దానిని నిలబెట్టుకోడానికి సామ్రాజ్యవాదం చేస్తున్న ప్రయత్నం దీని వెనుక ఉంది. తన ఆధిపత్యాన్ని ఏదో ఒక విధంగా నిలబెట్టుకోడానికి తాపత్రయ పడుతున్న సామ్రాజ్యవాదం సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోని కార్మికవర్గాన్ని పీల్చి పిప్పి చేయాలని చూస్తోంది. కాని దాని పర్యవసానాలు ఆ సంపన్న పెట్టుబడిదారీ దేశాలను మరిన్ని చిక్కుల్లోకి నెట్టడం ఖాయం.

( స్వేచ్ఛానువాదం )
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌