Nov 01,2023 07:09

దేశానికి, రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ, విద్యార్థులకు ఉపాధి కల్పిస్తూ, దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తూ, సొంత గనులు లేకపోయినా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ లాభాలు గడించి, రూ. మూడు లక్షల కోట్ల ఆదాయం కలిగిన విశాఖ ఉక్కును కేవలం రూ. 13 వేల కోట్లకు అమ్మకానికి పెట్టడం దేశ ద్రోహం. బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తున్నా...అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేనలు మోడీకి భజన చేస్తున్నాయే తప్ప నోరెత్తి ఒక్క మాట అనట్లేదు. మన భవిష్యత్తు కోసం ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం స్టీల్‌ ప్లాంట్‌ ను నిలబెట్టుకోవడానికి ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటం 1000 రోజులుకు చేరుకుంటున్న సందర్భంగా ...ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రజా ఉద్యమంగా మార్చడానికి రాష్ట్రంలో విద్యార్థి, యువజన సంఘాలు పూనుకున్నాయి. నవంబర్‌ 8న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.

           నవంబరు 1 విశాఖ పట్నానికి ఒక చారిత్రాత్మక దినం. ఇదే రోజున 1966లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సాధన కోసం విద్యార్థులు నేలకొరిగారు. సంఘటన జరిగి 57 ఏళ్లు అవుతున్నా విద్యార్థుల నెత్తుటి తడి ఈ నేలపై ఇంకా సజీవంగానే ఉంది. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదం మారుమోగుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతామని ప్రకటించి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా అడుగు ముందుకు వేయలేకపోవడానికి కారణం ఆ నెత్తుటి వేడే. ఆనాటి పోరాట స్ఫూర్తే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటానికి ఊపిరి పోస్తోంది. నాటి విద్యార్థుల త్యాగాలే రేపు నవంబర్‌ 8న 'ఉక్కు మాదే - హక్కు మాదే' నినాదంతో దిక్కులు పిక్కటిల్లేలా రాష్ట్రంలో విద్యార్థుల్ని, యువకుల్ని బృహత్తర పోరాటానికి సంసిద్ధులను చేస్తోంది.
 

                                                               నాటి త్యాగాలే నేటి పోరాట ఆయుధాలు

అప్పట్లో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి విశాఖపట్నం అనువైనదని తేల్చింది. నాటి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో దీని సాధనకు పోరాటం ప్రారంభమైంది. అప్పటికే బంద్‌, హర్తాళ్‌, రైల్‌ రోకోలు ఆదిలాబాద్‌ నుండి శ్రీకాకుళం వరకు జరిగాయి. ఈ ఉద్యమాన్ని అణిచివేసినందుకు అక్రమ అరెస్టులు, లాఠీ చార్జీలు, లాకప్‌లో వేసి కొట్టడం వంటి నిర్బంధాలను ఎదిరించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మార్మోగింది. ఈ సందర్భంగానే 1966 నవంబర్‌ 1న విద్యార్థులు, యువకులు, మహిళలు విశాఖ ఎ.వి.యన్‌ కాలేజీ నుండి పాత పోస్టాఫీస్‌ వరకు పెద్ద ర్యాలీ చేపట్టారు. అలా వెళ్తున్న ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనపై మళ్ళీ కాల్పులు జరిపి ఇద్దరిని బలి తీసుకున్నారు. ఈ కాల్పులు జరిగి నేటికి 57 సంవత్సరాలు గడిచింది. ఉక్కు పరిశ్రమ సాధన కోసం ముక్కోటి ఆంధ్రులు ఒక్కటై జరిపిన పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వీరమరణం పొందారు. పోలీస్‌ కాల్పుల్లో 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. వేలాది మంది లాఠీ దెబ్బలు తిన్నారు. 67 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు. ఈ పోరాటాల ఫలితంగానే ఉక్కు పరిశ్రమను విశాఖలో స్థాపించుకున్నాము. దీనిని ఇప్పుడు మోడీ ప్రభుత్వం కారు చౌకగా అమ్మకానికి పెట్టింది. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మడం అంటే తెలుగు వాడి ఆత్మగౌరవం అమ్మడమే. ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆనాడు విద్యార్థులు ప్రాణ త్యాగం చేస్తే, వారి స్ఫూర్తితో నేడు విద్యార్థులు పోరాటానికి సిద్ధమయ్యారు. అమ్మకాన్ని అడ్డుకుంటున్నారు.
 

                                                          లాభాలు పొంది నష్టాల పేరుతో అమ్మేస్తున్నారు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నాడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి రూ.4900 కోట్లు మాత్రమే. ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తి కావడానికి ఈ సంస్థ అప్పుడే రూ.2500 కోట్లు అప్పు చేసి నిర్మించుకుంది. అలా నిర్మించి ఉత్పత్తి చేసి, లాభాలు సంపాదించి తన లాభాలు నుండి పన్నులు, డివిడెండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.54 వేల కోట్లు చెల్లించింది. ఇప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రూ.22 వేల కోట్ల అప్పులో ఉంది. అందుకే అమ్ముతున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కరోనా కాలంలో కార్పొరేట్లుకు రూ.68 వేల కోట్లు అప్పులు మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం. మరో రూ. రెండు లక్షల కోట్లు పన్నులు వసూలు చేయకుండా మినహా యింపు ఇచ్చింది. అదే సమయంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుండి ప్రతి రూపాయి వసూలు చేసింది. గత ఎనిమిదేళ్ళలో కార్పొరేట్‌ కంపెనీలకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ...ప్రభుత్వ రంగాన్ని మాత్రం అప్పుల పేరుతో అమ్మేస్తున్నాడు. ఇది దేశ ద్రోహం.
 

                                                                          నష్టాలకు కారకులు ఎవరు ?

ప్రైవేట్‌, కార్పొరేట్లు నడుపుతున్న స్టీల్‌ పరిశ్రమకు సొంత గనులు ఇచ్చిన ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వలేదు. దీనికి తోడు హుదూద్‌ తుఫాన్‌లో వందల కోట్లు నష్టం వచ్చినా పైసా ఇవ్వలేదు. రాయిబరేలీలో రైలు చక్రాల పరిశ్రమకు రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టించింది కేంద్రం. 2009లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.4 మిలియన్‌ టన్నుల నుండి 7.3 మిలియన్‌ టన్నులకు విస్తరించడానికి రూ.21 వేల కోట్ల పైచిలుకు ఖర్చయింది. ఇవన్నీ తన శక్తితో చేసి నిలదొక్కుకుంది తప్పితే ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. ఇప్పుడు అదానీని అడ్డుపెట్టుకొని గంగవరం పోర్ట్‌ నుండి సరఫరా అవ్వాల్సిన ఐరన్‌ ఓర్‌ను సరఫరా కానివ్వకుండా కుట్ర పన్నుతోంది. వర్కింగ్‌ క్యాపిటల్‌ రానివ్వకుండా అడ్డుకుంటోంది. కారణంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 మూసివేయాల్సి వచ్చింది. లాభాల్లో ఉన్న ప్లాంట్‌ను అష్టదిగ్బంధనం చేసి నష్టాల పాలుచేసి అమ్మేయాలని కుట్ర పన్నుతున్నది మోడీ ప్రభుత్వం.
 

                                                               ఉపాధి కల్పన కేంద్రంగా విశాఖ స్టీల్‌ పరిశ్రమ

68 గ్రామాల్లో 16,600 మంది ప్రజానీకం త్యాగాలు చేసి, 22 వేల ఎకరాలు భూమిని స్టీల్‌ పరిశ్రమ నిర్మాణానికి ఇచ్చారు. ఈ పరిశ్రమ ప్రారంభంలో నిర్వాసిత కుటుంబాలతో పాటు 7 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు 17,576 మంది పర్మినెంట్‌, మరో 15,600 మంది కాంట్రాక్ట్‌ సిబ్బందితో 2014 వరకు ప్రతి ఏడాదీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉంది. అనుబంధ పరిశ్రమల్లో మరో రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. 3.4 నుండి 7.3 మిలియన్‌ టన్నులకు విస్తరణ జరిగినప్పుడు అదనంగా 10,000 ఉద్యోగాలు వచ్చాయి. 20 మిలియన్‌ టన్నుల విస్తరణకు ప్రణాళిక ఉంది. ఇది పూర్తయితే మరో 20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉక్కు పరిశ్రమ ఉంది కాబట్టే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ ఉపాధి కల్పన కేంద్రంగా మారింది. ఏ ఒక్క ప్రైవేటు ఉక్కు పరిశ్రమలో ఇంతమంది ఉద్యోగులు లేరు. ఇది అమ్మేస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త ఉద్యోగాలు రావు. ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటిఐ చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు.
 

                                                            మన పరిశ్రమను మనమే కాపాడుకుందాం

దేశానికి, రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ, విద్యార్థులకు ఉపాధి కల్పిస్తూ, దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తూ, సొంత గనులు లేకపోయినా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ లాభాలు గడించి, రూ. మూడు లక్షల కోట్ల ఆదాయం కలిగిన విశాఖ ఉక్కును కేవలం రూ. 13 వేల కోట్లకు అమ్మకానికి పెట్టడం దేశ ద్రోహం. బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తున్నా...అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేనలు మోడీకి భజన చేస్తున్నాయే తప్ప నోరెత్తి ఒక్క మాట అనట్లేదు. మన భవిష్యత్తు కోసం ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం స్టీల్‌ ప్లాంట్‌ ను నిలబెట్టుకోవడానికి ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటం 1000 రోజులుకు చేరుకుంటున్న సందర్భంగా...ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రజా ఉద్యమంగా మార్చడానికి రాష్ట్రంలో విద్యార్థి, యువజన సంఘాలు పూనుకున్నాయి. నవంబర్‌ 8న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు నిచ్చాయి. నాటి విద్యార్థుల పోరాట స్ఫూర్తి, ఆ శక్తి తమలో ఉందని నిరూపించబోతున్నాయి. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాద శక్తిని మోడీకి చూపించేందుకు భుజం భుజం కలిపి రాష్ట్ర యువత ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
- ఎన్‌.అజయ్,
ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి,
సెల్‌ : 8790955181