Sep 02,2023 20:39

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ప్రొఫెసరు రాధాకృష్ణ కమిషన్‌ చెప్పిందని, కౌలు రైతుందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాధాకృష్ణ, ఎం హరిబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెరుగుతున్న కౌలు రీత్యా వీరిలో కనీసం 15 లక్షల మంది భూమిలేని కౌలు రైతులుంటారని ఒక అంచనా అని, రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెట్టి కేవలం 1,46,324 మందికి మాత్రమే రైతు భరోసా జమ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఒకవైపు 99 శాతం వాగ్దానాలను అమలు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ.. కౌలు రైతుల విషయంలో కనీసం 10 శాతం కూడా వాగ్దానాన్ని అమలు చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. ఎకరం లోపు కౌలు చేస్తూ సొంత భూమి లేని కౌలు రైతులకు రైతు భరోసా వర్తించడం లేదని, ఒక రైతు వద్ద ఒకరికి మించి నలుగురు, ఐదుగురు కౌలు చేస్తుంటే వారిలో ఒకరికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం అన్యాయమని అన్నారు. భూమి లేని ఒసి రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయకపోవడం అన్యాయమన్నారు. చట్టంలో అవసరమైన సవరణలు చేసి, నిబంధనలు మార్చి కౌలు రైతుకు రైతు భరోసా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.